ఏఐ ఇండియా సదస్సుకు దూరంగా బిల్ గేట్స్..?.. ప్యానలిస్టుల జాబితా నుంచి పేరు తొలగింపు?
ఇప్పటికే సమాచారం ఇచ్చారంటున్న జాతీయ మీడియా చానళ్లు
బిల్‌గేట్స్ పర్యటనపై వెల్లువెత్తుతున్న ఆగ్రహావేశాలతో కేంద్రం నిర్ణయం!
ఏపీలో చంద్రబాబు సర్కారు ఏకపక్ష నిర్ణయాలపై ఆరా.. నిఘా వర్గాల నుంచి సమాచారం
ఎప్‌స్టీన్ ఫైల్స్‌తో బిల్ బాగోతం బట్టబయలు.. బిల్ గేట్స్‌ను దూరం పెట్టిన యావత్ ప్రపంచం
విశిష్ట అతిథిగా అమరావతికి పిలిచి చంద్రబాబు సర్కారు రాచ మర్యాదలు
ఆయన్ను మహిళా రైతులతో మాట్లాడించడం విభ్రాంతికరమని తీవ్రంగా మండిపడ్డ జాతీయ మీడియా
సీఎం చంద్రబాబు, లోకేశ్ తీరుపై సర్వత్రా ఆగ్రహావేశాలు
సాక్షి, అమరావతి: తీవ్రమైన లైంగిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావడం... సీఎం చంద్రబాబు, లోకేశ్ తీరును జాతీయ మీడియా పెద్ద ఎత్తున ఎండగట్టడం.. మహిళలు మండిపడుతుండటంతో ఢిల్లీలో నిర్వహిస్తున్న ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇండియా’ సదస్సుకు బిల్‌గేట్స్‌ను దూరంగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తొలుత నిర్ణయించిన ప్రకారం ఈ సదస్సులో బిల్‌గేట్స్ గురువారం పాల్గొని ప్రసంగించాల్సి ఉంది. సదస్సు ప్యానలిస్టులు జాబితాలో ఆయన పేరుంది. అయితే లైంగిక వేధింపులకు పాల్పడ్డ బిల్‌గేట్స్‌కు చంద్రబాబు ప్రభుత్వం విశిష్ట అతిథిగా రాచ మర్యాదలు చేయడం.. అమరావతిలో మహిళల వద్దకు తీసుకెళ్లి మాట్లాడించడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ మీడియా దీన్ని తీవ్రంగా తప్పుబడుతూ చర్చలు నిర్వహించింది. లైంగిక నేరాలను చంద్రబాబు ప్రభుత్వం ఆమోదిస్తోందా? అని సూటిగా నిలదీసింది.
ఎన్‌డీటీవీ లాంటి ప్రముఖ జాతీయ చానల్ మంగళవారం దీనిపై ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. ఇక జాతీయస్థాయిలో ప్రముఖ మహిళా నేతలు, పాత్రికేయులు చంద్రబాబుపై మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మీయ బంధువుగా బిల్‌గేట్స్‌ను ఆలింగనం చేసుకోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. చంద్రబాబు సర్కారు తీరును పలువురు పార్లమెంట్ సభ్యులు సైతం తీవ్రంగా తప్పుబట్టారు.
దీంతో చంద్రబాబు సర్కారు ఏకపక్ష నిర్ణయంపై ఆరా తీసిన కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఏఐ ఇండియా సదస్సు ప్యానలిస్టుల జాబితా నుంచి బిల్ గేట్స్ పేరు తొలగించాలని సదస్సు నిర్వాహకులను తాజాగా ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆ సదస్సుకు దూరంగా ఉండాలని బిల్ గేట్స్‌కు సమాచారం కూడా ఇచ్చారని జాతీయ మీడియా చానళ్లు వెల్లడించాయి.
బాబు బృందం ఘన స్వాగతం..
బిల్ గేట్స్.. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ స్థాపకుడు! ఇది నాణానికి ఓవైపు మాత్రమే. మరి రెండో వైపు..? తీవ్రమైన లైంగిక నేరాలు... అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక వేధింపులు.. ఎప్‌స్టీన్ ఫైల్స్ సాక్షిగా బట్టబయలయ్యాయి! అందుకే బిల్ గేట్స్ అంటేనే యావత్ ప్రపంచం దూరం పెడుతోంది. కానీ అంతటి దారుణాలకు పాల్పడ్డ వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత ఆత్మీయుడయ్యారు.
సహచర మంత్రులతో కలసి విమానాశ్రయంలో ఆయనకు లోకేశ్ ఘన స్వాగతం పలికారు. ఇక చంద్రబాబు బిల్ గేట్స్‌ను ఆతీ్మయంగా ఆలింగనం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా రాచ మర్యాదలు చేయడంతో యావత్ దేశం విస్తుపోయింది. జాతీయ మీడియా తీవ్రంగా మండిపడింది.
ఎప్‌స్టీన్ ఫైల్స్‌తో బాగోతం బట్టబయలు
అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్న ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బిల్‌గేట్స్ పేరు అత్యంత ప్రముఖంగా బయటపడింది. అభం శుభం తెలియని చిన్నారులను తమ వికృత లైంగిక కార్యకలాపాలకు వాడుకున్నారని వెలుగులోకి వచి్చంది. బిల్ గేట్స్‌కు ఆయన భార్య మెలిందా గేట్స్ కొంతకాలం క్రితం విడాకులు కూడా ఇచ్చారు. ఆయన అక్రమ, అనైతిక లైంగిక కార్యకలాపాలను భరించలేక ఆమె విడాకులు ఇచ్చారు.
కాగా ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బిల్ గేట్స్ పేరు బయటపడటంతో యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. ఎప్‌స్టీన్ ఫైల్స్ బాగోతంపై ఓటీటీ చానల్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రత్యేక సీరీస్ కూడా చిత్రీకరించారు. దాంతో బిల్‌గేట్స్ తదితరులు ఎంతటి తీవ్ర లైంగిక నేరాలకు పాల్పడ్డారన్నది తెలుసుకుని యావత్ ప్రపంచం కంపించిపోయింది.
బాబు సర్కారు తీరుపై కేంద్రం ఆరా
వివాదాస్పద బిల్ గేట్స్‌కు చంద్రబాబు ప్రభుత్వం అతిథి మర్యాదలు చేయడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విదేశీ ప్రతినిధులు, విదేశీ కార్పొరేట్ ప్రతినిధులను అతిథులుగా ఆహ్వానించే ముందు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం సంప్రదాయం. ఇక వివాదాస్పద వ్యక్తులను పిలవాలంటే కచ్చితంగా అనుమతి తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారంగా తీసుకునే నిర్ణయాలు జాతీయ విధానాలు, దేశ ప్రతిష్టకు భంగకరంగా ఉండకూడదు.
చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. కనీసం కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా లేకుండా వివాదాస్పద బిల్ గేట్స్‌కు అతిథి మర్యాదలు చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆరా తీసింది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కేంద్ర నిఘా వర్గాలు నివేదిక పంపినట్లు సమాచారం. అయితే బిల్ గేట్స్ ఏఐ ఇండియా సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారని బిల్‌గేట్స్ ఫౌండేషన్ ఓ ప్రకటనలో పేర్కొనడం గమనార్హం.
బాలికలు, మహిళలను అవమానించడమే..!
తీవ్రమైన లైంగిక నేరాలకు పాల్పడ్డ బిల్ గేట్స్‌ను యావత్ ప్రపంచం దూరం పెట్టింది. ఒకప్పుడు బిల్ గేట్స్‌ను ముఖ్య అతిథిగా పిలిచేందుకు పోటీపడ్డ ప్రపంచ దేశాధినేతలు, కార్పొరేట్ ప్రముఖులు ప్రస్తుతం ఆయన పేరు పలికేందుకు కూడా ఇష్టపడటం లేదు. ఇక ఆయనతో వేదిక పంచుకునేదే లేదని తేల్చిచెప్పారు. అలాంటి బిల్ గేట్స్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పనిగట్టుకుని పిలిచి మరీ రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా రాచ మర్యాదలు చేశారు. చంద్రబాబు తీరుపై దేశంలోనే కాదు.. అంతర్జాతీయంగా కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మంత్రి లోకేశ్‌తోపాటు పలువురు మంత్రులు బిల్ గేట్స్‌కు గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలకడం... ముఖ్యమంత్రి చంద్రబాబు తన అధికారిక నివాసం వద్ద ఎదురొచ్చి మరీ ఆయన్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు పరిచయం చేయడం తదితర దృశ్యాలు చూసి యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన బిల్ గేట్స్‌కు హోంమంత్రి వంగలపూడి అనిత విమానాశ్రయంలో సాదర స్వాగతం పలకడం... ఆయన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలోని వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి మహిళా రైతులతో మాట్లాడించడం విభ్రాంతికరమని పేర్కొంటున్నారు.
ఇక బిల్ గేట్స్, చంద్రబాబు అనుబంధాన్ని కీర్తిస్తూ టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు పోస్టు చేయడం విస్మయపరిచింది. బిల్ గేట్స్ రాష్ట్రానికి రావడం గర్వకారణమని చంద్రబాబు, లోకేశ్‌లు బహిరంగంగా ప్రకటించడం, వీటిని తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెట్టడం దిగజారుడుతనమేనని... బాలికలు, మహిళలను అవమానించడమేనని మండిపడుతున్నారు. బిల్‌గేట్స్‌తో చంద్రబాబు భేటీని ఆహా ఓహో.. అంటూ టీడీపీ అనుకూల పచ్చ మీడియా ఆకాశానికి ఎత్తే యత్నం చేసింది. కానీ జాతీయ మీడియా, సోషల్ మీడియా మాత్రం చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది.
లైంగిక నేరాలను చంద్రబాబు ప్రభుత్వం ఆమోదిస్తోందా?
లైంగిక నేరాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తోందా..? తీవ్రమైన లైంగిక నేరాలకు పాల్పడ్డ బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన ఫొటోలు చూసి చాలా బాధపడ్డా. ఆయనకు చంద్రబాబు, లోకేశ్ ఎలా స్వాగతం పలికారు? బిల్ గేట్స్ గురించి ఆయన సతీమణి చేసిన వ్యాఖ్యలను నారా లోకేశ్ ఒకసారి పరిశీలించి ఉంటే బాగుండేది.– ప్రియాంకా చతుర్వేది, ఎంపీ, శివసేన


