బడ్జెట్‌లో అరకొర కేటాయింపులతో రైతులకు చంద్రబాబు పంగనామాలు
ఉచిత పంటల బీమా అటకెక్కించేసి కొత్త బీమా నాటకాలు
గత బడ్జెట్‌లో రూ.1,023 కోట్లు కేటాయించినా పైసా ఖర్చు చేయని వైనం
ఈ ఏడాది రూ.250 కోట్లతో సరిపెడుతూ మరో మోసం
రూ.లక్ష కోట్లతో హార్టికల్చర్ హబ్ అని గొప్పగా ప్రకటన
ఉద్యాన శాఖకు కేటాయించింది కేవలం రూ.1,123 కోట్లే
ఆక్వా రైతులందరికీ రూ.1.50కే విద్యుత్ ఇచ్చేస్తున్నామని అబద్ధాలు
గ్రోత్ ఇంజన్లంటూనే పశు సంవర్థక, మత్స్య శాఖలపై చిన్నచూపు
కేంద్రం ఇచ్చేది కాకుండా రూ.20 వేలిస్తామన్న ‘సుఖీభవ’
హామీ ఏమైంది?.. ఏ పంటకైనా గిట్టుబాటు ధర ఉందా?
ధరల స్థిరీకరణ నిధికి రూ.500 కోట్లేనా?
కనీసం యూరియా అందించలేని అన్యాయమైన పాలన
వరుసగా మూడో బడ్జెట్‌లోనూ అన్నదాతకు మొండిచెయ్యే
సాక్షి, అమరావతి: పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి. ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు. కనీసం అన్నదాతకు యూరియా అందించలేని అన్యాయమైన పాలన ఇది. ఉచిత పంటల బీమా అటకెక్కింది.. ఇన్‌పుట్ సబ్సిడీ ఊసేలేదు.. సున్నా వడ్డీకి సున్నా చుట్టింది. మొత్తంగా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిన చంద్రబాబు సర్కార్ ఈ మూడో బడ్జెట్‌లోనూ రైతుకు మొండిచెయ్యి చూపింది. రాష్ట్రంలో గత 20 నెలలుగా అన్ని విధాలుగా నష్టపోయి తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న రైతులను ఆదుకునే దిశగా వ్యవసాయ రంగంలో తగిన కేటాయింపులు జరపడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది.
అరకొర కేటాయింపులతో రైతులకు పంగనామాలు పెట్టింది. 3.32 లక్షల కోట్ల బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.12,152 కోట్లు, అనుబంధ శాఖలకు రూ.3,589 కోట్లు మాత్రమే కేటాయింపులు జరిపారు. అంటే మొత్తం బడ్జెట్‌లో 4.74 శాతానికి మించలేదు. పైగా అసెంబ్లీ సాక్షిగా గతేడాది 46.86 లక్షల మంది రైతులకు రూ.6,309 కోట్ల పెట్టుబడి సాయం అందజేశామని.. జోన్, నాన్ జోన్‌తో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ యూనిట్ రూ.1.50 చొప్పున విద్యుత్ సరఫరా చేస్తున్నామంటూ పచ్చి అబద్ధాలు చెప్పు కొచ్చారు. మరో వైపు కొత్తగా రూ.లక్ష కోట్లతో రాయలసీమ, ప్రకాశం జిల్లాలను హార్టికల్చర్ హబ్‌గా తీర్చి దిద్దుతున్నామని, ఇందులో రూ.30 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెబుతూ.. ఉద్యాన శాఖకు మాత్రం రూ.1,123.86 కోట్లకు మించి కేటాయింపులు జరపక పోవడం విస్మయానికి గురి చేస్తోంది.
పంటల బీమాకు మంగళం పాడేందుకే
ఐదేళ్ల పాటు రైతులపై పైసా భారం పడకుండా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని అటకెక్కించేసిన చంద్రబాబు ప్రభుత్వం.. స్వచ్ఛంద నమోదు బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. 2024–25 బడ్జెట్‌లో పైసా కేటాయించలేదు. 2025–26లో రూ.1,023 కోట్లు కేటాయించినా పైసా ఖర్చు చేయలేదు. రెండేళ్లుగా ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన రూ.2,419.44 కోట్ల ప్రీమియం ఎగ్గొట్టడంతో ప్రస్తుత రబీ సీజన్ నుంచి కంపెనీలు ఏపీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టేశాయి. ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతులకు రావాల్సిన రూ.3,500 కోట్లకుపైగా బీమా పరిహారం అందకుండా పోయింది. దీంతో ఈ ఏడాది ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తారని రైతులు ఆశపడ్డారు. కనీసం ఈ ప్రీమియం బకాయిలతో పాటు రానున్న వ్యవసాయ సీజన్‌కు తగిన నిధులు కేటాయిస్తారని భావించారు. కానీ ఇందుకు విరుద్ధంగా ఈ పథకానికి కేటాయింపులు గతేడాదితో పోలిస్తే నాలుగో వంతుకు తగ్గించి, రూ.250 కోట్లతో సరిపెట్టారు. గతేడాది అరటి, మిరప, పొగాకు బొప్పాయి, మామిడి, చీనీ, టమాట, ఉల్లి వంటి పంటలకు గిట్టుబాటు ధర దక్కలేదు. అయినప్పటికీ మార్కెట్‌లో జోక్యం చేసుకొని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి ఆదుకున్న దాఖలాలు లేవు.
ఈ హామీలన్నీ అటకెక్కినట్టేనా?
⇒ రాయితీపై సోలార్ పంప్ సెట్ల ఏర్పాటు మాటేంటి?
⇒ గుర్తింపు కార్డులు అందజేసిన కౌలు రైతులకు అన్ని సంక్షేమ పథకాలు ఎప్పుడు అందిస్తారు?
⇒ రైతు కూలీలకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు.. తద్వారా వారికి రాయితీలు, సంక్షేమ పథకాలు ఎప్పుడిస్తారు?
⇒ దళారుల దోపిడీని అరికట్టడానికి ఏపీఎంసీ యాక్టును పటిష్టంగా ఎప్పుడు అమలు చేస్తారు?
⇒ పాడి రైతులకు పశుగ్రాసం సాగు కోసం బంజరు భూములు కేటాయింపు ఎంత వరకొచ్చింది?
⇒ పశువుల కొనుగోళ్లు, దాణా, మందుల కొనుగోళ్లపై సబ్సిడీలు ఏమయ్యాయి?
⇒ పశువులకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఎప్పుడు కల్పిస్తారు?
⇒ ఆక్వా రైతులకు జోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా అందరికీ యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరా సంగతేంటి?
⇒ వీటిలో ఏ ఒక్క హామీ అమలు కోసం ఈ బడ్జెట్‌లో ఒక్క రూపాయి అయినా కేటాయించారా?
ధరల స్థిరీకరణ నిధికి రూ.500 కోట్లేనా?
‘ధరల స్థిరీకరణ నిధి కింద గతేడాది రూ.300 కోట్లు కేటాయించాం. ఈ ఏడాది దాన్ని రూ.500 కోట్లకు పెంచాం’ అని ప్రభుత్వం గొప్పగా చెప్పుకోవడం రైతులను ఆగ్రహానికి గురిచేస్తోంది. మరోవైపు నాన్ సబ్సిడీ విత్తనాలకు మంగళం పాడేశారు. సబ్సిడీ విత్తనానికి కోత పెట్టారు. గతేడాది రూ.182 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పిన ప్రభుత్వం ఈ ఏడాది రూ.240 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పుకొచ్చింది. వాస్తవానికి మార్కెట్‌లో విత్తన ధరలు భారీగా పెరిగాయి. ఈ కేటాయింపులు ఏమాత్రం సరిపోవని రైతులు చెబుతున్నారు. రెండేళ్లుగా సున్నా వడ్డీ రాయితీ పథకం కింద పైసా చెల్లించలేదు. ఈ ఏడాది రూ.250 కోట్లు కేటాయించడం పట్ల రైతులు మండిపడుతున్నారు.
రెండేళ్లుగా కట్ట యూరియా కోసం రైతులు ఏవిధంగా ఇబ్బందుల పాలయ్యారో అందరూ ప్రత్యక్షంగా చూశారు. బఫర్ స్టాక్ కోసం రూ.200 కోట్లు ఖర్చు చేస్తామంటూ గొప్పగా ప్రకటించిన ప్రభుత్వం బడ్జెట్‌లో మాత్రం కేవలం రూ.40 కోట్లకు పరిమితం చేసింది. 20 నెలల్లో ప్రకృతి వైపరీత్యాల్లో దెబ్బతిన్న రైతులకు రూ.1,100 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలుండగా, ఆ ఊసెత్తకుండా రూ.310 కోట్ల పెట్టుబడి రాయితీ ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరం. పట్టు, మార్కెటింగ్, పశు సంవర్థక, మత్స్య శాఖల కేటాయింపులు పూర్తిగా సిబ్బంది జీత భత్యాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సరిపడా తప్ప కొత్తగా ఒక్క పథకాన్ని ప్రకటించలేదు. ఒక్క రూపాయి అదనంగా కేటాయింపులు జరపలేదు.


