జీవ విజ్ఞాన రాజధానిగా హైదరాబాద్‌! | CM Revanth call to companies and industrialists | Sakshi
Sakshi News home page

జీవ విజ్ఞాన రాజధానిగా హైదరాబాద్‌!

Feb 18 2026 1:57 AM | Updated on Feb 18 2026 4:49 AM

CM Revanth call to companies and industrialists

‘బయో ఆసియా’ సదస్సు సందర్భంగా ప్రతినిధులతో ముచ్చటిస్తున్న సీఎం రేవంత్‌. చిత్రంలో మంత్రి శ్రీధర్‌బాబు

మనమంతా కలిసి పనిచేస్తే ఆ స్థాయికి ఎదుగుతుంది 

తెలంగాణ ఎదుగుదలలో మీరు భాగస్వాములు కావాలి 

కంపెనీలు, పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్‌ పిలుపు

ఒకప్పుడు హైదరాబాద్‌ అంటే చారి్మనార్, బిర్యానీ, ఫార్మా, సాఫ్ట్‌వేర్‌ 

ఇప్పుడు ప్రపంచ వ్యాక్సిన్‌ తయారీ కేంద్రంగా గుర్తింపు 

జీసీసీలకు, పరిశోధన, డిజైన్‌లో విశిష్టతకు ప్రపంచ కేంద్రం 

పెట్టుబడులు పెట్టి జీసీసీలు, ఆవిష్కరణ కేంద్రాలు స్థాపించాలన్న సీఎం 

భవిష్యత్‌ మార్పులతో కూడిన ప్రపంచానికి రాష్ట్రం సిద్ధమని వెల్లడి 

‘బయో ఆసియా–2026’ సదస్సు ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: ‘ప్రభుత్వం, కంపెనీలు, నిపుణులు, ప్రజలు..అందరం కలిసి పనిచేస్తే ప్రస్తుతం ప్రపంచ వ్యాక్సిన్‌ రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ ప్రపంచ జీవ విజ్ఞాన రాజధానిగా ఎదుగుతుంది. తెలంగాణ అంటే వ్యాపారం. తెలంగాణ ఎదుగుతోంది. ఈ ఎదుగుదలలో మీరు భాగస్వాములు కావాలి..’ అంటూ  కంపెనీలు, పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘23 ఏళ్ల క్రితం బయో ఆసియా సదస్సు ప్రారంభమైనప్పుడు, హైదరాబాద్‌ అంటే చార్మినార్, బిర్యానీ, ఔషధ తయారీ, సాఫ్ట్‌వేర్‌ నగరం అన్న గుర్తింపు ఉండేది. అదే హైదరాబాద్‌ ఇప్పుడు ప్రపంచ వ్యాక్సిన్‌ తయారీ కేంద్రంగా నిలిచింది. 

దూరదృష్టి గల నాయకత్వం, స్పష్టమైన విధానాలు, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు అనే బలాల ఆధారంగా హైదరాబాద్‌ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కు, పరిశోధన, డిజైన్‌లో విశిష్టతకు ప్రపంచ కేంద్రంగా ఎదిగింది. బల్క్‌ డ్రగ్స్‌ నుంచి బయాలజిక్స్‌ వరకు, తయారీ నుంచి ఆవిష్కరణ వరకు.. భారత్‌ నుంచి ప్రపంచ స్థాయి వరకు తెలంగాణ ముందుకు సాగుతోంది. ప్రపంచంలోని అగ్రగామి క్లస్టర్లతో పోటీ పడుతున్నాం. భవిష్యత్‌ మార్పులతో కూడిన ప్రపంచానికి తెలంగాణ సిద్ధంగా ఉంది..’ అని సీఎం చెప్పారు. మంగళవారం హైటెక్స్‌లో ‘బయో ఆసియా–2026’ సదస్సు ప్రారం¿ోత్సవంలో ఆయన మాట్లాడారు. 

దృఢమైన దృష్టి, ముందుచూపు ఫలితం 
‘హైదరాబాద్‌ ఇప్పటికే జీసీసీలకు ప్రాధాన్య గమ్యస్థానంగా మారింది. దీన్ని మనమంతా కలిసి సమగ్ర జీవ విజ్ఞాన రంగానికి ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దుదాం. ఇక్కడ పెట్టుబడులు పెట్టండి. మీ జీసీసీలను స్థాపించండి. ఆవిష్కరణ కేంద్రాలు నిర్మించండి. మాలిక్యూల్స్, ఔషధాలను తయారు చేయండి. క్లినికల్‌ అనలిటిక్స్‌ను నడపండి. ఏఐ ప్లాట్‌ఫామ్స్‌ అభివృద్ధి చేయండి. డిజిటల్‌ తయారీని ముందుకు తీసుకెళ్లండి. మా ప్రభుత్వం, అధికారులు, శాస్త్రవేత్తలు, నైపుణ్య యువత మీ విజయంలో భాగస్వాములు అవుతారు. గత రెండేళ్లలోనే జీవ విజ్ఞాన రంగంలో రూ.73 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఇటీవల దావోస్‌లో కొత్త లైఫ్‌ సైన్సెస్‌ పాలసీని ప్రకటించాం. జీనోమ్‌ వ్యాలీని విస్తరించాం. ప్రపంచ స్థాయి పరిశోధన, ఆవిష్కరణలకు ‘వన్‌–బయో’ను ప్రారంభించాం. గ్రీన్‌ ఫార్మా సిటీని వేగవంతం చేశాం. అనేక జీసీసీలను ఆహా్వనించాం. ఇది సాధారణ అభివృద్ధి కాదు. దృఢమైన దృష్టి, ముందుచూపు ఫలితం ఇది..’ అని సీఎం పేర్కొన్నారు.  
బయో వరల్డ్‌ దిశగా.. 
‘బయో ఆసియా తన పేరును దాటి, బయో వరల్డ్‌గా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 ప్రముఖ సంస్థలకు చెందిన 4 వేల మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఫార్మా, బయోసైన్సెస్, బయోటెక్, బల్క్‌ డ్రగ్స్, వ్యాక్సిన్లు, ఆరోగ్య రంగాల్లో ప్రముఖులు, బిజినెస్‌ లీడర్స్‌ మనతో ఉన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సదస్సు.. దావోస్‌లో జరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం లాంటి అంతర్జాతీయ గుర్తింపు పొందుతుందన్న నమ్మకం ఉంది. ఇటీవల తెలంగాణ రైజింగ్‌ 2047’ విజన్‌ను ప్రకటించాం. 

2034 నాటికి ఒక ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడం మా లక్ష్యం. ప్రస్తుత జీవ విజ్ఞాన ధోరణులను చూస్తే.. పరిశోధన సంస్థలు, కార్పొరేట్లు, స్టార్టప్‌లు, చిన్న మధ్య తరహా సంస్థలు, ప్రభుత్వం మధ్య బలమైన భాగస్వామ్యం అవసరం. మీరు విశ్వసనీయమైన, స్థిరమైన, భవిష్యత్తు కోసం మంచి వాతావరణాన్ని కోరుకుంటున్నారు. తెలంగాణ అది అందిస్తుంది. హైదరాబాద్‌ మీ సమాధానం..’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.  

ల్యాబొరేటరీ ఆఫ్‌ ది ఫ్యూచర్‌గా హైదరాబాద్‌: శ్రీధర్‌బాబు 
ఫార్మా రాజధానిగా పేరొందిన హైదరాబాద్‌ను ‘ల్యాబొరేటరీ ఆఫ్‌ ది ఫ్యూచర్‌’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచంలోని టాప్‌ 3 లైఫ్‌ సైన్సెస్‌ క్లస్టర్లలో రాష్ట్రాన్ని ఒకటిగా నిలిపేందుకే ‘తెలంగాణ నెక్సŠట్‌ – జెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీ(2026– 2030)‘ రూపొందించామని తెలిపారు. తెలంగాణ స్కూల్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్, యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ద్వారా ఎంఆర్‌ఎన్‌ఏ, జీన్‌ ఎడిటింగ్, ఏఐ ఆధారిత డ్రగ్‌ డిస్కవరీ వంటి అత్యాధునిక రంగాల్లో ‘రెడీ టూ వర్క్‌ ఫోర్స్‌‘గా ఇక్కడి యువతను తయారు చేస్తున్నామని చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement