ధూమపాన ప్రియులకు భారీ షాక్‌  | Cigarette Price Hike In India As GST Hike And Excise Duty Trigger Artificial Shortage, Retailers Sell Up To 70% Above MRP | Sakshi
Sakshi News home page

ధూమపాన ప్రియులకు భారీ షాక్‌ 

Feb 17 2026 12:34 PM | Updated on Feb 17 2026 12:50 PM

cigarette price hike india gst 40percent shortage market

జీఎస్టీ, ఎక్సైజ్‌ సుంకం పెంచిన కేంద్రం 

పెరిగిన ఎంఆర్‌పీతో  ఇంకా మార్కెట్లోకి రాని కొత్త స్టాకు 

పాత ఎంఆర్‌పీపైనే ఇష్టారాజ్యంగా ధరలు పెంచి విక్రయాలు

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ఇటీవల సిగరెట్లపై జీఎస్టీని 28 నుంచి 40 శాతానికి పెంచడంతో పాటు అదనపు ఎక్సైజ్‌ డ్యూటీని విధించడంతో సిగరెట్ల ధరలు ఆకాశాన్నంటాయి. ఫిబ్ర వరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రావాల్సి ఉండగా, ఇంకా మార్కెట్లో ఆ మేరకు సవరించిన గరిష్ట చిల్లర ధర(ఎంఆర్‌పీ)లతో స్టాకు రాలేదు. దీంతో డిమాండ్‌కు సరిపడా సరఫరా లేక మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడింది. కేంద్రం జీఎస్టీ, సుంకం పెంచిందనే సాకుతో డీలర్లు పాత స్టాకునే 50 శాతం వరకు ధరలు పెంచి రిటైల్‌ వర్తకులకు సరఫరా చేస్తున్నారు. 

దీంతో రిటైల్‌ మా ర్కెట్‌లో ఎంఆర్‌పీ కంటే 60–70 శాతం అధిక ధరలతో సిగరెట్లను విక్రయిస్తున్నారు. నెల రోజుల వ్యవధిలోనే సిగరెట్ల ధరలను మూడు పర్యాయాలు పెంచేయడం గమనార్హం. కృత్రిమ కొరత తీరకపోతే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని రిటైల్‌ వర్తకులు పేర్కొంటున్నారు. సిగరెట్ల ఉత్పత్తిదారుల నుంచి సరఫరా లేదని పేర్కొంటూ డీలర్లు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిగరెట్ల విక్రయాల రంగంలో 80 శాతం మార్కెట్‌ షేర్‌తో ఐటీసీ లిమిటెడ్‌ కంపెనీ ఆధిపత్యం కొనసాగిస్తుండగా, గాడ్‌ఫ్రె ఫిలిప్స్‌ ఇండియా లిమిటెడ్, వీఎస్‌టీ, గోల్డెన్‌ టొబాకో, ఎన్టీసీ ఇండస్ట్రీస్, ఇలైట్‌కాన్‌ కంపెనీలు మిగిలిన షేర్‌ను కలిగి ఉన్నాయి. 

కొత్త ఎంఆర్‌పీ ధరలతో ఈ కంపెనీలు స్టాకు సరఫరా ప్రారంభిస్తే సిగరెట్ల ధరల్లో స్థిరత్వం వచ్చే అవకాశం ఉంది. లేకుంటే ధరల విషయంలో డీలర్ల ఇష్టారాజ్యం కొనసాగనుంది. కాగా, నిబంధనల ప్రకారం ఎంఆర్‌పీ ధరలకి మించి రిటైల్‌ మార్కెట్లో విక్రయాలు జరపరాదు. నెల రోజులకు పైగా సిగరెట్లను ఎంఆర్‌పీ ధరల కంటే 50–60 శాతం అధిక ధరలతో విక్రయిస్తున్నా తూనికలు, కొలతల శాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పెరిగిన ఎంఆర్‌పీ ధరలతో కొత్త స్టాకు మార్కెట్లోకి వచ్చాకే ఆ మేరకు ధరలను పెంచాలని నిబంధనలు పేర్కొంటున్నాయి.  

కింగ్‌ సైజ్‌ బాదుడు... 
సిగరెట్ల సైజును బట్టి ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచుతూ కేంద్రం ఎక్సైజ్‌ సుంకాల చట్టానికి సవరణ జరిపింది. 40 శాతం జీఎస్టీకి తోడు ఎక్సైజ్‌ సుంకం తోడు కావడంతో సైజు పెరిగిన కొద్దీ సిగరెట్ల ధరలు మరింత పెరిగిపోయాయి. 76ఎంఎం సిగరెట్ల ప్యాక్‌పై రూ.50–55 వరకు ధరలను పెంచేశారు. ఇక 84 ఎంఎం పొడవు కలిగి ఉండే కింగ్‌ సైజ్‌ 10 సిగరెట్ల ప్యాక్‌పై రూ.70 వరకు ధర పెరిగిపోయింది. 97 ఎంఎం స్లిమ్‌ సైజు సిగరెట్ల ధరలూ రూ.50–60 వరకు పెరిగాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement