శ్రీవారి సొమ్ము దోపిడీకి ఇందాపూర్‌ ముసుగు | Botsa Satyanarayana Fires on CM Chandrababu | Sakshi
Sakshi News home page

శ్రీవారి సొమ్ము దోపిడీకి ఇందాపూర్‌ ముసుగు

Feb 18 2026 5:38 AM | Updated on Feb 18 2026 5:38 AM

Botsa Satyanarayana Fires on CM Chandrababu

ఇది సీఎం చంద్రబాబు మరో స్కామ్‌

మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపాటు

ఆ డెయిరీ పేరుతో హెరిటేజ్‌కు దోచి పెట్టేందుకు కుట్ర

టీటీడీ నెయ్యి కాంట్రాక్ట్‌ దక్కించుకునే కుతంత్రం

అందుకే లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడారంటూ నిందలు

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విమర్శలు, దుష్ప్రచారం

హెరిటేజ్‌ వెబ్‌సైట్‌లో మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌గా ఇందాపూర్‌ డెయిరీ

గుట్టు రట్టు కావడంతో వెబ్‌సైట్‌లో వివరాలు మార్పు

సాక్షి, అమరావతి: చంద్రబాబు మరో స్కామ్‌ ఇందాపూర్‌ డెయిరీ అని, ఆ డెయిరీ పేరుతో హెరిటేజ్‌కు దోచి పెట్టేందుకు ఆయన కుట్ర చేశారని శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. హెరిటేజ్‌.. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్‌ దక్కించుకునే కుతంత్రం చేసిన చంద్రబాబు, తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడారని నిందలు వేశారని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై దుష్ప్ర­చారం చేశారని మండిపడ్డారు. అయితే ఇందాపూర్‌ డెయిరీ వ్యవహారంతో చంద్రబాబు కుట్ర బట్టబయలు అయిందని, అందుకే సభలో తాము చర్చకు పట్టుబడితే ప్రభుత్వం పారిపోయిందన్నారు.

మంగళవారం ఆయన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. ‘ఇందాపూర్‌ డెయిరీ ముసుగులో భారీ ఎత్తున శ్రీవేంకటేశ్వరస్వామి సంపదను తన కుటుంబ సంస్థ హెరిటేజ్‌కు దోచి పెట్టేందుకు చంద్రబాబు పూనుకున్నాడు. ఆ దుర్బుద్ధితోనే కల్తీ నెయ్యి పేరుతో శ్రీవారి ప్రసాదంపై నిందలు మోపాడు. ఇప్పుడు చంద్రబాబు చేసిన కుట్రలు బట్టబయలయ్యాయి. అందుకే ఇందాపూర్‌–హెరిటేజ్‌ అనుబంధం గురించి మండలిలో చర్చకు పట్టుబడితే ప్రభుత్వం భయపడి­పోతోంది’ అన్నారు. బొత్స ఇంకా ఏమన్నారంటే..   

అందుకే లడ్డూపై దుష్ప్రచారం 
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఎంతో భక్తితో పూజించే కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదం గురించి సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూశాడు. లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు, గొడ్డు మాంసం, చేపల నూనె కలిసిందని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ సహా కూటమి నాయకులు దుష్ప్రచారం చేశారు.

జంతువుల కొవ్వు కలిసిందంటూ వారు చేసిన ప్రచారమంతా పచ్చి అబద్ధమని సుప్రీంకోర్టు ఆ­దే­శాలతో సీబీఐ ఏర్పాటు చేసిన సిట్‌ చార్జి­షీట్‌తో తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలోనే లడ్డూపై దుష్ప్రచారం చేయడం వెనుక ఉన్న దుర్బుద్ధి బయట పడింది. తన కుటుంబ సంస్థ హెరిటేజ్‌ డెయిరీకి లాభం చేకూర్చడానికి దేవుడి లడ్డూను వాడుకున్నాడు. పనిలో పనిగా వైఎస్‌ జగన్‌ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించడానికి భారీ కుట్ర చేశాడు. 

నాడు నెయ్యి కాంట్రాక్టులు ఇందాపూర్‌ డెయిరీకే 
2014–19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులను ఇందాపూర్‌ డెయిరీ అనే సంస్థ ముసుగులో హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థకు చంద్రబాబు కట్టబెట్టారు. ఈ ఇందాపూర్‌ డెయిరీ అనేది హెరిటేజ్‌ ఫుడ్స్‌ అనుబంధ సంస్థే. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చైర్‌పర్సన్‌గా ఉన్న హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌కు దేశంలో పాలు, పాల ఉత్పత్తులు (డెయిరీ ప్రొడక్ట్స్‌) తయారు చేసే 22 సంస్థలు ఉన్నాయి. 

మహారాష్ట్రలోని ‘ఇందాపూర్‌ డెయిరీ అండ్‌ మిల్క్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌’ కూడా వాటిలో ఒకటి. ఆ ఇందాపూర్‌ డెయిరీకే 2014–19లో నాటి సీఎం చంద్రబాబు ఏకపక్షంగా టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టింది. ఇందాపూర్‌ డెయిరీ సరఫరా చేసిన నెయ్యి శాంపిల్స్‌ 2016లో ల్యాబ్‌ పరీక్షల్లో విఫలమయ్యాయి. ఆ డెయిరీపై అనర్హత వేటు వేశారు. కానీ కేవలం ఆరు నెలల్లోనే ఆ అనర్హతను తొలగించారు. ఆ తర్వాత 2019లో అధికారం నుంచి దిగిపోయే వరకు ఇందాపూర్‌ డెయిరీకి రూ.వందల కోట్ల విలువైన నెయ్యి కాంట్రాక్టులు అప్పగించారు. 

2019లో టీడీపీ అధికారం కోల్పోగానే హెరిటేజ్‌ ఫుడ్స్‌కు చెందిన ఇందాపూర్‌ డెయిరీ టీటీడీ టెండర్ల ప్రక్రియ నుంచి తప్పుకుంది. అయిదేళ్ల పాటు కనీసం బిడ్లు కూడా దాఖలు చేయలేదు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మళ్లీ తెరపైకి వచ్చింది. 2025 డిసెంబరులో టీటీడీ నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొంది. 

హెరిటేజ్‌ డెయిరీకి ఇందాపూర్‌ ముసుగు 
 ఇందాపూర్‌ డెయిరీకి హెరిటేజ్‌ డెయిరీతో ఉన్న అనుబంధం గురించి హెరిటేజ్‌ వెబ్‌సైట్‌లోనే రాసి ఉంది. ఇందాపూర్‌ డెయిరీని మా­న్యు­ఫ్యాక్చ­రింగ్‌ యూనిట్స్, ఫ్యాక్టరీల అడ్ర­స్‌ల పేరుతో స్పష్టంగా రాసుకుంది. ఇండోర్‌ అడ్ర­స్‌తో 17వ యూనిట్‌గా ఇందాపూర్‌ డెయిరీ గురించి రాశారు. ఈ ఇందాపూర్‌ డెయిరీ ద్వారానే హెరిటేజ్‌ ఫుడ్స్‌ తిరుమలకు నెయ్యి తయారు చేసినట్టు మీడియా ద్వారా ప్రపంచానికి తెలియగానే హెరిటేజ్‌ వెబ్‌సైట్‌ నుంచి ఇందాపూర్‌ ప్లాంట్‌ను అనుబంధ సంస్థగా మార్చేసి మసిపూసి మారేడుకాయ చేయాలని చూశారు. 

వెబ్‌సైట్‌లో అప్పటి వరకు ఇందాపూర్‌ డెయిరీని మా­న్యు­ఫ్యాక్చ­రింగ్‌ యూనిట్ల జాబితాలో చూపి­న హెరిటేజ్‌ డెయిరీ, తమ వ్యవహారం బయట­పడ­టంతో ఇందాపూర్‌ డెయిరీని మ్యా­ను­ఫ్యాక్చ­రింగ్‌ యూనిట్ల జాబితా నుంచి తొల­గించి, కో మా­న్యు­ఫ్యాక్చ­రింగ్‌ యూనిట్లలో చేర్చా­రు.

చర్చకు ప్రభుత్వం భయపడింది 
 హెరిటేజ్‌ డెయిరీతో ఇందాపూర్‌ డెయిరీకి ఉన్న అనుబంధం గురించి చర్చించాలని మండలిలో వైఎస్సార్‌సీపీ పట్టుబడితే ప్రభుత్వం భయపడి పారిపోయింది. రూ.300కు స్వచ్ఛమైన కేజీ నెయ్యి వస్తుందా.. అని మాట్లాడిన చంద్రబాబు మాటల వెనుక మర్మం ఇందాపూర్‌ డెయిరీకి డబుల్‌ రేటుకు నెయ్యి కాంట్రాక్టు కట్టబెట్టడ­మేనని తేలిపోయింది. 2025 డిసెంబర్‌లో టీటీ­డీ నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొన్న ఇందాపూర్‌ డెయిరీ.. రూ.658కి కేజీ నెయ్యి సరఫరా చేస్తామని కోట్‌ చేసింది. దీంతో అదే ధరకు నెయ్యి సరఫరా చేసేలా, గత ఏడాది డిసెంబర్‌లో టీటీడీ ఇందాపూర్‌ డెయిరీకి కాంట్రాక్ట్‌ ఖరారు చేసింది. 

 అధిక ధరలకు హెరిటేజ్‌కి నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టడానికి తిరుమల లడ్డూ గురించి చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. దోచుకోవడం కోసం దేవుడిని రాజకీయాల్లోకి లా­గడం కన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో రాజకీయాలు చే­స్తూ భక్తుల విశ్వాసాలతో ఆడుకోవడం సిగ్గుచేటు. 

నినాదాలతో హోరెత్తిన అసెంబ్లీ ప్రాంగణం
వైఎస్సార్‌సీపీ సభ్యుల నినాదాలతో అసెంబ్లీ ప్రాంగణం హోరెత్తింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మంగళవారం శాసనమండలిలో సభ వాయిదా పడిన అనంతరం విపక్ష నేత బొత్స సత్యనారాయణతో కలిసి పెద్దపెట్టున మూకుమ్మడిగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బయ­టకు వచ్చారు. ప్ల కార్డులు చేతబూని అసెంబ్లీ బయట మీడియా పాయింట్‌ వద్దకు వచ్చి నినా­దా­లు చేశారు. చంద్రబాబు బండారం బట్టబ­యలైందని, హెరిటేజ్‌–ఇందాపూర్‌ బంధంపై చర్చించలేక ప్రభుత్వం పారిపోయిందని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదు
ఇందాపూర్‌ డెయిరీ ముసుగులో చంద్రబాబు హెరిటేజ్‌ డెయిరీకి రూ.వందల కోట్లు దోచి పెట్టడానికి సిద్ధపడ్డాడు అనేది సుస్పష్టం. అందులో భాగంగానే కల్తీ నెయ్యి ముసుగులో రాజకీయ వికృత క్రీడకు దిగాడు. టాయ్‌లెట్లు క్లీన్‌ చేసే కెమికల్స్‌ని కూడా లడ్డూ తయారీకి వాడారని చెప్పడం సిగ్గుచేటు. ఇది క్షమించరాని తప్పు. దోపిడీ చేయడమే ధ్యేయంగా దేవదేవుడి మీద నిందలు మోపిన వారిని ఆ దేవుడు క్షమించడు. 
ఇందాపూర్‌ డెయిరీపై మండలిలో చర్చ జరి­గితే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయన్న భయంతోనే ప్రభుత్వం చర్చకు రాకుండా పారిపోయింది. కల్తీ ముసుగులో అడ్డగోలుగా తప్పులు చేసిన చంద్రబాబు దేవుడి ముందు దొరికిపోయాడు. కల్తీ నెయ్యి పేరుతో చంద్ర­బాబు దుర్మార్గంపై ప్రజలకు అవగాహన కల్పి­స్తాం. దేవుడి ముసుగులో చంద్రబాబు చే­సి­న దారుణాలకు మూల్యం చెల్లించుకోక తప్పదు. 

సీఎం చంద్రబాబు వ్యక్తిగత ప్రతిష్ట, వ్యక్తిగత లబ్ధి కోసం ఏ స్థాయికైనా దిగజారిపోతాడని తిరుమల లడ్డూ పేరుతో చేసిన కుట్రలే రుజువు చేస్తున్నాయి. వ్యక్తిగత ప్రతిష్ట కోసమే బిల్‌గేట్స్‌ని పిలిపించుకుని చంద్రబాబు విపరీతంగా పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఇంటింటికీ ఉచిత వైద్యం అందించేలా విలేజ్‌ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్టును తీసుకొస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దానిని చంద్రబాబు నిర్వీర్యం చేశాడు.

నాడు వైఎస్సార్‌సీపీ హయాంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్న విద్య, వ్యవసాయ రంగాలను నాశనం చేసిన చంద్రబాబు.. గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారం పేరుతో బిల్‌గేట్స్‌ని పిలిపించి పబ్లిసిటీ చేసుకోవడం దుర్మార్గం. సభ్యుల హాజరు నమోదు చేయడానికి అసెంబ్లీలో ఫేస్‌ రికగ్నిషన్‌ ప్రవేశపెట్టిన ప్రభుత్వం, కౌన్సిల్‌లో ఆ పని ఎందుకు చేయడం లేదు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement