కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో కేసీ వేణుగోపాల్, మహేశ్‌కుమార్‌గౌడ్, వంశీచంద్‌రెడ్డి, కొండా సురేఖ, వివేక్, పొంగులేటి, మీనాక్షి నటరాజన్, సీతక్క, కోమటిరెడ్డి, భట్టి, అజహరుద్దీన్, రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి, అడ్లూరి లక్ష్మణ్, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, శ్రీధర్‌బాబు
పట్నంలో కమలం.. పల్లెలో గులాబీ
రాష్ట్ర కాంగ్రెస్ నేతలను అప్రమత్తం చేసిన హైకమాండ్
కాంగ్రెస్ పటిష్టంగా ఉన్నా, బీఆర్‌ఎస్, బీజేపీ కూడా బలంగానే ఉన్నాయి
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 29%, బీజేపీ 16% ఓట్లు సాధించాయి
జాతీయ, ప్రాంతీయ వాదాలతో జనంలోకి వెళ్లే అవకాశాలున్నాయి
అభివృద్ధి మంత్రంతో ఐక్యంగా వాటిని అడ్డుకోవాలి
యువత, మహిళలను మరింతగా కాంగ్రెస్‌కు చేరువ చేయాలి
ఎంఐఎం ఎంత విస్తరిస్తే బీజేపీ అంత ఎదుగుతుందన్న రాహుల్!
ఉత్తరాదిలో బీజేపీ ఎదుగుదలకు ఎంఐఎం పరోక్షంగా సహకరిస్తోందని వ్యాఖ్య
సమ్మక్క, సారలమ్మ చరిత్రపై జాతీయ స్థాయి సినిమా తీయాలని సూచన
రాష్ట్రంలో సామాజిక న్యాయం కొనసాగిస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి
ముఖ్యమంత్రి, మంత్రులు, పీసీసీ చీఫ్‌తో అధిష్టానం భేటీ.. విడివిడిగానూ చర్చలు
మార్చి 15 నాటికి పదవుల పంపకాలు పూర్తి చేయాలని ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పార్టీ పటిష్టంగా ఉన్నప్పటికీ..ఏమాత్రం ఏమరుపాటు తగదని, ప్రధాన పక్షాలైన బీజేపీ, బీఆర్‌ఎస్‌లు సైతం బలంగా ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తతతో వ్యవహరించాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ స్పష్టం చేసింది. సామాజిక న్యాయం అంశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నప్పటికీ..జాతీయవాదం, ప్రాంతీయ వాదం నినాదాలతో ప్రతిపక్షాలు జనంలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించింది. రెండు పార్టీల ను ఎప్పటికప్పుడు ఐకమత్యంతో సమర్థంగా ఎదుర్కోవాల ని సూచించింది.
గురువారం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ సహా మంత్రులందరితో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాందీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. ఖర్గే నివాసంలో సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో భాగంగా.. ముఖ్యమంత్రి, మంత్రులందరితో కలిపి ఒకసారి, విడివిడిగా మరోసారి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీల బలాబలాలు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో సాధించిన ఫలితాలతో పాటు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకా లు, వాటి అమలుకు చేసిన ఖర్చు తదితరాలపై నేతలకు సీఎం రేవంత్ వివరణ ఇచ్చారు. అనంతరం పలు అంశాలపై రాష్ట్ర నేతలకు ఏఐసీసీ పెద్దలు దిశా నిర్దేశం చేశారు.
బలం మరింత పెంచుకునేందుకు ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి..
‘ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ప్రదర్శన కనబరిచింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్, పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 29 శాతం ఓట్లు సాధిస్తే, బీజేపీ 16 శాతం ఓట్లు రాబట్టుకుంది. సర్పంచ్ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌కు 30 శాతం సీట్లు వచ్చాయి. బలం మరింత పెంచుకునేందుకు రెండు పార్టీలు గట్టిగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం అప్రమత్తంగా ఉండాలి. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసుకుంటేనే ఆ పార్టీలను నిలువరించగలం. దీనికి తోడు కొన్ని సామాజిక వర్గాల్లో ఈ రెండు పార్టీలు పట్టు సాధిస్తున్నాయి. దీనిని అభివృద్ధి మంత్రంతో అడ్డుకోవాలి. యువత, మహిళలను మరింతగా పార్టీకి చేరువ చేయాలి..’ అని కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినట్లు తెలిసింది.
ఎంఐఎంపై విస్తృతంగా చర్చిద్దాం
బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలను నిలువరించడంతో పాటు ఎంఐఎంను కట్టడి చేసే అంశం రాహుల్‌గాంధీ ప్రస్తావించినట్లు తెలిసింది. ఎంఐఎం ఎంతగా విస్తరిస్తే అంతగా బీజేపీ ఎదుగుతుందని, ఇప్పటికే అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఎదుగుదలకు ఎంఐఎం పరోక్షంగా సహకరిస్తోందని వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఎంఐఎంను కాంగ్రెస్ భాగస్వామిగా ప్రజలు భావిస్తే గ్రామీణ ప్రాంతాల్లో హిందువుల ఓట్లలో చీలిక వచ్చే అవకాశాలపై అనుమానాలు లేవనెత్తినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై మరోమారు విస్తృతంగా చర్చిద్దామని ఖర్గే అన్నట్టు చెబుతున్నారు.
బీసీలకు ప్రాధాన్యత ఇచ్చామన్న సీఎం
ముఖ్యమంత్రి మాట్లాడుతూ..‘ఇటీవలి ఎన్నికల్లో సామాజిక న్యాయం పాటించాం. పార్టీ చెబుతున్నట్టుగానే బీసీలకు మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ పోస్టుల్లో ప్రాధాన్యతనిచ్చాం. ఇకపైనా ఇదే విధానాన్ని కొనసాగిస్తాం..’ అని చెప్పినట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర నేతల చిత్తశుద్ధిని ప్రశంసిచిన హైకమాండ్ పెద్దలు.. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా అడ్డుకున్న బీజేపీ తీరును మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్లు సమాచారం. పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం అవసరమని మీనాక్షి నటరాజన్ సూచించగా, దీనిపై పీసీసీ అధ్యక్షుడు దృష్టి సారించాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ నేతల భాగస్వామ్యం ఉండేలా చూసుకోవాలని చెప్పినట్లు తెలిసింది. కాగా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. తమతమ శాఖల పరిధిలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. «రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేశామని ఉత్తమ్ చెప్పారు.
మార్చి 15 నాటికి పదవుల పంపకాలు
ఎన్నో నెలలుగా పెండింగ్‌లో ఉన్న పార్టీ, నామినేటెడ్ పదవుల భర్తీకి ఈ భేటీలో హైకమాండ్ పెద్దలు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. సామాజిక సమతుల్యతను పాటిస్తూ, అన్ని వర్గాలకు, పార్టీ కోసం పనిచేసిన నిజమైన కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని సూచించారు. మార్చి 15 నాటికి రాష్ట్ర స్థాయి పదవుల కేటాయింపు పూర్తిచేసి, ఆ తర్వాత మరో పది రోజుల్లో జిల్లా స్థాయి పదవులను భర్తీ చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ పదవుల్లో బీసీలకు పెద్దపీట వేయాలని సూచించినట్లు తెలిసింది. వీటితో పాటు చీఫ్ విప్, రెండు విప్ పదవుల భర్తీపైనా చర్చ జరిగిందని సమాచారం. రెడ్డి లేదా వెలమ సామాజికవర్గ నేతకు చీఫ్ విప్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు పార్టీ కార్యవర్గ కూర్పుపైనా చర్చించారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌లలో బీసీలు మినహా మిగతా అన్ని సామాజిక వర్గ నేతలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది.
పిలిస్తే మేడారం వచ్చే వాళ్లం కదా..
సమ్మక్క, సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించినందుకు మంత్రి సీతక్కను అగ్రనేతలు అభినందించారు. మేడారం జాతర చరిత్ర, ప్రాశస్త్యం గురించి మంత్రి వివరించగా..ఖర్గే, రాహుల్‌లు మరింత సమాచారం అడిగి తెలుసుకున్నారు. సమ్మక్క, సారలమ్మల చరిత్రను దేశవ్యాప్తంగా పరిచయం చేసేలా జాతీయ స్థాయి సినిమా రూపొందించాలని రాహుల్ సూచించినట్లు సమాచారం. మేడారం జాతరకు ఆహ్వానిస్తే తప్పకుండా హాజరయ్యేవారమని రాహుల్, ఖర్గే అనగా..సమయాభావంతో వ్యక్తిగతంగా ఆహ్వానించలేకపోయినట్లు సీతక్క వివరణ ఇచ్చారు. ఈసారి తప్పకుండా అధికారిక ఆహా్వనం అందజేస్తామని చెప్పారు. ఆహ్వానం అందితే తప్పక వస్తామని రాహుల్, ఖర్గే అన్నారు. కాగా అందరితో కలిసి చర్చించిన పార్టీ అగ్రనేతలు, అనంతరం మంత్రుల కోరిక మేరకు విడివిడిగా ఒక్కో నేతతో 5–10 నిమిషాల పాటు మాట్లాడారు. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు, మీనాక్షి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సురేఖ పలు అంశాలపై వారితో చర్చించినట్లు తెలిసింది.


