చినబాబు అమరావతి – కొలంబో – ఢిల్లీ యాత్రకు రూ.కోటిపైనే ఖర్చు
ఆ ఖర్చులు అంతా ఎవరు భరిస్తున్నారు?.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా లోకేశ్ మెరుపు పర్యటనలు
సాక్షి, అమరావతి: సామాన్యులు ఎర్రబస్సు ఎక్కిన మాదిరిగా చంద్రబాబు కుటుంబం ప్రత్యేక విమానాలను వినియోగించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. తాజాగా పాకిస్థాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ తిలకించేందుకు మంత్రి నారా లోకేశ్ బృందం ప్రత్యేక జెట్ విమానంలో శ్రీలంక వెళ్లి రావడం హాట్ టాపిక్‌గా మారింది. ఉదయం అమరావతిలో ఉన్న లోకేశ్ సాయంత్రం కొలంబోలో ప్రత్యక్షమయ్యారు.
మర్నాడు ఉదయం తిరిగి అమరావతి చేరుకుని బిల్‌గేట్స్‌తో ఫోటోలు దిగడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఇక ఈ కార్యక్రమం పూర్తి కావడమే ఆలస్యం.. లోకేశ్ తిరిగి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిపోయారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. క్రికెట్ మ్యాచ్ కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రత్యేక విమానాల్లో చక్కర్లు కొట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ప్రత్యేక విమానాల వ్యయం ఎవరు భరిస్తున్నారన్నది కీలకంగా మారింది. ఈ ఖర్చుల వివరాలను అధికారికంగా వెల్లడించడం లేదు. ఒకపక్కన రాష్ట్రాన్ని అప్పులతో ముంచెత్తుతూ మరోపక్క విహార యాత్రల్లో గడపడంపై విస్తుపోతున్నారు.

సమస్యలు గాలికి వదిలేసి...!
ప్రస్తుతం మిడ్ సైజ్ ప్రైవేట్ జెట్ విమానం అద్దె గంటకు రూ.3.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఉంది. దీనికి తోడు అంతర్జాతీయ ప్రయాణం కాబట్టి ల్యాండింగ్ చార్జీలు, గ్రౌండ్ హ్యాండ్లింగ్, విదేశీ ఎయిర్ పోర్ట్ ట్యాక్స్‌లు అన్నీ కలిపి మరో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటాయి. వెరసి తాజాగా లోకేశ్ యాత్రలకు అయిన ఖర్చు అక్షరాలా రూ.కోటి పైమాటే అని వైమానిక వర్గాలు చెబుతున్నాయి.
ముఖ్యమంత్రి తనయుడు సాధారణ బైక్ రైడ్‌లా విమానాలను వాడుకోవటంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్నికల హామీలు, నిరుద్యోగ సమస్యలను పట్టించుకోకుండా విదేశాల్లో మ్యాచ్‌లు చూడటానికి ఇంత సమయం, డబ్బులు వెచ్చించడం సబబేనా? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఇది వ్యక్తిగత పర్యటన అయితే అధికారిక హోదాను ఉపయోగించి పొందే ప్రోటోకాల్ సౌకర్యాల ఖర్చును ఎవరు చెల్లిస్తున్నారన్నది ముఖ్యం.


