గంజాయి మత్తులో నరరూప రాక్షసుడి ఘాతుకం
ఏడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. నీటి డ్రమ్ములో ముంచి చంపేసిన ఉన్మాది
నిందితుడి ఇంట్లోనే బయటపడిన బాలిక మృతదేహం
మదనపల్లెలో వెల్లువెత్తిన ప్రజాగ్రహం
నిందితుడిని అప్పగించాలంటూ ఆందోళన
సర్కారు నిర్లక్ష్యానికి ముక్కుపచ్చలారని మరో పసిపాప బలైపోయింది. మత్తెక్కిన నర రూప రాక్షసుడి కబంధ హస్తాల్లో విలవిల్లాడి విగతజీవిలా మారిపోయింది. కామాంధుడి పైశాచికత్వానికి డ్రమ్ములో నిర్జీవంగా దర్శనమిచ్చింది. ఈ దృశ్యాన్ని చూసిన మాతృహృదయాలు తల్లడిల్లిపోయాయి. ఇన్నాళ్లూ అల్లారుముద్దుగా, కంటికి రెప్పలా కాపాడుకున్న బిడ్డను చూసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ హృదయవిదారక ఘటనపై అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె కదిలిపోయింది. చలనం లేని మొద్దు సర్కారుపై కన్నెర్రజేసింది. తక్షణం న్యాయం చేయాలని నినదించింది.
మదనపల్లె / మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో అదృశ్యమైన ఏడేళ్ల చిన్నారి హత్యాచారానికి గురైంది. ఆమెపై నిందితుడు లైంగికదాడి చేసి, ఆపై హత్య చేసినట్టు కర్నూలు రేంజ్ డీఐజీ కోయప్రవీణ్ మంగళవారం రాత్రి ప్రకటించారు. మదనపల్లె పట్టణంలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారి సోమవారం సాయంత్రం ఆడుకుంటూ అదృశ్యమైంది. తల్లిదండ్రులు, బంధువులు ఎంత గాలించినా జాడ కానరాలేదు. దీంతో ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
రాత్రంతా ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ లభ్యం కాలేదు. కుటుంబీకులు అనుమానంతో బాలిక ఇంటికి సమీపంలోనే ఉండే కులవర్ధన్ అనే వ్యక్తిపై మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కులవర్ధన్ ఇంటికి చేరుకున్నారు. లోపల తలుపులు వేసుకుని కులవర్ధన్ ఎంతకీ తీయకపోవడంతో పోలీసులు గడియ పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ ఓ డ్రమ్ములో బాలిక మృతదేహం కనిపించింది. నిందితుడే చిన్నారిపై లైంగిక దాడి చేసి డ్రమ్ములో పెట్టాడని తెలియడంతో బాలిక తల్లిదండ్రులు, బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
ప్రజలూ ఈ ఘటనపై రగిలిపోయారు. దీంతో పట్టణంలో ఒక్కసారిగా ఆందోళనలు మిన్నంటాయి. సర్కారు, పోలీసుల తాత్సారం, నిర్లక్ష్యంపైనా నిరసనలు వెల్లువెత్తాయి. నిందితుడిని తమకు అప్పగించాలని తల్లిదండ్రులు, బంధువులు పట్టుబట్టారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించడాన్ని అడ్డుకున్నారు. ఎట్టకేలకు కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించడానికి అంగీకరించారు.
లైంగిక దాడి చేసి, హత్య చేశాడు: డీఐజీ
కులవర్ధన్ బాలికపై లైంగిక దాడి చేసి.. ఆపై నీటి డ్రమ్ములో ముంచి హత్య చేశాడని డీఐజీ కోయ ప్రవీణ్ మంగళవారం రాత్రి వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము ఇంటి తలుపులు పగలగొట్టి బాలిక మృతదేహాన్ని గుర్తించామని, అయితే నిందితుడు పరారయ్యాడని, అతడిని పట్టుకునేందుకు గాలిస్తున్నామని వివరించారు. నిందితుడి ఇంటిపై నిఘా పెట్టామని వెల్లడించారు.
ఎస్పీ, సబ్ కలెక్టర్ ప్రయత్నం విఫలం
బాలిక హత్యాచారాన్ని నిరసిస్తూ మదనపల్లె అన్నమయ్య సర్కిల్ జాతీయ రహదారిపై ప్రజలు మంగళవారం ఉదయం నుంచే ఆందోళన చేపట్టారు. బాలిక తల్లి ప్రజలతో కలిసి రోడ్డుపైనే బైఠాయించింది. గంటలు తరబడి ఆందోళన కొనసాగించారు. ఎస్పీ, మదనపల్లె డీఎస్పీ అందుబాటులో లేకపోవడంతో కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, రాయచోటి డీఎస్పీ కృష్ణ్ణమోహన్ మదనపల్లె చేరుకున్నారు. బాలిక తల్లితో చర్చించారు. నిరసన విరమించాలని కోరారు. అయినా తల్లి అంగీకరించలేదు. న్యాయం చేయాలని ఎస్పీ, సబ్ కలెక్టర్‌ను వేడుకుంది. పోలీస్ గోబ్యాక్ అని ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
కులవర్ధన్ సైకో: బాలిక తండ్రి
తన బిడ్డను పొట్టన పెట్టుకున్న కులవర్ధన్ సైకో అని బాలిక తండ్రి హోం మంత్రి అనితతో తన ఆవేదన వెలిబుచ్చాడు. బాలిక మరణంపై అనిత ఫోన్‌లో తల్లిదండ్రులతో మాట్లాడారు. తన బిడ్డను చంపిన వ్యక్తిపై తక్షణం చర్యలు తీసుకోవాలని తండ్రి డిమాండ్ చేశాడు. బాలిక మరణంపై ఆధారాలు సేకరించాలంటే పోలీసులకు సహకరించాలని మంత్రి కోరారు.
నిందితుడికి బెయిల్ రాకుండా జైలులోనే ఉంచి, ఆపై శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత మంత్రి బాలిక తల్లితో మాట్లాడారు. కాగా, నిందితుడు పారిపోయాడని పోలీసులు చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. తలుపులు వేసుకుని లోపలే ఉన్న అతను ఎలా పారిపోయాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నిందితుని ఇల్లు ముట్టడి, ఉద్రిక్తత
నిందితుడు కులవర్ధన్ ఇంటిని మంగళవారం ఉదయం స్థానిక ప్రజలు ముట్టడించారు. చిన్నారిని చిదిమేసిన ఉన్మాదిని తక్షణమే శిక్షించాలని పట్టుబట్టారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు బిడ్డకు న్యాయం జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. న్యాయం చేస్తామని పోలీసులు, అధికారులు వచ్చి చెప్పినా వినలేదు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, డీఎస్పీ మహేంద్ర విజయవాడ వెళ్లడంతో సత్వర నిర్ణయాలు తీసుకునేందుకు జాప్యం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. ప్రజలు నిందితుడి ఇంటివద్దే సాయంత్రం వరకు ఉన్నారు. రాక్షసుడిని తమకు అప్పగించాలని పట్టుబట్టారు. దీంతో రాకపోకలు స్తంభించాయి.
గంజాయికి బానిస
నిందితుడు కులవర్ధన్ గంజాయికి బానిసని స్థానికులు చెబుతున్నారు. అతడికి నేరచరిత్ర కూడా ఉన్నట్టు సమాచారం. స్థానికులు చాలాసార్లు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెబు తున్నారు. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. మంగళవారం ఉదయం కూడా గంజాయి మత్తులోనే ఉన్నాడని, అందువల్లే తలుపులు తట్టినా తీయలేదని పోలీసులే చెబుతున్నారు.


