రాజ్యసభ అభ్యర్థులపై త్వరలో స్పష్టత | PCC chief Mahesh Kumar Goud Clarity on Rajya Sabha candidates soon | Sakshi
Sakshi News home page

రాజ్యసభ అభ్యర్థులపై త్వరలో స్పష్టత

Feb 20 2026 4:17 AM | Updated on Feb 20 2026 4:18 AM

PCC chief Mahesh Kumar Goud Clarity on Rajya Sabha candidates soon

పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌  

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాలకు పార్టీ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం వద్ద చర్చ జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. రెండు, మూడురోజుల్లో తనతో పాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మరోసారి చర్చిస్తామని హైకమాండ్‌ చెప్పిందన్నారు. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన నేతల భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణపై చర్చ జరగలేదని, దీనిపై సీఎం హైకమాండ్‌తో మాట్లాడతారని మహేశ్‌గౌడ్‌ చెప్పారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని త్వరలోనే ఢిల్లీకి పిలిపించి మాట్లాడతామని ఏఐసీసీ చెప్పిందన్నారు. 

అన్ని అంశాలపై రాహుల్‌ ఆరా: ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల విధి విధానాలను, రాష్ట్రానికి సంబంధించి రాజకీయంగా, ప్రభుత్వ పరమైన అన్ని అంశాలపై రాహుల్‌ గాంధీ ఆరా తీశారని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించినందుకు హైకమాండ్‌ అభినందించిందని చెప్పారు. రాష్ట్ర మంత్రుల అభిప్రాయాలను పార్టీ పెద్దలు విన్నారని, అన్ని అంశాలపై తమకు దిశానిర్దేశం చేశారని తెలిపారు. తమ ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల సమయం ఉందని, హామీలన్నీ అమలు చేసి, శభాష్‌ అనిపించుకుని, మళ్లీ అధికారంలోకి వస్తామని మహేశ్‌గౌడ్‌ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement