మళ్లీ అనుమతులు పొందాల్సిందే ! | CWC says state wise allocation of Godavari waters has not been done | Sakshi
Sakshi News home page

మళ్లీ అనుమతులు పొందాల్సిందే !

Feb 18 2026 4:48 AM | Updated on Feb 18 2026 4:48 AM

CWC says state wise allocation of Godavari waters has not been done

ప్రాజెక్టుల్లో ‘మౌలిక’మార్పుల నేపథ్యంలో కృష్ణా బోర్డు  

ఉదాహరణగా శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తావన

మళ్లీ అనుమతుల ఆవశ్యకతపై స్పష్టత ఇవ్వాలని సీడబ్ల్యూసీని కోరిన బోర్డు 

కేడబ్ల్యూడీటీ–2 తీర్పు వచ్చే వరకు ప్రాజెక్టులకి అనుమతుల ప్రక్రియ చేపట్టరాదు 

టెలీమెట్రీల ఏర్పాటుకీ నిబంధనలు లేవు..ట్రిబ్యునల్‌ తీర్పు కోసం నిరీక్షించాల్సిందే 

జల వివాదాల కమిటీ సమావేశంలో కృష్ణా బోర్డు స్పష్టీకరణ 

రాష్ట్రాల వారీగా గోదావరి జలాల కేటాయింపులు జరగలేదన్న సీడబ్ల్యూసీ 

జల వివాదాల కమిటీ సమావేశం మినట్స్‌లో వెల్లడించిన కేంద్ర జలశక్తి శాఖ

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా పరీవాహకంలోని ప్రాజెక్టుల స్వరూపంతో పాటు వాటి విస్తృతిలో మౌలికమైన మార్పులు జరిగిన నేపథ్యంలో 2021 జూలై 15న కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం వాటికి 2022 జూలై 14లోగా మళ్లీ కొత్తగా అనుమతులు తీసుకొని ఉండాల్సిందేనని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) స్పష్టం చేసింది. లేనిపక్షంలో అలాంటి అనుమతి లేని ప్రాజెక్టుల వినియోగాన్ని నిలుపుదల చేయాల్సి ఉంటుందని గుర్తు చేసింది. ఇలాంటి ప్రాజెక్టుల ద్వారా నీటి వినియోగాన్ని క్రమబద్దీకరించడం తమకు సాధ్యం కాదని తేల్చిచెప్పింది. 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలంను దీనికి ఉదాహరణగా పేర్కొంది. ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్‌–1లోని ప్రతి ప్రాజెక్టు విషయంలో పెరిగిన మొత్తం పరిధి మేరకు సీడబ్ల్యూసీలోని టెక్నికల్‌ అడ్వైయిజరీ కమిటీ(టీఏసీ) నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టులకి సంబంధించి ఎన్నో భాగాలకు ఇంకా అనుమతులు లేకపోవడమే కారణమని తేల్చిచెప్పింది. ఈ మేరకు స్వరూపం, విస్తృతిలో మౌలిక మార్పులకు గురైన ప్రాజెక్టులకు మళ్లీ అనుమతులు తీసుకోవాల్సిన అవసరంపై స్పష్టత ఇవ్వాలని సీడబ్ల్యూసీకి ఇప్పటికే కోరామని కృష్ణాబోర్డు వెల్లడించింది. 

శ్రీశైలం ప్రాజెక్టును పేర్కొనడంతో ప్రాధాన్యం 
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) చైర్మన్‌ అధ్యక్షతన కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన కమిటీ జనవరి 30న ఢిల్లీలో సమావేశమైనప్పుడు ఈ మేరకు కృష్ణా బోర్డు ప్రజెంటేషన్‌ ఇచి్చంది. సమావేశం మినట్స్‌ కాపీలో ఈ అంశాలను కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. మౌలిక స్వరూపం, విస్తృతిలో మార్పులకు లోనైన ప్రాజెక్టులకి ఉదాహరణగా శ్రీశైలం ప్రాజెక్టును కృష్ణా బోర్డు పేర్కొనడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. 

శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి సీడబ్ల్యూసీ అనుమతులుండగా, దానిపై ఎస్‌ఆర్‌బీసీ ప్రాజెక్టును నిర్మించడానికి మాత్రమే ఆ తర్వాత అనుమతులు జారీ అయ్యాయి. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు కుడి వైపు నుంచి ఎస్‌ఆర్‌బీసీ, తెలుగు గంగ, జీఎన్‌ఎస్‌ఎస్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, కేసీ కాల్వ అవసరాల కోసం ఏపీ, ఎడమ వైపున కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాల అవసరాల కోసం తెలంగాణ నీళ్లను తరలించుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టులన్నింటికీ అనుమతులు లేకపోవడంతో వాటిని తప్పనిసరిగా పొందాల్సిందేనని కృష్ణా బోర్డు ఈ సమావేశంలో పరోక్షంగా స్పష్టం చేసింది.  

కేడబ్ల్యూడీటీ–2 తీర్పు వచ్చే వరకు ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వరాదు.. 
ప్రస్తుతం కృష్ణా ట్రిబ్యునల్‌–1 తీర్పు అమల్లో ఉండగా, దాని ఆధారంగా ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపకాల విషయంలో ఎదురవుతున్న సవాళ్లను కృష్ణా బోర్డు ఎత్తిచూపింది. రాష్ట్రాల వారీగా, ప్రాజెక్టుల వారీగా నిర్దిష్ట కేటాయింపులతో పాటు వర్షాభావంతో నీటి కొరత ఏర్పడినప్పుడు ప్రాజెక్టుల నుంచి రెండు రాష్ట్రాలకు ఏ నిబంధనల ప్రాతిపదికన (ఆపరేషన్‌ ప్రొటో­కాల్స్‌) నీళ్లను విడుదల చేయాలి అనే అంశంపై స్పష్టత అవసరముందని, ఈ అంశాలపై కృష్ణా ట్రిబ్యునల్‌–2 నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని తెలియజేసింది. 

కేంద్రం జారీచేసిన గెజి­ట్‌ నోటిఫికేషన్ల ప్రకారం కృష్ణా బేసిన్‌లోని ఏ ఒక్క ప్రాజెక్టును రెండు రాష్ట్రాలు ఇప్పటి వరకు తమకు అప్పగించలేదని కృష్ణాబోర్డు కమిటీ దృష్టికి తీసుకెళ్లింది. ఈ ప్రాజెక్టులను తమ అధికార పరిధిలోకి తీసుకురాకపోతే వాటి ద్వారా నీటి వినియోగా­న్ని క్రమబద్దీకరించడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఉమ్మడి ఏపీకి కృష్ణా ట్రిబ్యునల్‌–1 1976లో 75శాతం లభ్యత ఆధారంగా 811 టీఎంసీలను కేటాయించింది. 

కృష్ణా ట్రిబ్యునల్‌–2 తదుపరి కేటాయింపులు/వివాదాల పరిష్కారం జరిపే వరకు అనుమతులు లేని ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులకి సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో అనుమతుల జారీ ప్రక్రియను చేపట్టడం అర్థరహితమని, చట్టబద్ధం కాదని స్పష్టీకరించింది.  

కృష్ణా ట్రిబ్యునల్‌–2 తీర్పు తర్వాతే టెలీమెట్రీ కేంద్రాలు
నీటి వినియోగం లెక్కలను తేల్చడానికి ప్రాజెక్టులపై స్వతంత్ర సంస్థ ఆధ్వర్యంలో టెలీమెట్రీ కేంద్రాల వంటి వ్యవస్థల ఏర్పాటు విషయంలో కృష్ణా ట్రిబ్యునల్‌–1 ఎలాంటి నిబంధనలు జారీ చేయలేదని కృష్ణాబోర్డు స్పష్టం చేసింది. సంబంధిత రాష్ట్రాలే గేజింగ్, వినియోగం లెక్కింపు, వార్షిక నీటి వినియోగం లెక్కలను నిర్వహించాల్సి ఉంటుందని మాత్రమే ట్రిబ్యునల్‌ పేర్కొందని గుర్తు చేసింది. 

టెలీమెట్రీ కేంద్రాల ద్వారా నీటి వినియోగం క్రమబద్దీకరించే విషయంలో సంబంధిత రాష్ట్రాలతో కృష్ణా బోర్డు బాధ్యతలను నిర్వచిస్తూ కృష్ణాబోర్డు–2 నిర్ణయం వెల్లడించే వరకు వేచిచూడక తప్పదని స్పష్టం చేసింది. ఏడేళ్ల కింద బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 18 టెలీమెట్రీ కేంద్రాలను ఎన్నడూ నీటి వినియోగం క్రమబద్దీకరణ కోసం వాడలేదని, వాటి ద్వారా అందే సమాచారంలో స్థిరత్వం కొరవడిందని తెలియజేసింది.  

గోదావరి జలాల కేటాయింపులు తేల్చలేదు
గోదావరి బేసిన్‌లో నీటి లభ్యత ఎంత ఉందనే అంశాన్ని గోదా­వరి జల వివాదాల ట్రిబ్యునల్‌(జీడబ్ల్యూడీటీ) తేల్చలేదని సీడబ్ల్యూసీలోని ప్రాజెక్టుల మదింపు విభాగం(పీఏఓ) వెల్లడించింది. బేసిన్‌ పరిధిలోని రాష్ట్రాలకు నీటి పంపకాలను సైతం ట్రిబ్యునల్‌ జరపలేదు. కృష్ణా ట్రిబ్యునల్, గోదావరి ట్రిబ్యునల్‌ జరిపిన నీటి కేటాయింపులపై కమిటీ ముందు ప్రజెంటేషన్‌ ఇచి్చంది.

Advertisement
 
Advertisement
Advertisement