సరికొత్త ట్రెండ్‌కు తెరతీసిన కొందరు విద్యార్థులు
ఈగల్ దర్యాప్తులో కీలక విషయాలు
వరంగల్‌లో ఇద్దరు విద్యార్థులపట్టివేతతో వెలుగులోకి కొత్త కోణాలు
సాక్షి, హైదరాబాద్: మత్తుమహమ్మారికి బలవుతున్న విద్యార్థులు సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. కొందరు విద్యార్థులు కలిసి డబ్బులు పోగు చేసి గంజాయి కొనుగోలు చేసి విక్రయించడం వంటి అత్యంత ప్రమాదకర ధోరణిని వరంగల్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ (డబ్ల్యూఎన్‌పీఎస్) ప్రత్యేక బృందం బయటపెట్టింది. దీనిపై విస్తుపోయే విషయాలు ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. ఈగల్ డైరెక్టర్ సందీప్‌శాండిల్య ఈ మేరకు మంగళవారం వివరాలు వెల్లడించారు.
పట్టుబడిన విద్యార్థులు తొలుత వినియోగదారులుగా మొదలై, పెడ్లర్లుగా మారి ఆ తర్వాత పెద్ద సరఫరాదారుల దిశగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒడిశా రాష్ట్రం నుంచి కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాలకు గంజాయి రవాణా చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక పోలీసు బృందం ముగ్గురిని అరెస్టు చేసి 36.878 కిలోల గంజాయి స్వా«దీనం చేసుకున్నట్లు తెలిపారు.
వరంగల్ మీదుగా కరీంనగర్‌కు గంజాయి తరలిస్తుండగా వరంగల్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి కరీంనగర్‌కు చెందిన బీటెక్ విద్యార్థి బుచ్చల ఆదిత్య అలియాస్ ఇంద్ర (20), ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి గొల్లపల్లి నిఖిల్ అలియాస్ చింటు (19) పట్టుబడ్డారు. వీరిచ్చిన సమాచారంతో మరొక నిందితుడు వడ్లకొండ యశ్వంత్ అలియాస్ మింటును పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో అరెస్టు చేశారు. ఇతను ఇంతకు ముందు రెండు ఎన్‌డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్‌స్టాన్సెస్) కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ప్రాథమిక విచారణలో బుచ్చల ఆదిత్య పలు విషయాలు వెల్లడించాడు.
మొదటగా అలవాటు.. ఆ తర్వాత విక్రయాలు
బీటెక్ మొదటి సంవత్సరంలో ఉండగా హాస్టల్‌మేట్ అమ్ముల త్రినేశ్ ద్వారా ఆదిత్య గంజాయికి అలవాటుపడ్డాడు. ఆ తర్వాత సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో స్నేహితులతో కలిసి గంజాయి కొనుగోలు చేసి విక్రయించాలని ప్రణాళిక రూపొందించాడు. ఆదిత్య రూ.11,600 ఇవ్వడంతోపాటు తన స్నేహితులు గొల్లపల్లి నిఖిల్ (రూ.12,000), వడ్లకొండ యశ్వంత్ (రూ.15000), అమ్ముల త్రినేశ్ (రూ.2000), సుందరగిరి సంజయ్ (రూ.30,000), అజయ్ (రూ.5,000), సిద్ధూ (రూ.2,000), శ్రీధర్ (రూ.3,000)...ఇలా మొత్తం రూ.80,600 జమ చేశారు.
ఈ డబ్బుతో కరీంనగర్‌కు చెందిన, ప్రస్తుతం ఒడిశాలోని పసుపులంక ప్రాంతంలో నివసిస్తున్న కలవేన ప్రవీణ్ కుమార్ అలియాస్ చంటి ద్వారా గంజాయి కిలో రూ.2వేల చొప్పున కొనుగోలు చేశారు. ఈ గంజాయిని కొంత వాళ్లు వాడుకునేందుకు పెట్టుకుని మరికొంత జల్సాలు చేసేందుకుగాను ఈజీ మనీ కోసం హైదరాబాద్ , కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో విద్యార్థులకు విక్రయిస్తున్నారు. గతంలోనూ 2025 జనవరి, జూలై, డిసెంబర్ నెలల్లో 12 కిలోల చొప్పున మూడు సార్లు గంజాయి కొనుగోలు చేసి మేడ్చల్, కరీంనగర్ జిల్లాల పరిసరాల్లోని విద్యార్థులకు విక్రయించినట్టు విచారణలో బయటపడింది.
దీంతో అమ్ముల త్రినేశ్, సుందరగిరి సంజయ్, అజయ్, సిద్ధూ, శ్రీధర్‌తోపాటు వీరికి గంజాయి సరఫరా చేస్తున్న ప్రవీణ్ కుమార్, ఒడిశాకు చెందిన భగవాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. యువతను రక్షించడంలో, మాదక ద్రవ్య రహిత తెలంగాణను నిర్ధారించడంలో ప్రజల భాగస్వామ్యం చాలా కీలకమని, డ్రగ్స్ గురించి సమాచారం తెలిస్తే 1908 టోల్‌ఫ్రీ నంబర్‌లో లేదా 8712671111లో సమాచారం ఇవ్వాలని ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య సూచించారు.


