హెరిటేజ్‌–ఇందాపూర్‌పై ప్రశ్నిస్తే ఉలుకెందుకు? | Botsa Satyanarayana Question To Chandrababu Naidu govt In Legislative Council | Sakshi
Sakshi News home page

హెరిటేజ్‌–ఇందాపూర్‌పై ప్రశ్నిస్తే ఉలుకెందుకు?

Feb 20 2026 5:33 AM | Updated on Feb 20 2026 5:33 AM

Botsa Satyanarayana Question To Chandrababu Naidu govt In Legislative Council

మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ

సాక్షి, అమరావతి: హెరిటేజ్‌ డెయిరీకీ, ఇందాపూర్‌ డెయిరీకి ఉన్న లింకులపై ప్రశ్నిస్తే ఉలుకెందుకని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తన వ్యాఖ్యలపై నోటీసులిచ్చి క్షమాపణ అడుగుతున్నారని, మరి తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యిపై అబద్ధాలు చెప్పి కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసినందుకు చంద్రబాబు కూడా ఎందుకు క్షమాపణ చెప్పరని బొత్స సూటిగా ప్రశ్నించారు. ఇది వ్యక్తిగత విషయం కాదని.. ప్రజా సమస్య అని, అందుకే ఏం జరిగిందో ప్రజలకు చెప్పి తీరాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద.. మండలిలోని తన ఛాంబర్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బొత్స ఏమన్నారంటే..

దేవదేవుడికి, భక్తులకు బాబు క్షమాపణ చెప్పాలి..
మండలిలో అజెండా ప్రకారం కార్యకలాపాలు ముందుకు సాగాలి. బడ్జెట్‌పై చర్చ జరగాలి. అదే సమయంలో లడ్డూ నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్‌ డెయిరీ మీద కూడా చర్చ జరగాలి. హెరిటేజ్‌ సంస్థ క్షమాపణలు చెప్పాలని మాకు నోటీసులు పంపింది. కానీ, అవి నాకు ఇంకా అందలేదు. నిజానికి.. 22 ఏళ్ల క్రితం రామోజీరావు ఇలాగే నాకు లీగల్‌ నోటీసు ఇచ్చారు. ఆ తరువాత వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు అండ్‌ కో మళ్లీ నాకు లీగల్‌ నోటీసు అని అంటున్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన తిరుమల శ్రీవారి లడ్డూల్లో పంది కొవ్వు.. జంతు కొవ్వు ఉంది అని చంద్రబాబు ఆరోపణలు చేశారు.

అలాగే, సిట్‌ రిపోర్ట్‌ వచ్చిందంటూ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, బీజేపీ నేతలు ప్రెస్‌మీట్‌ పెట్టారు? అయితే, లడ్డూ నెయ్యిలో యానిమల్‌ ఫ్యాట్, పంది కొవ్వులేదని సీబీఐ సిట్‌ రిపోర్టులో తేల్చిచెప్పింది. ఇప్పుడు అలాగే ప్రెస్‌మీట్‌ పెట్టి క్షమాపణలు అడగాలి. జంతువుల కొవ్వు ఉంది అని సీబీఐ రిపోర్టు ఇస్తే సభలో పెట్టమనండి. చంద్రబాబు కోట్లాది మంది భక్తులకు, దేవ దేవుడికి క్షమాపణ చెప్పాలి. ఈ రోజుకీ నేను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నా. అందుకే మండలిలో దీనిపై చర్చ జరగాలని కోరుకుంటున్నాం. సాక్ష్యాలుంటే చర్చకు రావాలి లేదా చర్చకు వస్తే సాక్ష్యాలు చూపిస్తాం. దేశంలోనే ఎన్నో అవార్డులు, రివార్డులు పొందిన సంస్థ హెరిటేజ్‌ అని అంటున్నారు. కానీ, కేరళ ప్రభుత్వం ఆ సంస్థ ఉత్పత్తులను బ్యాన్‌ చేసింది. మరో రాష్ట్రంలో రూ.లక్ష జరిమానా వేశారు. అలాంటి సంస్థకు మేం క్షమాపణ చెప్పాలా.. సిగ్గు చేటు. 

హెరిటేజ్‌ వెబ్‌సైట్‌లోనే ఇందాపూర్‌ ప్రస్తావన..
అసలు ఇందాపూర్‌ సంస్థ హెరిటేజ్‌కి కో–మాన్యుఫ్యాక్చర్‌ సంస్థ అని టీడీపీ నేత కుటుంబరావే చెప్పారు. ఆయన తప్పు చెబుతారని నేను అనుకోవడంలేదు. అలాగే, హెరిటేజ్‌ నెయ్యి ప్యాకెట్‌ మీద ఇందాపూర్‌ డెయిరీ పేరు కనిపిస్తుందని చెప్పాను. దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు? అసలు హెరిటేజ్‌ వెబ్‌సైట్‌లోనే ఇందాపూర్‌ గురించి చెప్పారు. ఏ తప్పు చేయకపోతే హెరిటేజ్‌ వెబ్‌సైట్‌ ఎందుకు మార్చారు? అసలు శాసన మండలిలో ఈ అంశంపై చర్చ జరగాలని ప్రభుత్వానికి ఉందా? లేదా? మూడ్రోజుల నుంచి అడుగుతున్నాం.. అయినా చంద్రబాబు ప్రభుత్వం చర్చకు రాకుండా ఎందుకు పారిపోతోంది. చర్చ పెడితే ఆధారాలు బయటకొస్తాయి. మండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యులు మాట్లాడితే లైవ్‌ ఇవ్వడంలేదు. దీనిపై చైర్మన్‌కు ఫిర్యాదు చేస్తాం. కేవలం టీడీపీ వాళ్లు మాట్లాడితేనే లైవ్‌ ఇస్తున్నారు. సభ్యులందరిదీ లైవ్‌ ఇవ్వాల్సిందే. 

టీటీడీ చైర్మన్‌గా బీఆర్‌ నాయుడు ఉండటం దురదృష్టకరం..
టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు తాను టీడీపీ మనిషినని స్వయంగా చెబుతున్నారు. అలాంటి వ్యక్తి టీటీడీ చైర్మన్‌గా ఉండడం దురదృష్టకరం. ఆయన ఆ పదవికి రాజీనామా చేసి మాట్లాడితే సమా­ధానం ఇస్తాం. ఆ పదవిలో ఉన్నప్పుడు ఆలోచించి మాట్లాడాలి.

మండలిలో ‘హెరిటేజ్‌’ మంటలు
ఇందాపూర్‌–హెరిటేజ్‌ బంధంపై చర్చకు వైఎస్సార్‌సీపీ సభ్యుల పట్టు
ఎదురు దాడికి దిగిన పాలకపక్షం
ఆధారాలు తెస్తే వంద రోజులైనా చర్చిస్తామన్న అచ్చెన్నాయుడు
‘ఆధారాలివిగో.. చర్చకు సిద్ధమా’ అని విపక్ష నేత బొత్స సవాల్‌
మూడో రోజూ స్తంభించిన పెద్దల సభ

సాక్షి, అమరావతి: శాసనమండలిలో హెరిటేజ్‌ డెయిరీ వ్యవహారం గురువారం కూడా మాటల మంటలు రేపింది. ఇందాపూర్‌ డెయిరీతో హెరిటేజ్‌ బంధాన్ని నిగ్గు తేల్చాలని మూడో రోజున కూడా వైఎస్సార్‌సీపీ పట్టుబట్టడంతో మండలి సమావేశం స్తంభించింది. విపక్ష సభ్యులపై అధికార పక్షం ఎదురు దాడికి దిగడంతో మూడుసార్లు వాయిదాపడింది. మండలి సమావేశాలను కేవలం 16 నిమిషాలు మాత్రమే నిర్వహించిన చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు సభను శుక్రవారానికి వాయిదా వేశారు. గురువారం ఉదయం 10.04 గంటలకు సభ ప్రారంభం కాగా.. బడ్జెట్‌పై నాలుగు రోజులు చర్చించాల్సి ఉందని, సభ్యులు సహకరించాలని కోరిన చైర్మన్‌ తొలుత ప్రభుత్వ బిల్లులను ప్రస్తావించారు.

 అనంతరం హెరిటేజ్‌ సంస్థకు అనుబంధంగా ఉన్న ఇందాపూర్‌ డెయిరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం, తిరుమల లడ్డూ వ్యవహరంపై చర్చకు వైఎస్సార్‌సీపీ సభ్యులు రామసుబ్బారెడ్డి, వరుదు కళ్యాణి, మొండితోక అరుణకుమార్‌ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్‌ తిరస్కరించారు. హెరిటేజ్‌–ఇందాపూర్‌ డెయిరీ బంధం, తిరుమల లడ్డూకు ఇందాపూర్‌ నెయ్యి సరఫరాపై చర్చించాలని మూడు రోజులుగా కోరుతున్నామని, ఈ రోజైనా చర్చకు అనుమతించాలని వైఎస్సార్‌సీపీ సభ్యులు పట్టుబట్టారు. ఒకసారి తిరస్కరించాక అదే అంశంపై చర్చ కోరడం సరికాదని చైర్మన్‌ ప్రకటించారు. చర్చకు అనుమతించాలి్సందేనని పోడియం వద్దకు దూసుకెళ్లిన సభ్యులు ప్లకార్డులు చేతబూని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ‘హెరిటేజ్‌ నెయ్యి కల్తీ.. కల్తీ, భోలేబాబా.. చంద్రబాబా, చంద్రబాబా.. ఆలీబాబా, ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. 

అచ్చెన్నాయుడు ఎదురుదాడి
ఇందాపూర్‌ డెయిరీ పేరిట హెరిటేజ్‌ ద్వారా ఎలా దోచుకున్నారో రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిందేనని.. ఈ అంశంపై చర్చకు పాలకపక్షం ఎందుకు భయపడుతోందని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. దీంతో మంత్రి కె.అచ్చెన్నాయుడు తీవ్ర స్వరంతో ఎదురుదాడికి దిగారు. ‘మీరు అడిగిన వాటికి నిన్న, మొన్న ప్రభుత్వం తరఫున స్పష్టమైన ఆన్సర్‌ చేశాం. మూడు రోజులుగా కావాలని హెరిటేజ్‌ సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ఈ అంశాన్నే తెస్తున్నారు. బొత్స సత్తిబాబును నేను ఒక్కటే అడుగుతున్నా. ఇందాపూర్‌ డెయిరీకి, హెరిటేజ్‌కు ఉన్న సంబంధంపై ఒక్క ఆధారం చూపించినా ఒక గంట కాదు, రోజు కాదు, పది రోజులు కాదు, వంద రోజులైనా చర్చించేందుకు సిద్ధం.

బొత్స బయట ప్రెస్‌మీట్‌లో ఆధారాలు అంటూ చీజ్‌ ప్యాకెట్‌ చూపించి నెయ్యి అని చెప్పారు. దానిపై హెరిటేజ్‌ సంస్థ లీగల్‌ నోటీసు ఇచ్చింది. సమాధానం చెప్పాలని అడగటానికి సిగ్గు ఉండాలి’ అంటూ ఎదురు దాడికి దిగారు. మంత్రి అచ్చెన్నాయుడు మాటలకు ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ బదులివ్వాలని చైర్మన్‌ మోషేన్‌రాజు కోరగా.. ఆయనకు ఎందుకు అవకాశం ఇస్తున్నారంటూ మండలిలో చీఫ్‌ విప్‌ పంచుమర్తి అనురాధ, టీడీపీ ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ పోడియం వైపు దూసుకువచ్చారు. బొత్స మాట్లాడకుండా టీడీపీ ఎమ్మెల్సీలు అడ్డు తగలడంతో గందరగోళం నెలకొంది.

దీంతో చైర్మన్‌ 10.15 గంటలకు సభకు కొద్దిసేపు విరామం ప్రకటించారు. తిరిగి 10.57 గంటలకు సభ ప్రారంభమయ్యాక చర్చ కోసం వైఎస్సార్‌సీపీ సభ్యులు పట్టువీడకుండా పోడియం వద్ద నినాదాలు చేయడంతో 11 గంటలకు చైర్మన్‌ మరోసారి సభను వాయిదా వేశారు. సుదీర్ఘ విరామం తర్వాత 12.42 గంటలకు సభను ప్రారంభించిన చైర్మన్‌ ఒక ప్రశ్న మాత్రమే పూర్తికావడంతో మిగిలిన అన్ని ప్రశ్నోత్తరాలను డీమ్‌్డగా ప్రకటించారు. ఇందాపూర్‌ ద్వారా హెరిటేజ్‌ నెయ్యి సరఫరాపై చర్చ జరపాల్సిందేనని మళ్లీ వైఎస్సార్‌సీపీ సభ్యులు పోడియం వద్ద నిరసన కొనసాగించారు.

‘ఆధారాలివిగో.. చర్చకు రండి’
ఈ సందర్భంగా విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఇందాపూర్‌ డెయిరీ ద్వారా హెరిటేజ్‌ నెయ్యి సరఫరా చేయడంపై చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. తాము మాట్లాడుతుంటే అధికారపక్ష సభ్యులు అంతమంది ఎందుకు అడ్డుపడుతున్నారని నిలదీశారు. ఇందాపూర్‌ డెయిరీ పేరుతో హెరిటేజ్‌ సంస్థ రాష్ట్రాన్ని దోచుకుంటోందని, హెరిటేజ్‌ కోసం చంద్రబాబు కుటుంబం ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకుంటోందో చెప్పేందుకే చర్చకు అనుమతించాలని అడుగుతున్నామన్నారు. లడ్డూను వివాదం చేసి ఆ దేవదేవుడిని చంద్రబాబు వీధుల్లో పెట్టారని, టీటీడీ సొమ్ము ఇందాపూర్‌ ద్వారా దోపిడీ చేశారన్నారు. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఎప్పుడైనా చూశామా అని ప్రశ్నించారు.

‘మీ వెబ్‌సైట్‌లో ఏదైతే ఉందో ఆ వివరాలను.. ఇదిగో పంపిస్తాను చూడండి’ అంటూ బొత్స ఆధారాలు చూపించారు. ‘ఇవిగో ఆధారాలు. ఇప్పుడు చర్చకు రండి’ అని సవాల్‌ విసిరారు. దీంతో టీడీపీ సభ్యులు వెల్‌లోకి వచ్చి ప్రతి విమర్శలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. సభలో ఈలలు వేయొద్దని వారించిన చైర్మన్‌ 12.44 గంటలకు సభను శుక్రవారం నాటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తానికి మూడుసార్లు వాయిదా పడిన సభ కేవలం 16 నిముషాల మాత్రమే జరగడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement