రూ.215 లక్షల కోట్లకు రిటైల్‌ మార్కెట్‌ | India retail market set to reach Rs 21. 5 lakh crore by 2035 | Sakshi
Sakshi News home page

రూ.215 లక్షల కోట్లకు రిటైల్‌ మార్కెట్‌

Feb 17 2026 6:12 AM | Updated on Feb 17 2026 6:12 AM

India retail market set to reach Rs 21. 5 lakh crore by 2035

పదేళ్లలో రెట్టింపు స్థాయికి 

అత్యుత్తమ నిర్వహణతోనే విజయం

బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ నివేదిక

న్యూఢిల్లీ: దేశ రిటైల్‌ మార్కెట్‌ వేగవంతమైన వృద్ధి దిశగా పరుగులు తీస్తోంది. 2025 నాటికి భారత రిటైల్‌ మార్కెట్‌ రూ.90–95 లక్షల కోట్ల పరిమాణంతో ఉండగా, 2035 నాటికి అంటే వచ్చే పదేళ్లలో రూ.210–215 లక్షల కోట్ల  స్థాయికి విస్తరిస్తుందని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) అంచనా వేసింది. ప్రపంచంలోని ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు మించి భారత్‌ మంచి పనితీరు చూపిస్తుండడంతోపాటు, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానానికి చేరుకోనున్నట్టు గుర్తు చేసింది. 

భారత రిటైల్‌ రంగం తదుపరి వృద్ధి దశలోకి ప్రవేశించిందంటూ.. స్పష్టత, క్రమశిక్షణతో కూడిన నిర్వహణ, ఏఐ ఆధారిత పరివర్తనపై దృష్టి సారించిన సంస్థలను విజయం వరిస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఒక నివేదికను బీసీజీ, రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా విడుదల చేశాయి. 

వినియోగదారులతో అనుబంధం, నిర్వహణ నమూనాలు, నైపుణ్యాల విషయంలో నిర్మాణాత్మక మార్పులను స్వీకరించే సంస్థలు రూ.200 లక్షల కోట్ల రిటైల్‌ మార్కెట్‌లో గణనీయమైన విలువను సొంతం చేసుకుంటాయని ఈ నివేదిక తెలిపింది. కస్టమర్లకు ప్రత్యేకమైన విలువను అందించడం, స్థిరమైన లాభదాయకతను కొనసాగించేందుకు క్రమశిక్షణతో కూడిన నిర్వహణ ఎంతో కీలకమని పేర్కొంది. వినియోగదారుల నిర్ణయాలను, ముఖ్యంగా ఏఐ ప్రభావితం చేస్తుండడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది.  

టెక్నాలజీ పాత్ర కీలకం.. 
‘‘భారత రిటైల్‌ ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం. వచ్చే దశాబ్ద కాలంలో రూ.200 లక్షల కోట్లకు విస్తరించనుంది. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌ రిటైల్‌ సంస్థల నగదు ప్రవాహాలు స్పష్టమైన పురోగతిని చూపిస్తున్నాయి. విస్తరణలో ఏఐ వంటి టెక్నాలజీల విస్తృత వినియోగం, అత్యుత్తమ నిర్వహణ, ప్రత్యేకమైన విలువను అందించే సంస్థలే విజేతలుగా నిలుస్తాయి’’అని బీసీజీ ఎండీ అభీక్‌సింఘి తెలిపారు. 

ఏజెంటింక్‌ కామర్స్‌ అన్నది ప్రయోగాత్మక దశ నుంచి ఆచరణ దశకు వచ్చేసిందని.. పరిశోధన, కొనుగోలు నిర్ణయాలను జెన్‌ఏఐ ప్రభావితం చేస్తోందని ఈ నివేదిక తెలిపింది. అమెరికాలో ఇప్పటికే 42 శాతం మంది వినియోగదారులు జెన్‌ఏఐని వినియోగిస్తున్నట్టు పేర్కొంది. ‘‘వినియోగదారులు ఉత్పత్తిని గుర్తించడం, పరిశీలించడం, కొనుగోలు చేయడాన్ని అంతర్జాతీయంగా ఏజెంటిక్‌ కామర్స్‌ ప్రభావితం చేస్తోంది. భారత్‌లో డిజిటల్‌ వినియోగం బలంగా ఉంది. కనుక పట్టణ ప్రాంతాల్లో ఏఐ ఆధారిత షాపింగ్, ముఖ్యంగా జెన్‌ జెడ్‌లో వేగవంతం అవుతుంది’’అని బీసీజీ ఎండీ, పార్ట్‌నర్‌ భారత్‌ మిమానీ తెలిపారు. 

ఉత్పత్తులు, సరఫరా చైన్, మార్కెటింగ్, సేవలు ఇలా అన్నింటా ఏఐ వినియోగంతో 40–60 శాతం అధిక ప్రయోజనాలను రిటైలర్లు పొందగలరని ఈ నివేదిక తెలిపింది. ‘‘డిమాండ్‌ బలంగా ఉంది. వినియోగదారులు వివేకంతో వ్యవహరిస్తున్నారు. రిటైలర్లు ఆవిష్కరణలకు ఆసక్తి చూపిస్తున్నారు. డిజిటల్‌ పరివర్తనను ఒక ప్రాజెక్టుగా కాకుండా క్రమశిక్షణగా పరిగణించే సంస్థలు, అన్ని ఫార్మాట్లలో స్థిరమైన సేవలు అందించేవి వచ్చే దశాబ్దంలో విజేతలుగా నిలుస్తాయి’’ అని రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో కుమార్‌ రాజగోపాలన్‌ అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement