ఒకే ఫైలు.. ఒకే సంతకం.. వేర్వేరు న్యాయమా? | IAS officer Srilakshmi submits report to Supreme Court | Sakshi
Sakshi News home page

ఒకే ఫైలు.. ఒకే సంతకం.. వేర్వేరు న్యాయమా?

Feb 18 2026 5:52 AM | Updated on Feb 18 2026 5:52 AM

IAS officer Srilakshmi submits report to Supreme Court

అందరూ నిర్దోషులు.. నేనే నిందితురాలినా? 

మంత్రులు, మాజీలు బయటపడ్డారు.. నాపైనే విచారణ ఎందుకు? 

కేంద్రం చెప్పిందే చేశా.. నిబంధనలు మీరలేదు 

సుప్రీంకోర్టుకు నివేదించిన ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి

శ్రీలక్ష్మి తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ దవే వాదనలు 

సాక్షి, న్యూఢిల్లీ: ‘ఒకే ఫైలు.. ఒకే సంతకం.. కానీ ఆ ఫైలును ఆమోదించిన నాటి గనులశాఖ మంత్రి, అంతకుముందు పనిచేసిన కార్యదర్శి ఇద్దరూ ఈ కేసు నుంచి విముక్తి పొందారు. వారెవరూ విచారణ ఎదుర్కోవడం లేదు. కానీ.. వారికింద పనిచేసిన నన్ను మాత్రమే టార్గెట్‌ చేసి, ఇంకా విచారణ ఎదుర్కోవాలనడం ఎక్కడి న్యాయం?’ అని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి వై.శ్రీలక్ష్మి సుప్రీంకోర్టులో ఆవేదన వ్యక్తం చేశారు. ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసులో తనపై ఉన్న అభియోగాలను కొట్టేయాలంటూ శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 

జస్టిస్‌ ఎం.ఎం.సుందరేష్, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట శ్రీలక్ష్మి తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. ఈ కేసులో శ్రీలక్ష్మి ని బలిపశువును చేశారని, అసలు నిర్ణయాధికారం ఉన్నవారు బయటపడ్డారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ కేసులో మొదట 9 మందిని నిందితులుగా చేర్చారని తెలిపారు. ఇందులో అప్పటి గనులశాఖ మంత్రి (సబితా ఇంద్రారెడ్డి), అప్పటి ప్రభుత్వ కార్యదర్శి (కృపానందం) తదితరులున్నారని చెప్పారు. కోర్టుల ద్వారా వారు ఈ కేసు నుంచి బయటపడ్డారని గుర్తుచేశారు. 

‘బాధ్యతలు స్వీకరించిన కొత్తలోనే శ్రీలక్ష్మి ఈ ఫైలును డీల్‌ చేశారు. నిర్ణయాధికారం ఉన్న ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సేఫ్‌గా బయటపడగా.. కేవలం ఒక అధికారిణిని మాత్రమే ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిప్పడం వివక్ష చూపడమే’ అని పేర్కొన్నారు. ఒకే తరహా ఆరోపణలు ఎదుర్కొన్న ఇతరులకు ఊరట లభించినప్పుడు శ్రీలక్షి్మకి ఎందుకు వర్తించదని ప్రశ్నించారు.

కేంద్రం చెప్పిందే చేశాం.. ఉల్లంఘన జరగలేదు 
ఓఎంసీకి మైనింగ్‌ లీజులు ఇచ్చే సమయంలో.. ప్రభుత్వ ఉత్తర్వులో క్యాప్టివ్‌ మైనింగ్‌ (సొంత పరిశ్రమల అవసరాలకు మాత్రమే ఖనిజాన్ని వాడుకునే) అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగానే శ్రీలక్ష్మి తొలగించి అక్రమాలకు పాల్పడ్డారన్న సీబీఐ ప్రధాన ఆరోపణపై న్యాయవాది దవే అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘జాతీయ ఖనిజ విధానం ప్రకారం.. మైనింగ్‌ లీజుల్లో క్యాప్టివ్‌ వంటి షరతులు విధించకూడదని, అది నిబంధనలకు విరుద్ధమని కేంద్ర ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది. కేంద్రం ఆదేశాలను తూచా తప్పకుండా పాటించిన అధికారిణిని.. నిబంధనలు ఉల్లంఘించారని నిందించడం విడ్డూరం’ అని చెప్పారు. 

ఐరన్‌ ఓర్‌ మేజర్‌ మినరల్‌ అయినందున, లీజుల కేటాయింపులో తుది నిర్ణయం కేంద్రానిదేనని, రాష్ట్రం కేవలం సిఫార్సు మాత్రమే చేస్తుందని తెలిపారు. అంతేగాక అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలంటే లంచం అడిగి తీసుకోవడం, తద్వారా లబ్ధి పొందినట్లు ఆధారాలుండాలని చెప్పారు. కానీ శ్రీలక్ష్మి విషయంలో ఎక్కడా డబ్బు చేతులు మారినట్లుగానీ, ఆమె ఖాతాల్లోకి నగదు వచ్చినట్లుగానీ ఆధారాలు లేవని తెలిపారు. నీరజ్‌ దత్తా కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఉటంకించారు. కేవలం ఆరోపణల ఆధారంగా అవినీతి ముద్ర వేయలేమని సిద్ధార్థ దవే చెప్పారు.  

ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. శ్రీలక్ష్మి సోదరి భర్త (రాకేష్‌బాబు) 2005–09 మధ్య ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టారని, దీనివెనుక క్విడ్‌ ప్రో కో ఉందన్న కోణంలో విచారణ జరిగిందని తెలిపారు. సాక్షుల జాబితాలోని ఎల్‌.డబ్ల్యూ–8 వాంగ్మూలం ప్రకారం డబ్బు డిమాండ్‌ చేసినట్లు తెలిసిందని, అధికార దుర్వినియోగం (సెక్షన్‌ 13(1)(డీ)) జరిగిందని చెప్పారు. 

సాంకేతిక అంశాలను ట్రయల్‌ కోర్టులోనే తేల్చుకోండి 
ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్‌ ఎం.ఎం.సుందరేష్‌ ధర్మాసనం.. కేసు విచారణ దశలో ఉన్నందున తాము ఇప్పుడు మెరిట్స్‌లోకి వెళ్లలేమని, సాక్ష్యాధారాలను ఇక్కడ పరిశీలించలేమని స్పష్టం చేసింది. పిటిషనర్‌ లేవనెత్తిన సమాన న్యాయం, కేంద్రప్రభుత్వ ఉత్తర్వులు, ఇతర సాంకేతిక అంశాలన్నీ ట్రయల్‌ కోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. ట్రయల్‌ కోర్టులో ఈ వాదనలను వినిపించుకునే స్వేచ్ఛ పిటిషనర్‌కు ఉందని పేర్కొంటూ విచారణను ముగించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement