ఉద్యోగ విరమణ వయసుపై వివక్ష ఎందుకు? | High Court questions state government on retirement age | Sakshi
Sakshi News home page

ఉద్యోగ విరమణ వయసుపై వివక్ష ఎందుకు?

Feb 18 2026 5:54 AM | Updated on Feb 18 2026 5:54 AM

High Court questions state government on retirement age

రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు  

సాక్షి, అమరావతి: వ్యవసాయశాఖ పరిధిలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీ, శ్రీవేంకటేశ్వర వెటర్నరీ, ఏపీ ఫిషరీస్, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ వర్సిటీల్లో పనిచేస్తూ యూజీసీ వేతనాలు పొందుతున్న ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపు విషయంలో ప్రభుత్వ వివక్షను హైకోర్టు ప్రశ్నించింది. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 సంవత్సరాలకు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ వర్సిటీల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును మాత్రం పెంచకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఎందుకు ఇలా వివక్ష చూపుతున్నారని ప్రశ్నించింది.

 ఉన్నత విద్యాశాఖ పరిధిలోని వర్సిటీల ప్రొఫెసర్లకు ఓ న్యాయం, మిగిలిన వర్సిటీల ప్రొఫెసర్లకు ఓ న్యాయమా? అంటూ నిలదీసింది. ఐఏఎస్‌ అధికారులకు పదవీ విరమణ చేసిన తరువాత కూడా పొడిగింపులు ఇస్తున్న ప్రభుత్వం.. అన్ని అర్హతలు ఉండి, యూజీసీ స్కేల్‌ తీసుకున్న ప్రొఫెసర్లకు మాత్రం పదవీ విరమణ వయసును ఎందుకు పెంచదని గట్టిగా ప్రశ్నించింది. పదవీ విరమణ వయస్సు పెంచాలని ఉద్యాన తదితర వర్సిటీలు సిఫార్సు చేస్తే, అలాంటి సిఫార్సులు ఏవీ రాలేదని ప్రభుత్వం చెప్పడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. 

అలాగే ఆర్థికశాఖ సైతం పదవీ విరమణ వయసు పెంపునకు అంగీకరించడం లేదని చెప్పడాన్ని కూడా ఆక్షేపించింది. కోర్టుకు తప్పుడు సమాచారం ఇవ్వొద్దంది. పదవీ విరమణ వయసు పెంపు విషయంలో వర్సిటీల సిఫార్సులను ఎందుకు తిరస్కరించారో, దీనివెనుక ఉన్న హేతుబద్ధత ఏమిటో స్వయంగా తమముందు హాజరై చెప్పాలని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ను ఆదేశించింది. విచారణను ఈ నెల 23కి వాయిదా వేస్తూ.. న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్, జస్టిస్‌ మండవ కిరణ్మయి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.

సింగిల్‌ జడ్జి తీర్పుపై అప్పీళ్లు..
ఉన్నత విద్యాశాఖ నియంత్రణలోని వర్సిటీల్లో బోధన సిబ్బంది పదవీ విరమణ వయసును పెంచిన ప్రభుత్వం వ్యవసాయశాఖ పరిధిలోని వర్సిటీల్లో పనిచేస్తున్న తమ పదవీ విరమణ వయసు పెంచలేదని డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన, శ్రీవేంకటేశ్వర వెటర్నరీ, ఏపీ ఫిషరీస్, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ వర్సిటీల్లో పనిచేస్తున్న పలువురు ప్రొఫెసర్లు, డీన్లు, శాఖాధిపతులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి ఆ పిటిషన్లను కొట్టేశారు. పదవీ విరమణ వయసు పెంపు విధానపరమైన నిర్ణయమని పేర్కొన్నారు. 

వ్యవసాయ శాఖ నియంత్రణలో పనిచేస్తున్న వర్సిటీల బోధన సిబ్బంది పదవీ విరమణ వయసు పెంపు విషయంలో నాలుగునెలల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తమ పిటిషన్లను కొట్టేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పిటిషనర్లు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరుపుతున్న ధర్మాసనం తాజాగా సోమవారం మరోసారి విచారించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement