సాక్షి,హైదరాబాద్: ఐబొమ్మ రవికి బెయిల్ లభించింది. సినిమా పైరసీ కేసులో గతేడాది నవంబర్‌లో అరెస్టైన ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మడి రవి నాంపల్లి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్‌పోర్ట్ సరెండర్ చేయడంతో పాటు ప్రతీరోజు సీసీఎస్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. దేశ విడిచి వెళ్లొద్దని తెలిపింది. ఇంటర్నెట్ వినియోగించుకోవాలంటే పోలీసుల అనుమతి తప్పని సరి చేసింది.
పైరసీ కేసులో అరెస్టైన బెయిల్ పొందిన ఇమ్మడి రవి ఇప్పటికైనా అతని తండ్రి అప్పారావు దగ్గరికి వెళతాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. గతేడాది కుమారుడు అరెస్టును తండ్రి అప్పారావు సమర్ధించారు.
ఇమ్మడి రవి అరెస్టు వేళ మీడియా తండ్రి అప్పారావును కదలించింది. ‘రవి నేరం చేయలేదని నేను చెప్పను. పరిణామాలు చూసి నేరం చేసినట్టు అంగీకరించాల్సిందే. రవి ఇంటికి వచ్చి రెండేళ్లు అవుతుంది. పోలీసులకు, ప్రభుత్వానికి సవాల్ విసిరితే ఊరుకుంటారా..?. కోట్లు సంపాదించడం అంటే మాటలా.. నేను సాదాసీదా జీవితం గడుపుతున్నాను. రవి తప్పు చేసి చేయలేదంటే ఊరుకుంటారా..?.రవి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్యా, భర్తలిద్దరికీ విభేదాలు ఉన్నాయి. ఏది ఏమైనా రవి చేసింది తప్పే’అని వ్యాఖ్యానించారు. తాజాగా బెయిల్ వచ్చిన ఇమ్మడి రవి కుటుంబ సభ్యులతో కలిసి ఉంటారా? లేదంటే ఉద్యోగం చేస్తారా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
కాగా,ఇమ్మడి రవి విచారణలో పలు కీలక విషయాలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. ప్రహ్లాద్‌తో పాటు మరో ఇద్దరి పేర్లు, వివరాలతో రవి నకిలీ గుర్తింపు కార్డులు పొందినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు నిర్థారించారు. వెల్లెల ప్రహ్లాద్ కుమార్‌తో పాటు అంజయ్య, కాళీప్రసాద్ పేర్లు, వివరాలు వాడి ఐబొమ్మ రవి తన బ్యాంక్ అకౌంట్లతో పాటు ఇతర గుర్తింపు కార్డులు పొందినట్లు తేలింది.
గతంలో రవి అమీర్‌పేట్‌లోని హాస్టల్లో ఉన్నప్పుడు ప్రహ్లాద్‌తో పరిచయమైంది. కడప జిల్లాకు చెందిన ప్రహ్లాద్ 2017లో అమీర్‌పేటలోని హాస్టల్ రూమ్‌లో రవితో కలిసి ఉన్నాడు. ఆ సమయంలో ప్రహ్లాద్‌కు సంబంధించిన పదో తరగతి మార్కుల లిస్టు, ఆధార్ కార్డు కలర్ జిరాక్సులు తీసుకున్నాడు. ఆపై వాటిని వాడి ప్రహ్లాద్ పేరుతోనే డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు తీసుకుని వీటి ఆధారంగా బ్యాంక్ అకౌంట్ తెరిచాడు. కరీంనగర్‌కు చెందిన అంజయ్య పేరుతోనూ రవి నకిలీ గుర్తింపుకార్డులు తయారు చేశాడు.
ఇతడితో పాటు తన పదో తరగతి క్లాస్‌మేట్ అయిన కాళీప్రసాద్ పేరుతో రూపొందించాడు. ఈ ముగ్గురి పేర్లు, వివరాలు వాడే వెబ్‌సైట్ల నిర్వహణకు అవసరమైన డొమైన్లు ఖరీదు చేశాడు. హాస్పిటల్.ఇన్, సప్లయర్స్.ఇన్ తదితర వెబ్‌సైట్లను ఇలానే ఏర్పాటు చేశారు. ఈ రెండూ విజయం సాధించకపోవడంతోనే రవి ‘ఐబొమ్మ’ను ఏర్పాటు చేశాడు. ఇతడి బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీల్లో ఇప్పటికి రూ.13 కోట్లు గుర్తించారు. వీటిలో రూ.3 కోట్లు పోలీసులు ఫ్రీజ్ చేయగా.. మిగతా రూ.10 కోట్లు విదేశాల్లో జల్సాలు, ఆస్తుల ఖరీదుకు రవి ఖర్చు చేశాడు.


