రేపు రావాలంటూ సీఎం, ముఖ్య నేతలకు ఏఐసీసీ ఆహ్వానం
అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కీలక పిలుపు
పార్టీ బలోపేతం, బీజేపీ వ్యతిరేక ఆందోళనలపై దిశానిర్దేశం చేసేందుకే..
రాష్ట్రంలో ఏం జరుగుతోందన్న దానిపైనా చర్చించనున్న హైకమాండ్
నివేదికలు సిద్ధం చేస్తున్న సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత ఏఐసీసీ నుంచి తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి కీలకమైన పిలుపు వచ్చింది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించేందుకు ఈనెల 19న ఢిల్లీకి రావాలంటూ కబురు అందింది. గురువారం ఉదయం 10 గంటలకు ఏఐసీసీ కార్యాలయమైన ఇందిరాభవన్‌లో సమావేశానికి రావాలని సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, కేబినెట్ మంత్రులకు ఆహ్వానం అందినట్టు గాందీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాం«దీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ భేటీకి హాజరవుతారని తెలిపాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల పార్టీ నేతలతో సమావేశమవుతున్న క్రమంలోనే తెలంగాణ నాయకత్వాన్ని కూడా పిలిచారని వివరించాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఇన్‌చార్జి ఏఐసీసీ కార్యదర్శులు, ఏఐసీసీలో కార్యదర్శులుగా ఉన్న రాష్ట్ర నాయకులు కూడా ఢిల్లీ సమావేశానికి హాజరు కానున్నట్టు సమాచారం.
పార్టీ, ప్రభుత్వ పనితీరుపై సమీక్ష?: దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం ద్వారా 2029 పార్లమెంటు ఎన్నికల్లో ఢిల్లీ పీఠాన్ని అధిష్టించాలనే కోణంలోనే అన్ని రాష్ట్రాల పార్టీ నేతలతో ఏఐసీసీ సమావేశమవుతోంది. సంస్థాగతంగా పార్టీని ఉత్తేజితం చేయడంతో పాటు దేశ వ్యాప్తంగా నిర్వహించాల్సిన బీజేపీ వ్యతిరేక ఆందోళనలపై దిశానిర్దేశం చేయనుంది. అయితే తెలంగాణలో పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఏఐసీసీలోని ముగ్గురు కీలక నేతలు నిర్వహించే ఈ సమావేశంలో.. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుతో పాటు పార్టీతో సమన్వయం, పదవుల పందేరం, రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, ఆరు గ్యారంటీలు, ఇతర పార్టీల పరిస్థితి, డీసీసీ అధ్యక్షుల పనితీరు, పార్టీ కార్యవర్గానికి చేస్తున్న పని విభజన తదితర అంశాలపై కూడా సమీక్ష జరగనుంది. మరీ ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్గ సభ్యుల పనితీరును గురించిన సమాచారం కూడా ఏఐసీసీ వద్ద ఉందని, ఎన్నికల్లో గెలుపోటములే కాకుండా ఆయా శాఖల్లో జరుగుతున్న కార్యకలాపాల గురించిన చర్చ కూడా ఈ సమావేశంలో జరుగుతుందని తెలుస్తోంది.
మంత్రివర్గ విస్తరణపై స్పష్టత?
ఈ భేటీ తర్వాత మంత్రివర్గ విస్తరణ చేయాలా లేదా? మార్పులు చేర్పులుంటాయా? అనే అంశంపై స్పష్టత వస్తుందని సమాచారం. మరోవైపు రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఇతర పోస్టుల కేటాయింపు విషయంలోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఈ మేరకు అంశాల వారీగా మీనాక్షి నటరాజన్ ఏఐసీసీకి ఇప్పటికే పలు నివేదికలు అందజేసినట్టు చెబుతున్నారు. కాగా ఏఐసీసీకి అందజేసేందుకు గాను..గత రెండేళ్ల కాలంలో ప్రభుత్వ పనితీరు గురించి సీఎం రేవంత్‌రెడ్డి, తాను పీసీసీ అధ్యక్షుడిని అయిన తర్వాత పార్టీని బలోపేతం చేస్తున్న తీరు, పీసీసీ కమిటీలు, ఏఐసీసీ ఇచ్చే ఆందోళనల విజయవంతం తదితర అంశాలపై పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌లు నివేదికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది.
నేడు ముంబైకి సీఎం
సీఎం రేవంత్‌రెడ్డి ముంబైకి వెళ్లారు. బుధవారం అక్కడ జరిగే ముంబై క్‌లైమేట్ వీక్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తర్వాత ముంబైలోనే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన సతీమణి గీత.. మాతృమూర్తిని పరామర్శించనున్నారు. సాయంత్రం ఢిల్లీ వెళతారు. గురువారం ఏఐ ఎక్స్‌పో కార్యక్రమంలో పాల్గొంటారు. ఏఐసీసీ నిర్వహించే సమావేశానికి హాజరవుతారు. గురువారం రాత్రికి లేదా శుక్రవారం ఉదయానికి సీఎం హైదరాబాద్‌కు తిరిగి వస్తారని సీఎంవో వర్గాలు తెలిపాయి.
ముఖ్యమంత్రికి అభినందనలు
మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డికి పలువురు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు. మంగళవారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి, మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, తూడి మేఘారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డిలు ముఖ్యమంత్రిని కలిసారు. జనగామ మున్సిపల్ ఎన్నికల్లో విజయం నేపథ్యంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, వీర్ల శంకరయ్య, కాలె యాదయ్య, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌లు కూడా సీఎంను కలిసి అభినందనలు తెలిపారు. రేవంత్ కూడా పార్టీ నేతలను అభినందించారు.


