తుని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న వీఆర్వోలు
ప్రభుత్వంపై ఉద్యోగుల తిరుగుబాటు
స్పందించకపోతే మార్చి ఒకటో తేదీ నుంచి పెన్‌డౌన్
ఉమ్మడి ‘తూర్పు’న నిరసన జ్వాల
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పనిభారం పెంచేసి మానసిక ఒత్తిళ్లకు గురిచేస్తున్న చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ప్రభుత్వ ఉద్యోగులు సోమవారం నిరసన గళం వినిపించారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగారు. కరప, ఉప్పాడకొత్తపల్లి, తుని రూరల్, నిడదవోలు తదితర మండలాల్లో ధర్నాలు చేపట్టారు.
కొన్ని చోట్ల భోజన విరామ సమయంలో కార్యాలయాల వద్ద నిరసన తెలపగా, మరికొన్ని చోట్ల వీఆర్వోలు, సర్వేయర్లు, వీఆర్‌ఏలు నల్లబ్యాడ్జీలతో ధర్నాలు చేశారు. సర్వీసు రూల్స్‌కు విరుద్ధంగా ఇష్టమొచ్చినట్టు పనులు అప్పగించి తీవ్రమైన మానసిక ఒత్తిళ్లకు గురిచేస్తుండటంతో ఉద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ శాఖ పరిధిలో పనిచేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.
వీఆర్వో, వీఆర్‌ఏ, సర్వేయర్‌లు ఇలా అందరినీ డీడీవో పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌లు పరిష్కరించకుంటే మార్చి1 నుంచి పెన్‌డౌన్ చేపడతామని హెచ్చరించారు. ఉన్నతాధికారులకు తమ సమస్యలను తెలియజేసినా న్యాయం చేయకపోవడంతోనే రాష్ట్ర సంఘం నిర్ణయం మేరకు ఈ నెల 12న వర్క్ టు రూల్ అమలు చేస్తుంటే, కొంతమంది అధికారులు షోకాజ్ నోటీసులు ఇవ్వడం అన్యాయమన్నారు.


