విజయవాడ ధర్నా చౌక్‌లో నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు
బాబు సర్కారుపై గర్జించిన ఉపాధ్యాయులు
రాష్ట్ర నడిబొడ్డున ఉపాధ్యాయులు కదంతొక్కారు. చంద్రబాబు సర్కారు
దుర్నీతిపై కన్నెర్రచేశారు. ఎన్నికల హామీలపై తక్షణం తేల్చాలని రణభేరి
మోగించారు. రగిలిన గుండెలతో గర్జించారు. దుష్ట పన్నాగాలతో కాలం
గడిపితే పతనం తప్పదు ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.
గాందీనగర్(విజయవాడసెంట్రల్): ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఎన్నికల వరకు సాగదీసేందుకు యత్నిస్తే సర్కారు పతనం తప్పదని ఉపాధ్యాయులు హెచ్చరించారు. 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్‌ను తక్షణం నియమించాలని, ఐఆర్ 29 శాతం ప్రకటించాలని, నాలుగు డీఏలు, ఆర్థిక బకాయిలు చెల్లించాలని కోరుతూ ఉపాధ్యాయులు మంగళవారం చలో విజయవాడ చేపట్టారు. అన్ని జిల్లాల నుంచి ఉపాధ్యాయులు భారీగా తరలివచ్చారు. ధర్నా చౌక్‌లో రణభేరి సభ నిర్వహించారు.
ఫలితంగా ధర్నా చౌక్ ఎరుపెక్కింది. రణన్నినాదాలతో దద్దరిల్లింది. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని ఉపాధ్యాయులు హెచ్చరించారు. రణభేరిలో పాల్గొన్న ఉపాధ్యాయ సంఘ నేతలు మాట్లాడుతూ చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే సకాలంలో డీఏలు, మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని, బకాయిలు చెల్లిస్తామని హామీలు గుప్పించారని, అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తి కావస్తున్నా ఇంతవరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీఆర్సీ, ఐఆర్, డీఏల కోసం సీఎం చంద్రబాబుకు లక్ష ఉత్తరాలు రాశామని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు ఇచ్చామని, కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. బడ్జెట్లోనూ పీఆర్సీ, డీఏ బకాయిలపై కనీసం ప్రస్తావించలేదని మండిపడ్డారు. ఇప్పటికైðనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పీఆర్సీ కమిషన్ చైర్మన్‌ను నియమించాలని, లేకుంటే చలో సెక్రటేరియేట్ కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు పోరాటాలు చేస్తే తట్టుకునే శక్తి ఈ ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు.
శాసనమండలి, శాసన సభలలో టీటీడీ లడ్డూ నెయ్యిపై ప్రతిపక్షంపై అవాకులుచెవాకులు పేలడం తప్పితే ప్రజల, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై సర్కారు చర్చించడం లేదని విమర్శించారు. పీఆర్సీ జాప్యం జరిగే కాలానికి ఐఆర్ 29 శాతం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ వి.వెంకటేశ్వరరావు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నక్కా వెంకటేశ్వర్లు, కేఎస్‌ఎస్ ప్రసాద్, ఏపీజేఏసీ చైర్మన్ ఎ.విద్యాసాగర్, సీఐటీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎ.వి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


