కిలో నెయ్యి రూ.300 నుంచి ఏకంగా రూ.658కి ఎందుకు పెరిగింది?
హెరిటేజ్‌తో ఇందాపూర్ డెయిరీకి ఉన్న బంధమేంటి?
ఈ విషయంపై చర్చిద్దామంటే దుర్మార్గంగా మైక్‌లు కట్ చేస్తారా?
వాయిదా తీర్మానంపై చర్చకు ఎందుకు భయపడుతున్నారు?
టీటీడీకి ఇందాపూర్ డెయిరీ నెయ్యి సరఫరాపై అట్టుడికిన శాసన మండలి
శ్రీవారిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడంపై వైఎస్సార్‌సీపీ నిప్పులు
చంద్రబాబు అధికారంలోకి రాగానే నెయ్యి సరఫరా ధర రెట్టింపు చేసే కుట్ర
లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడారని దుష్ప్రచారం
తన హెరిటేజ్‌కు, తన సంబంధీకులకు భారీ లబ్ధి చేకూర్చేందుకు స్కెచ్
ఈముసుగులో కిలో నెయ్యి రూ.658తో ఇందాపూర్ డెయిరీకి కట్టబెట్టిన వైనం
వరుస ఘటనలతో హెరిటేజ్‌లో ఇందాపూర్ భాగమేనని బట్టబయలు
ఈ విషయం సభలో చర్చకు రాకుండా డ్రామా..
తిరుమలలో నిర్ధిష్ట విధానంలో నాణ్యత పరీక్షల తర్వాతే నెయ్యి వాడకం
గత బాబు పాలనకు ముందు.. ఆ తర్వాత, జగన్ పాలనలోనూ అదే విధానం
సాక్షి, అమరావతి: చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ వ్యవహారంతో మంగళవారం శాసన మండలి అట్టుడికింది. హెరిటేజ్ నెయ్యిని ఇందాపూర్ డెయిరీ పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కు సరఫరా చేయడంపై చర్చకు అనుమతించాలని వైఎస్సార్‌సీపీ పట్టుబట్టింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీలు కేఆర్‌జే భరత్, సిపాయి సుబ్రమణ్యం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు తిరస్కరించారు. ఈ విషయంపై చర్చకు అనుమతించాల్సిందేనని, తద్వారా హెరిటేజ్‌తో ఇందాపూర్ డెయిరీ బంధం బయట పెట్టాలని వైఎస్సార్‌సీపీ సభ్యులు నినదించారు. అయినా చైర్మన్ చర్చకు అనుమతించక పోవడంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు.
టీటీడీలో హెరిటేజ్ పాత్రపై చర్చ జరపాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ‘హెరిటేజ్ నెయ్యి, పాలు, పెరుగు అన్నీ కల్తీ కల్తీ.. చంద్రబాబు పాలనా కల్తీ కల్తీ.. గోవిందా.. గోవిందా..’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నప్పటికీ, చైర్మన్ మరో వైపు ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. దీంతో చైర్మన్ కొద్దిసేపు సభను వాయిదా వేశారు. ఆ తర్వాత సభ తిరిగి ప్రారంభం కాగానే వైఎస్సార్‌సీపీ సభ్యులు మాట్లాడుతూ.. హెరిటేజ్ వ్యవహారం బయట పడుతుందని సీఎం చంద్రబాబు తన మంత్రులను పంపి డ్రామా ఆడిస్తున్నారని మండిపడ్డారు.
ధర పెంచుకునేందుకే దుష్ప్రచారం
‘ఎంతో కాలంగా టీటీడీకి ఇందాపూర్ డెయిరీ నుంచి నెయ్యి సరఫరా అవుతోంది. ఇది హెరిటేజ్ అనుబంధ సంస్థే. మొన్నటి వరకు రూ.300కు అటూ ఇటుగా నెయ్యి సరఫరా చేసింది. అయితే చంద్రబాబు ఇది వరకు ముఖ్యమంత్రి కాక ముందు, ముఖ్యమంత్రి ఆయ్యాక.. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో టీటీడీలో నెయ్యి సేకరణకు ఒక నిర్దిష్ట విధానం కొనసాగింది. టెండర్లు పిలిచి, తక్కువ ధరకు కోట్ చేసిన సంస్థలకు టెండర్ ఖరారు చేస్తారు. ఇవే సంస్థలు రాష్ట్రంలో పలు ఆలయాలకు కూడా నెయ్యిని సరఫరా చేశాయి. అక్రిడేటెడ్ ల్యాబ్‌లో సర్టిఫికెట్ పొందాకే టీటీడీకి నెయ్యిని అనుమతిస్తారు. ఇక్కడ మళ్లీ టీటీడీ సొంతంగా ఆ నెయ్యిని పరీక్షిస్తుంది. నాణ్యత లేకపోతే ఆ ట్యాంకర్లను వెనక్కు పంపుతారు.
అలా గత చంద్రబాబు ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో పలుమార్లు వెనక్కు పంపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైంది. ఇదే అదనుగా తన కుటుంబ సంస్థ హెరిటేజ్ నుంచి ఇందాపూర్ డెయిరీ ద్వారా టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యి ధరను ఏకంగా రెట్టింపు చేయాలని కుట్ర పన్నారు. తద్వారా తన హెరిటేజ్‌కు, తన సంబందీకులకు, తన అనుబంధ సంస్థలకు లబ్ధి చేకూర్చాలనుకున్నారు. ఇందు కోసం ఏకంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి పైనే బరితెగించి రాజకీయం చేశారు. శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు, పందికొవ్వు, బాత్‌రూమ్‌లు క్లీన్ చేసే రసాయనాలు వాడారని ఉద్దేశ పూర్వకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తక్కువ ధరకే కొనుగోలు చేయడం వల్ల నాణ్యత లేదని దుష్ప్రచారం చేశారు. చంద్రబాబుతో పాటు ఆయన మంత్రులు, ఎల్లో మీడియా ఈ విషయమై భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా వ్యవహరించారు.
బండారం బట్టబయలు
శ్రీవారి లడ్డూపై చంద్రబాబు అండ్ కో చేయాల్సినంత దుష్ప్రచారం చేసేసి.. శ్రీవారి డబ్బులు దోచేసేందుకు బరితెగించారు. లడ్డూ సరఫరా ధరను ఏకంగా రెట్టింపు కిలో రూ.600కు పైగా పెంచేశారు. తద్వారా తన కుటుంబం సంస్థ, తన సంబంధీకులు, అనుబంధ కంపెనీలకు లబ్ధి చేకూర్చారు. ఆ లడ్డూ కల్తీ అనే ముద్ర వేసి, కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తీసి.. తను అనుకున్న రీతిలో స్కెచ్ మేరకు ధర పెంచుకోగలిగారు. చంద్రబాబు అంత తీవ్ర వ్యాఖ్యలు ఎందుకు చేశారనే కోణంలో పలు సంస్థలు, మీడియా, మేధావి వర్గాలు కాస్తా లోతుగా శోధించడంతో నెయ్యి సరఫరా చేసిన సంస్థలకు సంబంధించి పలు విషయాలు వెలుగు చూశాయి.
ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీ చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌దేనని స్పష్టమైంది. దీంతో తన కుట్ర బెడిసి కొట్టడంతో కొద్ది రోజులుగా చంద్రబాబు ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ విషయంపై మండలిలో చర్చ జరగాలని, హెరిటేజ్–ఇందాపూర్ డెయిరీ సంబంధాల గురించి స్పష్టం చేయాలని మంగళవారం మండలిలో వైఎస్సార్‌సీపీ పట్టుపట్టింది. ఈ విషయమై చర్చ జరిగితే ప్రజల్లో మరింత చులకన అవుతామని చంద్రబాబు హుటాహుటిన కొందరు మంత్రులను మండలికి పంపారు. ఈ నేపథ్యంలో మంత్రులు కొలుసు పార్థసారథి, కె.అచ్చెన్నాయుడు ప్రతి దశలోనూ వైఎస్సార్‌సీపీ సభ్యులకు అడ్డు తగిలారు.
ఇది డ్రామా కాదా?
సభ్యుల వాదప్రతివాదనల నేపథ్యంలో చైర్మన్ కొద్ది సేపు సభను వాయిదా వేశారు. మళ్లీ సభ ప్రారంభం కాగానే అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడటానికి చైర్మన్ మోషేన్‌రాజు అవకాశం ఇచ్చారు. అయితే వైఎస్సార్‌సీపీ సభ్యులు తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చున్నాకే ఆయనతో మాట్లాడించాలని అచ్చెన్నాయుడు అభ్యంతరం తెలిపారు. దీంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు పొడియం వద్ద నుంచి బొత్స వెనక్కు వెళ్లి నిల్చొన్నారు. ఆ తర్వాత బొత్స మాట్లాడే ప్రయత్నం చేయగా.. టీడీపీ సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. తద్వారా సభలో గందరగోళం నెలకొనేలా చేశారు. వైఎస్సార్‌సీపీ సభ్యులకు మాట్లాడే నైతిక హక్కు లేదంటూ అడ్డుకున్నారు.
మంత్రుల తీరుపై వైఎస్సార్‌సీపీ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. తాము ఏ విషయంపై అయినా చర్చకు సిద్ధమేనని, హెరిటేజ్ వ్యవహారంపై చర్చ జరిగి తీరాల్సిందేనని నినదించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ కలుగ జేసుకుంటూ.. ‘హెరిటేజ్‌కు, తిరుపతి లడ్డూకు సంబంధం ఉందని ఒక్క ఆధారం తెమ్మనండి.. అయినా తిరుమల లడ్డూపై ఆధారం లేకుండా మాట్లాడుతున్నారు’ అని ఎదురు దాడి చేయబోగా.. ‘ఆధారాలు లేకుండా మాట్లాడిందెవరు? ఆధారాలు బయటకు రాకుండా ఇప్పుడు డ్రామాలాడుతోందెవరు?’ అని వైఎస్సార్‌సీపీ సభ్యులు నిలదీశారు.
ఇందాపూర్‌ను అడ్డుపెట్టుకుని ధనార్జన
ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. అసలు ప్రభుత్వానికి సభ జరిపే ఉద్దేశం ఉందా? లేదా? అని ప్రశి్నంచారు. సీఎం చంద్రబాబు ధనార్జన కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం దేవదేవుడైన వేంకటేశ్వరస్వామి లడ్డూపై దుష్ప్రచారం చేశారన్నారు. హెరిటేజ్ సంస్థకు చెందిన కల్తీ నెయ్యిని ఇందాపూర్ డెయిరీ ద్వారా టీటీడీకి సరఫరా చేశారని చెప్పారు. హెరిటేజ్–ఇందాపూర్ బంధంపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, మీరెందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కాగా, హెరిటేజ్– ఇందాపూర్ డెయిరీ బంధంపై చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో శాసన మండలి చరిత్రలో అరుదైన రికార్డు నెలకొంది. ఎప్పుడులేని విధంగా సభలో తొలిసారి మైక్, సౌండ్ సిస్టమ్ పని చేయలేదు. దీంతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.54 గంటల మధ్య కేవలం 40 నిమిషాల పాటు మాత్రమే సభ జరిగింది. గందరగోళం వల్ల నాలుగుసార్లు సభ వాయిదా పడింది.


