‘బుల్డోజర్‌’ తీర్పు మీకు వర్తించదా? | High Court once again outraged over Hydras behavior | Sakshi
Sakshi News home page

‘బుల్డోజర్‌’ తీర్పు మీకు వర్తించదా?

Feb 18 2026 4:54 AM | Updated on Feb 18 2026 4:54 AM

High Court once again outraged over Hydras behavior

హైడ్రా తీరుపై మరోసారి మండిపడిన హైకోర్టు 

చట్టప్రక్రియను దుర్వినియోగం చేసే హక్కు లేదు 

చట్టవిరుద్ధంగా వేసిన కంచెలు తొలగించాలని ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: ఫిర్యాదు రావడమే అదునుగా ఎలాంటి చట్టబద్ధమైన ప్రక్రియ చేపట్టకుండా భూములను ప్రభుత్వానివిగా పేర్కొంటూ హైడ్రా కంచె వేయడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ‘బుల్డోజర్‌ న్యాయం’పై చెప్పిన తీర్పు మీ ఏజెన్సీకి వర్తించదా అని ప్రశ్నించింది. అత్యున్నత న్యాయస్థానం తీర్పునకు కట్టుబడి పనిచేస్తున్నారా? లేదా? అని అడిగింది. సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా, ఇష్టారాజ్యంగా వ్యవహరించాలని హైడ్రా భావిస్తోందా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఫిర్యాదు వచ్చినప్పుడు, కంచె వేసేటప్పుడు హైడ్రా చట్ట ప్రక్రియను పాటించడంలేదని, ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని అభిప్రాయపడింది. ‘మీరు మీకు నచ్చిన భూములకు కంచె వేస్తూనే ఉంటారు. కానీ మీ చర్యలకు మద్దతిచ్చే ఆధారాలు మీ వద్ద ఉండవు’అని మండిపడింది. హైదరాబాద్‌ గోల్కొండ మండలం గుడిమల్కాపూర్‌ సర్వే నంబర్‌ 104లోని 1,351 చదరపు గజాల స్థలంలో తన షెడ్‌ను కూచ్చివేసి, దాని చుట్టూ హైడ్రా కంచె వేయడాన్ని సవాల్‌ చేస్తూ ఎన్‌ఆర్‌ఐ వ్యాపారవేత్త ప్రసాద్‌ ఎన్‌.తంజెర్ల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

దీనిపై జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. హైడ్రా చర్య గతంలో కోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధమన్నారు. హైడ్రా న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కోర్టు అడిగిన వాటిపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల ప్రకారం హైడ్రా చర్యలు చేపడుతోందని వాదించారు.  

కంచె తొలగించండి... 
వాదనలు విన్న న్యాయమూర్తి.. సదరు భూమి నుంచి కంచె తొలగించాలని హైడ్రాను ఆదేశించారు. అలాగే అక్కడ ఎలాంటి మార్పులు చేయొద్దని పిటిషనర్‌కు స్పష్టం చేశారు. ఆ భూములు ప్రభుత్వ భూములా.. వివాదంలో ఉన్నాయా.. కోర్టు ఉత్తర్వులున్నాయా.. అనేది ఎలా నిర్ధారణ చేస్తున్నారని ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు, నిర్ధారణ లేకుండా కంచె వేయడం సబబుకాదని హితవు పలికారు. జీవితకాలం సంపాదించిన డబ్బుతో ప్రజలు భూమి కొనుగోలు చేస్తారని, ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కంచెలు వేస్తూ పోవడం సమర్థనీయం కాదన్నారు. 

హైడ్రాపై ఆరోపణలు ఇదే తొలిసారి కాదని, వందల పిటిషన్లు న్యాయస్థానం వద్ద విచారణలో ఉన్నాయని చెప్పారు. కంచె వేయడానికి ఏజెన్సీకున్న అధికారం ఏంటో కూడా చెప్పాలన్నారు. పిటిషనర్‌ ఫోన్‌ను లాక్కునే అధికారం మీకు ఎవరిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన పత్రాలు, గణాంకాలు, భూములపై పూర్తి సమాచారం లేకుండా కంచె వేయవద్దని హైడ్రాను ఆదేశించారు. ఇప్పటివరకు అలా వేసి ఉంటే తొలగించాలన్నారు. తదుపరి విచారణ మార్చి 3కి వాయిదా వేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement