రెండుచోట్ల లాటరీ పద్ధతిలో చైర్‌పర్సన్ పదవులు దక్కించుకున్న హస్తం
ఒక్కచోట బీఆర్‌ఎస్‌కు చైర్‌పర్సన్ పీఠం
వాయిదా పడిన 11లో 8 చోట్ల ఎన్నిక ప్రక్రియ పూర్తి.. మరో మూడు వాయిదా
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికలో వాయిదా పడిన 11 చోట్ల మంగళవారం ఎన్నికలు నిర్వహించగా అందులో ఎనిమిది చోట్ల ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మరో మూడు చోట్ల వాయిదా పడింది. 8 మున్సిపాలిటీల్లో ఏడు చైర్‌పర్సన్ పీఠాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే.. ఒక్కచోట బీఆర్‌ఎస్ విజయం సాధించింది. కాంగ్రెస్ విజయం సాధించిన ఏడు మున్సిపాల్టీల్లో.. రెండింటిని టాస్‌తో గెలుపొందడం విశేషం, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగాం, తొర్రూర్ మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఎక్స్‌అఫీ షియో ఓట్లతో కలుపుకొంటే సమానంగా ఓట్లు రావడంతో చైర్‌పర్సన్ పీఠం కోసం ఎన్నికల అధికారులు టాస్ వేయగా.. రెండుచోట్ల కూ డా కాంగ్రెస్‌కు చైర్‌పర్సన్ పీఠాలు దక్కా యి.
ఇక కాగజ్‌నగర్‌లో బీజేపీ సభ్యులు కాంగ్రెస్‌కు మద్దతునివ్వడంతో అక్కడ చైర్‌పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకుంటే.. వైస్‌చైర్మన్ స్థానాన్ని బీజేపీ సాధించింది. కాగా ఇబ్రహీంపట్నం ము న్సిపాలిటీలో ఎన్నిక ప్రక్రియ సగం వరకు అయిన తరువాత హైకోర్టు నుంచి స్టే ఉత్తర్వులు రావడంతో.. ఎన్నిక ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. ఇది కాకుండా క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో ఎన్నికలు వా యిదా పడ్డాయి. ఈరోజు కూడా బద్ద శత్రువుల్లా వ్యవహరించే పార్టీలు ఒకరికొకరు సహకరించుకోవడం విశేషం.
ఎన్నికల సంఘం ప్రకటించిన ఫలితాలు ఇలా..
ఇంద్రేశంలో బీఆర్‌ఎస్.. జహీరాబాద్‌లో కాంగ్రెస్..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం, జహీరాబాద్ మున్సిపాలిటీల చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌ల ఎన్నిక మంగళవారం జరిగింది. ఇందులో ఇంద్రేశం మున్సిపాలిటీని బీఆర్‌ఎస్ కైవసం చేసుకోగా, జహీరాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకుంది. ఇంద్రేశంలో 18 కౌన్సిలర్ స్థానాలు ఉండగా, 9 బీఆర్‌ఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్ ఆరు, బీజేపీ రెండు స్థానాలను గెలుచుకున్నాయి. ఒక స్థానం ఇండిపెండెంట్‌కు వచ్చింది. ఇండిపెండెంట్ కౌన్సిలర్ బీఆర్‌ఎస్ గూటికి చేరడంతో గులాబీ పార్టీకి చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ పదవులు దక్కాయి. చైర్‌పర్సన్‌గా కుశంగుల ప్రమీల ఎన్నికయ్యారు.
» జహీరాబాద్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలో హైడ్రామా కొనసాగింది. ఈ ఎన్నిక నిర్వహించిన అధికారుల తీరును బీఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. మొత్తం 37 కౌన్సిలర్ స్థానాలకు గాను బీఆర్‌ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ మూడు, ఎంఐఎం రెండు, ముగ్గురు స్వతంత్రులు గెలుపొందారు. కాంగ్రెస్ ఎంపీ షెట్కార్, స్థానిక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాణిక్‌రావు తమ ఎక్స్‌అఫీషియో ఓట్లను ఇక్కడ నమోదు చేసుకున్నారు. కాంగ్రెస్‌కు ఇద్దరు ఎంఐఎం, ముగ్గురు స్వతంత్రులు అనుకూలంగా ఓటేయడంతో చైర్మన్‌గా ఎండీ యూనూస్ ఎన్నికయ్యారు. వైస్‌చైర్‌పర్సన్ పదవి మాత్రం స్వతంత్ర కౌన్సిలర్‌కు వచ్చింది.
ఓరుగల్లు హస్తం క్లీన్‌స్వీప్...!
బీఆర్‌ఎస్ చేజారిన తొర్రూరు... డోర్నకల్, జనగామల్లోనూ కాంగ్రెస్
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్‌ను కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పటికే 9 మున్సిపాలిటీలను చేజిక్కించుకున్న కాంగ్రెస్.. నాటకీయ పరిణామాల మధ్య మంగళవారం జరిగిన ఎన్నికల్లో మూడింటినీ గెలుచుకుంది. లాటరీ తీసిన జనగామ, తొర్రూరులలో కూడా బీఆర్‌ఎస్‌కు ‘లక్కీ’ కలిసిరాలేదు. లాటరీలో అదృష్టం కలిసిరాక అవి ‘చేతి’కి చిక్కాయి. డోర్నకల్‌లో కూడా హస్తంపరమైంది.
» జనగామ, తొర్రూరు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉద్రికతల మధ్య కొనసాగింది. జనగామలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు సమానంగా ఓట్లు వచ్చాయి. ఎక్స్ అఫీషియో ఓట్లు వేసిన తర్వాత కూడా కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి బాలమణికి మొత్తం 16 ఓట్లు రాగా...బీఆర్‌ఎస్ చైర్మన్ అభ్యర్థి గోపగాని సుగుణాకర్‌కు సైతం 16 ఓట్లు వచ్చాయి. దీంతో నిబంధనల ప్రకారం అధికారులు డ్రా తీశారు. లక్కీ డ్రాలో కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి కదకంచి బాలమణి పేరు రావటంతో ఆమెను చైర్మన్‌గా అధికారులు ప్రకటించారు. దీంతో బీఆర్‌ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. మున్సిపల్ ఆఫీస్ ముందు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఆందోళన చేపట్టారు.
» జనగామ ఎన్నిక ప్రక్రియలో చేతులెత్తే పద్ధతితో బాలమణి, సుధాకర్‌లు ఇద్దరికీ సమాన ఓట్లు రావడంతో, లాటరీ ద్వారా ఎన్నిక నిర్వహించారు. మొదట కాంగ్రెస్ చేతులెత్తే ప్రక్రి య పూర్తికాగా, ఆ తర్వాత బీఆర్‌ఎస్ వంతు వచ్చింది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌కు మద్దతు గా 8వ వార్డుకు చెందిన మహిళా కౌన్సిలర్ మంజుల చేతిని పైకి ఎత్తగా, కాంగ్రెస్‌కు చెందిన కరుణాకర్ రెడ్డి, ఆ పార్టీకి మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి మారబోయిన పాండు ఆమె చేయిని లాగు తూ ఓటు వేయొద్దని కిందికి అనడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఇద్దరు కౌన్సిలర్లు వెనక్కి తగ్గారు.
దయాకర్‌రావు కన్నీటిపర్యంతం
నర్సింహులపేట: ‘45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దుర్మార్గపు పాలన, చూడలేదని, కక్షసాధింపు, మోసం రాజకీయాలు చూస్తుంటే రాజకీయాల్లో ఉండాలా.. తప్పుకోవాలా..అనిపిస్తుంది. నా ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలి’ అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కన్నీటిపర్యంతమయ్యారు.
ఇల్లెందు కాంగ్రెస్‌కే...
ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయింది. మంగళవారం ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి 19 మంది కాంగ్రెస్ సభ్యులు, రెబల్, స్వతంత్ర సభ్యులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకోగా ప్రిసైడింగ్ అధికారి మధు ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత రెండో వార్డు నుంచి గెలుపొందిన దొడ్డా కిరణ్ మిత్రాను చైర్‌పర్సన్‌గా, 17వ వార్డు నుంచి ఎన్నికైన పెండేలా రాజును వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు.


