రాష్ట్రాలకు సుప్రీంకోర్టు అక్షింతలు
ఉచితాల సంస్కృతిని తప్పుబట్టిన అత్యున్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఉచిత పథకాల సంస్కృతిని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఉచితాలు కాదు.. ఉద్యోగావకాలు కల్పించాలని సూచించింది. దేశ ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలిగించే విధానాలను పునఃసమీక్షించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపింది. కేంద్రం, ఇతరులకు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది.
ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ ఉచిత విద్యుత్ అందించాలనే డీఎంకే ప్రతిపాదనపై తమిళనాడు విద్యుత్ పంపిణీ కార్పొరేషన్ లిమిటెడ్ వేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పంఛోలిలతో కూడిన సుప్రీంకోరు ధర్మాసనం విచారించింది.
అభివృద్ధి ప్రాజెక్టులకు ఖర్చు చేయడానికి బదులుగా ఇలా ఉచితాలు పంపిణీ చేస్తే ఎలా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఉచిత పంపిణీలతో దేశ ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని, అందరికీ ఉచిత ఆహారం, సైకిళ్లు, విద్యుత్ ఇవ్వడానికి బదులుగా రాష్ట్రాలు ఉపాధి కోసం మార్గాలను తెరవడానికి కృషి చేయాలని ధర్మాసనం పేర్కొంది.
‘దేశంలో మనం ఎలాంటి సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నాం? విద్యుత్ ఛార్జీలు చెల్లించలేని వారికి సంక్షేమ చర్యలో భాగంగా మీరు అందించాలనుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు. కానీ భరించగల వారికి, భరించలేని వారికి మధ్య తేడాను గుర్తించకుండా, అందరికీ పంపిణీ చేయడం ఎలాంటి విధానం?’ అని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. ‘రాష్ట్రాలు ఉపాధి కోసం మార్గాలను తెరవడానికి కృషి చేయాలి. ఉచిత ఆహారం, ఆపై ఉచిత సైకిల్, తర్వాత ఉచిత విద్యుత్ ఇస్తూ పోతే, ఆపై ఎవరు పని చేస్తారు. అసలు పని సంస్కృతి ఏమైపోతుంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


