హడ్కో రుణ వాయిదాల చెల్లింపునకు... మళ్లీ హడ్కో నుంచే అప్పు | Borrowing from HUDCO again to pay HUDCO loan installments | Sakshi
Sakshi News home page

హడ్కో రుణ వాయిదాల చెల్లింపునకు... మళ్లీ హడ్కో నుంచే అప్పు

Feb 18 2026 5:58 AM | Updated on Feb 18 2026 5:58 AM

Borrowing from HUDCO again to pay HUDCO loan installments

ప్రభుత్వ అప్పు.. రూ.3,28,225 కోట్లు

ఒక చేతితో అప్పు తీసుకుని.. మరో చేతితో తిరిగి అదే సంస్థకు చెల్లింపు

ఇదీ సీఎం చంద్రబాబు నాయుడు సర్కారు అప్పుల బాగోతం 

హడ్కో నుంచి ఏపీపీసీఎల్‌కు రూ.500 కోట్ల టెర్మ్‌ రుణం 

ఇందుకు లెటర్‌ ఆఫ్‌ కంఫర్ట్‌తోపాటు ప్రభుత్వ హామీ 

ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌ విజయానంద్‌ 

రూ.11,610 కోట్లకు చేరిన ఏపీపీసీఎల్‌ అప్పులు   

సాక్షి, అమరావతి: అప్పులు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం ఆరితేరిపోయింది. ఒక సంస్థ నుంచి తీసుకున్న అప్పు వాయిదాల చెల్లింపు కోసం మళ్లీ అదే సంస్థ వద్ద అప్పు చేస్తోంది. అంటే ఒక చేతితో అప్పు తీసుకుని... మరో చేతితో తిరిగి అదే సంస్థకు రుణ వాయిదాలను చెల్లిస్తోంది. హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హడ్కో) నుంచి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీపీసీఎల్‌) అప్పు చేసింది. ఆ అప్పునకు చంద్రబాబు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది.

 అయితే ఆ రుణ వాయిదాలను సకాలంలో చెల్లించేందుకు ఇప్పుడు మళ్లీ హడ్కో నుంచే ఏపీపీసీఎల్‌ రూ.500 కోట్లు టర్మ్‌ లోన్‌ తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) కె.విజయానంద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. లెటర్‌ ఆఫ్‌ కంఫర్ట్‌ను జారీ చేయడంతోపాటు రూ.500 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. 

హడ్కో రుణ వాయిదాలను సకాలంలో తిరిగి చెల్లించేలా చూసేందుకు హడ్కో నుంచి ఏపీపీసీఎల్‌ రూ.500 కోట్ల టెర్మ్‌ రుణానికి అనుమతించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తం రుణ వ్యవధి కాలానికి ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుందని, అసలు, వడ్డీకి గ్యారెంటీ వర్తింస్తుందని తెలిపారు. రుణం ఇచ్చిన సంస్థకు ఏపీపీసీఎల్‌ తిరిగి చెల్లించడంలో విఫలమైనప్పుడు ప్రభుత్వ గ్యారెంటీ అమల్లోకి వస్తుంది. 

గ్యారెంటీ ఇచ్చిన మొత్తంపై 2 శాతం గ్యారెంటీ కమీషన్‌ చెల్లించాలి. ఇప్పటికే హడ్కోతోపాటు వివిధ సంస్థలు, బ్యాంకుల నుంచి ఏపీపీసీఎల్‌ రూ.11,110 కోట్లు ప్రభుత్వ గ్యారెంటీతో అప్పులు చేసింది. ఇప్పుడు తీసుకునే రూ.500 కోట్ల రుణంతో కలిపి ఏపీపీసీఎల్‌ మొత్తం అప్పు రూ.11,610 కోట్లకు చేరింది.   

Advertisement
 
Advertisement
Advertisement