అంకెలతో మోసం.. ప్రతి అడుగులో పతనం: వైఎస్‌ జగన్‌ | YSRCP President YS Jaganmohan Reddy Fires On Chandrababu Govt Budget | Sakshi
Sakshi News home page

అంకెలతో మోసం.. ప్రతి అడుగులో పతనం: వైఎస్‌ జగన్‌

Feb 20 2026 4:25 AM | Updated on Feb 20 2026 4:25 AM

YSRCP President YS Jaganmohan Reddy Fires On Chandrababu Govt Budget

ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ ఇది సీఎం చంద్రబాబు మూడో బడ్జెట్‌

కాగ్‌ గణాంకాలను ఉటంకిస్తూ.. బడ్జెట్‌లో లోపాలను ఎండగడుతూ బాబు సర్కారును నిలదీసిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

సూపర్‌ సిక్స్, సెవెన్‌ హామీలను అమలు చేసినట్లు గోబెల్స్‌ ప్రచారం 

మూలధన వ్యయంపై పొంతన లేని లెక్కలు 

కనీసం సవరించిన అంచనాలను చేరుకోవడంలోనూ విఫలం 

రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో 1.99% వృద్ధితో దేశంలో 22వ స్థానంలో ఏపీ

మోసపూరిత అంకెలతో.. వృద్ధి రేటులో దూసుకుపోతున్నామంటూ బాబు తన డప్పు తానే కొట్టుకుంటున్నారు

సాక్షి, అమరావతి: అవే పచ్చి అబద్ధాలు.. తప్పుడు లెక్కలు.. చంద్రబాబు భజన.. బడ్జెట్‌ అంతా మోస మే..! అని టీడీపీ కూటమి సర్కారుపై వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఇప్పటివరకు ప్రవేశ పెట్టిన మూడు బడ్జెట్‌ల ద్వారా రాష్ట్రానికి, ప్రజల కు చంద్రబాబు చేసిన మంచి ఎక్కడా కనిపించద ని.. అంతా మోసమేనని దుయ్యబట్టారు. సూపర్‌ సిక్స్, సెవెన్‌ హామీలను అమలు చేయలేక.. అట్టర్‌ ప్లాప్‌ అయినా, సూపర్‌ హిట్‌ అంటూ నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతూ గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘మోసానికి షర్టు, ఫ్యాంట్‌ వేస్తే అది చంద్రబాబు. అబద్ధాలకు రెక్కలు కడితే అవి చంద్ర బాబు మాటలు’’ అని విమర్శించారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కూటమి సర్కార్‌ ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్‌లో అంకెల గారడీ, ప్రజలను మోసగిస్తున్న తీరును నిలదీశారు. కాగ్‌ (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) నివేదికలో పొందుపరిచిన గణాంకాలను ఉటంకిస్తూ బడ్జెట్‌ అంచనాలు, సవరించిన అంచనాల్లో తప్పుడు లెక్కలను ఎండగట్టారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..

ఫ్యాబ్రికేటెడ్‌ అంకెలతో డప్పు..
ప్రజలను వరుసగా వెన్నుపోటు పొడిచి వంచిస్తూ చంద్రబాబు ప్రభుత్వం మూడో బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. తాను ఇస్తానన్న సూపర్‌ సిక్స్, సెవెన్, మ్యానిఫెస్టో హామీలు గాలికి ఎగిరిపోయాయి. అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ పెట్టిన బడ్జెట్‌ ఇది. రాష్ట్ర ప్రగతి, ఆర్థిక వ్యవస్థ గురించి చంద్రబాబు మాటలేమో కోటలు దాటుతాయి.. వాస్తవ లెక్కలు చూస్తే మాత్రం గడప కూడా దాటని పరిస్థితి కని పిస్తుంది. చంద్రబాబు పాలనంతా పబ్లిసిటీ పీక్, ఫెర్మామెన్స్‌ వీక్‌. 2024–25లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు (జీఎస్‌డీపీ) 11.75 శాతంగా చంద్రబాబు చెప్పుకొస్తారు. దేశ జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటు 9.8%  మాత్రమేనని.. దేశం కంటే రాష్ట్రం ఆర్థిక వృద్ధిలో దూసుకుపోతోందంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటారు. ఇక 2025–26 రాష్ట్ర జీఎస్‌డీపీ గ్రోత్‌రేటు 10.75 శాతంగా తన ఆఫీసులో కూర్చుని అంకెలు రాసుకుంటారు. ఇదే సమయంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 8 శాతమేనని.. దేశం కంటే ఆర్థిక వృద్ధిలో రాష్ట్రం దూసుకెళ్తోందంటూ తన డబ్బా తానే మోగించడం మొద లుపెడతారు. ఫ్యాబ్రికేటెడ్‌ (మోసపూరిత) అంకెలతో తన డప్పు తానే కొట్టుకోవడం మనకంతా కనిపిస్తూనే ఉంది. 

అసమర్థ ఆర్థిక నిర్వహణకు ఇది సాక్ష్యం కాదా?
రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధిరేటులో ఉంది అంటే.. రాష్ట్రంలోని అన్ని రంగాలు పురోగతి సాధిస్తున్నాయని అర్థం. వ్యవసాయం, తయారీ, సేవలు రంగాలు వేగంగా పరిగెడుతున్నాయని దాని అర్థం. మరి చంద్రబాబు చెప్పిన ఆ లెక్కలు నిజమే అయితే.. జీఎస్‌డీపీ ఆ విధంగా పెరిగి ఉంటే అది ప్రజల తలసరి ఆదాయంలో కూడా ప్రతిబింబించాలి కదా? అదే రీతిలో తలసరి ఆదాయం పెరిగి ఉండాలి కదా? తలసరి ఆదాయం నిజంగానే పెరిగి ఉంటే.. తద్వారా ప్రజల కొనుగోళ్ల శక్తి కూడా పెరిగి ఉండాలి కదా? తద్వారా ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయాలు కూడా పెరిగి ఉండాలి కదా?  ఇదంతా ఒక సైకిల్‌! మరి వాస్తవంగా ఇది జరిగిందా..? అని ఒకసారి పరిశీలిస్తే.. చంద్రబాబు అధికారం చేపట్టిన తొలి సంవత్సరం 2024–25లో రాష్ట్ర సొంత ఆదాయం రూ.1,19,927 కోట్లు వస్తుందని బడ్జెట్‌లో చెప్పారు. 

కానీ ఆ ఏడాది వాస్తవంగా వచ్చిన ఆదాయం రూ.94,937 కోట్లు మాత్రమే. ఆశ్చర్యం ఏమిటంటే.. 2023–24 వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చివరి సంవత్సరంలో రాష్ట్ర సొంత ఆదాయం రూ.93,084 కోట్లతో పోలిస్తే.. పెరుగుదల కేవలం 1.99 శాతం మాత్రమే. అంటే బడ్జెట్‌లో చంద్రబాబు లెక్కలేసిన రూ.1,19,927 కోట్లు గాలికి ఎగిరిపోయాయి. ఇక 2025–26లో కూడా వాస్తవంగా రూ.94,937 కోట్లు వచ్చినట్లు కనిపిస్తుంటే.. బడ్జెట్‌ గారడీతో రాష్ట్ర సొంత ఆదాయాలు రూ.1,27,703 కోట్లుగా చంద్రబాబు చూపించారు. కానీ.. పది నెలలకు సంబంధించి కాగ్‌ విడుదల చేసిన డేటా చూస్తే 2025–26లో రాష్ట్ర సొంత ఆదాయం రూ.75,964 కోట్లు మాత్రమే వచ్చింది. అదే అంతకుముందు పది నెలల కాలానికి (2024–25) వచ్చింది రూ.72,864 కోట్లు. అంటే.. పెరుగుదల కేవలం 4.25 శాతం మాత్రమే. 

పది నెలల కాలానికి రూ.75,964 కోట్ల ఆదాయం వస్తే.. బడ్జెట్‌లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం ఏకంగా రూ.1,27,703 కోట్లు వస్తుందని చూపించారు. మరో రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా వాస్తవాలు చెప్పకుండా.. ఇంకా మోసం చేస్తూ దాన్ని రూ.1,12,349 కోట్లుగా సవరించారు. అంటే.. మిగిలిన రెండు నెలల కాలంలో ఏకంగా రూ.36,385 కోట్ల మేర ఆదాయాలు వస్తాయని గారడీ లెక్కలు చూపించారు. 2025–26లో రాష్ట సొంత పన్నుల ఆదాయం నెలకు సగటున రూ.7,596 కోట్లే. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే ఈ ఏడాది మొత్తం మీద రూ.95,000 కోట్లు వస్తే గగనం. కానీ ఈ పెద్ద మనిషి మళ్లీ 2026–27లో రాష్ట్ర సొంత ఆదాయాలు ఏకంగా రూ.1,37,320 కోట్లు వస్తాయని చూపిస్తున్నారు. అంటే రాష్ట్ర సొంత ఆదాయంలో దాదాపు 45 శాతం పెరుగుదల!! అది సాధ్యమేనా? గత బడ్జెట్‌లో కూడా ఇలాగే చూపిస్తే వచ్చిన వృద్ధి రేటు కేవలం 3.4 శాతమే. 

దేశంలో చిట్ట చివరి నుంచి రెండో స్థానం..
నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) మొదటి తొమ్మిది నెలలు రాష్ట్ర సొంత పన్నుల ఆదాయాలను మా ప్రభుత్వ హయాంలో 2023–24 తొమ్మిది నెలల ఆదాయాలతో పోలిస్తే సగటు వృద్ధిరేటు 1.97 శాతం మాత్రమే. ఈమధ్య కాగ్‌ 23 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను విడుదల చేసింది. ఈ రెండేళ్లలో సొంత పన్నుల ఆదాయాల వృద్ధిని పరిశీలిస్తే సగటున 1.97 శాతంతో మన రాష్ట్రం దేశంలో 23 రాష్ట్రాల్లో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. బాబు అసమర్థత ఆర్థిక నిర్వహణకు ఇది సాక్ష్యం కాదా?  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement