క్రిటికల్‌ మినరల్స్‌ రంగంలో గ్లోబల్‌ హబ్‌గా భారత్‌ | Union Minister Kishan Reddy at FICCI Critical Minerals Conference | Sakshi
Sakshi News home page

క్రిటికల్‌ మినరల్స్‌ రంగంలో గ్లోబల్‌ హబ్‌గా భారత్‌

Feb 20 2026 4:18 AM | Updated on Feb 20 2026 4:18 AM

Union Minister Kishan Reddy at FICCI Critical Minerals Conference

ఫిక్కీ క్రిటికల్‌ మినరల్‌ సదస్సులో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: భవిష్యత్తు అవసరా లకు అత్యంత కీలకమైన ‘క్రిటికల్‌ మినరల్స్‌’ సవాళ్లను భారత్‌ అద్భుత అవకాశంగా మలుచుకుంటోందని కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో ఫిక్కీ ఆధ్వర్యంలో జరిగిన రెండో ఎడిషన్‌ క్రిటికల్‌ మినరల్‌ సదస్సులో ఆయన మాట్లాడుతూ, సోలార్‌ ప్యానెల్స్, ఎలక్ట్రిక్‌ వాహనాలు, రక్షణ రంగాలకు లిథియం, కోబాల్ట్‌ లాంటి ఖనిజాలు అత్యవసరమని, అయితే ప్రస్తుతం మనం 95 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నామని తెలిపారు. 

ఈ పరిస్థితిని మార్చి దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘మిషన్‌ మోడ్‌’లో పనిచేస్తోందని, ఇందులో భాగంగానే ‘నేషనల్‌ క్రిటికల్‌ మినరల్స్‌ మిషన్‌’ను తీసుకొచ్చామని వెల్లడించారు. దేశీయంగా ముడిఖనిజాల అన్వేషణ, ఉత్పత్తిని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా రేర్‌ ఎర్త్‌ కారిడార్లను అభివృద్ధి చేయను న్నట్లు మంత్రి ప్రకటించారు. 

ఇందుకోసం రూ.7,280 కోట్లతో పీఎల్‌ఐ స్కీమ్‌ను అమలు చేయడంతో పాటు, 24 రకాల క్రిటికల్‌ మినరల్స్‌పై దిగుమతి సుంకాన్ని కూడా మినహాయించినట్లు గుర్తుచేశారు. విదేశాలపై ఆధారపడటం తగ్గించేందుకు ఇప్పటికే అర్జెంటీనాలో లిథియం గనిని దక్కించుకున్నామని, త్వరలో అక్కడ పనులు ప్రారంభిస్తామని కిషన్‌ రెడ్డి తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement