కమీషన్ల కోసం కుమ్ములాట! | TDP leaders Demanding Commission from contractors in AP medical department | Sakshi
Sakshi News home page

కమీషన్ల కోసం కుమ్ములాట!

Feb 17 2026 4:42 AM | Updated on Feb 17 2026 8:38 AM

TDP leaders Demanding Commission from contractors in AP medical department

వైద్యశాఖను ఆదాయ వనరుగా మార్చుకున్న ప్రభుత్వ పెద్దలు 

కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల వ్యవహారంలో ఓ అమాత్యుడు, నామినేటెడ్‌ నేత మధ్య వార్‌ 

మేం చెప్పిందే వేదం.. నామినేటెడ్‌ నేత డమ్మీ.. అంటూ అమాత్యుడి వర్గం ప్రచారం 

అమాత్యుడి వర్గీయులు ఏపీఎం ఎస్‌ఐడీసీ వైపు వస్తే కొట్టిస్తానని నామినేటెడ్‌ నేత హెచ్చరిక

సాక్షి, అమరావతి: వైద్యశాఖలో కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకునే వ్యవహారంలో అధికార కూటమికి చెందిన ఇద్దరు నేతల మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఏపీ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ)­లో తాము చెప్పిందే ఫైనల్‌ అంటూ ఓ అ­మాత్యుడి వర్గం ప్రచారం చేస్తోంది. దీని­పై ఓ నామినేటెడ్‌ పదవి పొందిన నేత రగిలిపోతున్నారని సమాచారం. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన వైద్యశాఖను ముఖ్య నేతలు ఆదాయ వనరుగా మార్చేసుకున్నా­రు.

ఈ శాఖలోని రూ.వేల కోట్ల కాంట్రాక్టును అడ్డదారుల్లో అస్మదీయ సంస్థకు ప్రభు­త్వ పెద్దలు కట్టబెట్టేశారు. మరోవైపు మందులు, సర్జికల్స్, వైద్య పరికరాలు కొనుగో­ళ్లు, సెక్యూరిటీ, శానిటేషన్, ఇతర సేవల్లో­నూ కమీషన్లు దండుకోవ­డమే పనిగా పెట్టుకున్నారు. వీరి దోపి­డీకి ఏపీఎంఎస్‌ఐడీసీ కేంద్రంగా మారింది. మందు­లు, సర్జి­కల్స్, వైద్య పరికరా­ల కొనుగోళ్లు, సెక్యూ­రిటీ, శా­ని­టేషన్, ఇతర సేవల క­ల్ప­న­లో కాంట్రాక్టర్ల నుంచి అమాత్యుడు ప్రత్యేక ట్యాక్స్‌ వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన్ను కలిసి వస్తేనే కాంట్రాక్ట్, బిల్లులు, పర్చేజ్‌ ఆర్డర్‌(పీవో) ఇస్తామని కాంట్రాక్టర్ల­కు అధికారులే బాహాటంగా చె­బు­తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.   

మనుషులతో కొట్టిస్తా..! 
వైద్యశాఖలో అక్రమ వసూళ్ల కోసం అమాత్యుడు ప్రైవేట్‌ సైన్యాన్ని మోహరించారు. వీరిని కలిసి డీల్‌ కుదుర్చుకున్న వారికే కాంట్రాక్టులు అన్నట్టుగా పరిస్థితిని మార్చేశారు. ఏకంగా టెండర్లలోనే అవకతవకలకు పాల్పడి, తమను ప్రసన్నం చేసుకోని సంస్థలను ముప్పు­తిప్పలు పెట్టి, వాటికి కాంట్రాక్ట్‌ దక్కకుండా చేస్తున్నారు. మరోవైపు నామినేటెడ్‌ నేత సైతం కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఒకవైపు అధికార యంత్రాంగం, మరోవైపు అమాత్యుడు, ఇంకోవైపు నామినేటెడ్‌ నేత కమీషన్ల కోసం ఇబ్బందులు పెడుతుండటంతో విసిగిపోయిన కాంట్రాక్టర్లు... ఇంతమందికి కమీష­న్లు ఇవ్వడం మా వల్ల కాదంటూ తేల్చి చెప్పేశారని తెలిసింది.

దీంతో తాము చెప్పిందే ఫైనల్‌... నామినేటెడ్‌ నేత డమ్మీ... అంటూ అమాత్యుడి వర్గీయులు కాంట్రాక్టర్లకు సూచించినట్టు విశ్వసనీయ సమాచారం. దీనికి తగ్గట్టుగానే ఏపీఎంఎస్‌ఐడీసీలో అమాత్యుడికి కమీ­షన్‌ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్న ఓ కీలక అధికారి సదరు నామినేటెడ్‌ నేత చెప్పిన సిఫార్సులను కనీసం పరిగణనలోకి తీసుకోవడం మానేశారని తెలిసింది.

ఏపీఎంఎస్‌ఐడీసీలో తాను చెప్పిందేదీ జరగకపోవడం, అమాత్యుడి వర్గీయులు డమ్మీ అంటూ ప్రచారం చేయడాన్ని నామినేటెడ్‌ నేత సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. అమాత్యుడి వర్గీయులు కార్పొరేషన్‌ వైపు వస్తే తన మనుషులతో కొట్టిస్తానని ఆయన హెచ్చరించినట్టు తెలిసింది. పేదలకు నాణ్యమైన వైద్యసేవల కల్పనలో కీలకమైన ఏపీఎంఎస్‌ఐడీసీలో కమీషన్ల కోసం ఇద్దరు నేతలు జగడాలకు దిగుతుండటం ఇదే తొలిసారని వైద్యవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇలాంటి దుస్థితి గతంలో ఎన్నడూ చూడలేదని పలువురు వైద్యులు, అధికారులు అభిప్రాయపడుతున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement