సినీ తారలు కూడా సాధారణ మనుషులే. వాళ్లకు బాధలు ఉంటాయి. అయితే ఆ బాధలను కప్పిపుచ్చుకుని స్క్రీన్ మీద అందాలతో, నవ్వులతో అభిమానులను అలరిస్తుంటారు. అందరిలాగే తారల జీవితాల్లోనూ ఎవరికీ తెలియని వేదనలు, విషాదాలు దాగి ఉంటాయి. అలాంటి హృదయవిదారక కథే నటి ప్రత్యూషది. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే ప్రేమ పోటుకు బలైపోయింది. ఈ విషాద ఘటన జరిగి రెండు దశాబ్దాలు దాటిన తర్వాత సుప్రీం కోర్టు నేడు(మంగళవారం) తన తుది తీర్పుని వెల్లడించింది. ఈ కేసులో హైకోర్టు విధించిన జైలుశిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేస్తూ.. నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.
అలా సినిమాల్లోకి..
ప్రత్యూష సొంతూరు భువనగిరి. ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉండేది. చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలని గోల్ పెట్టుకొని..ఆ దిశగా ప్రయత్నాలు చేసింది. అయితే ఇంటర్ చదువుతున్న సమయంలో ఆమెకు సిద్ధార్థరెడ్డితో పరిచయం ఏర్పడి.. అది కాస్త ప్రేమకు దారి తీసింది. ఇంటర్ అయిపోగానే ఆమె సినిమాల్లోకి వెళ్లగా.. సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. అప్పట్లో జరిగిన ‘మిస్ లవ్లీ స్మైల్’ పోటీలో ప్రత్యూష్ పాల్గొని.. విజయం సాధించింది. దీంతో ఆమెకు 1998లో ‘రాయుడు’ సినిమాలో నటించే చాన్స్ వచ్చింది. అది రిలీజ్ అయిన తర్వాత ప్రత్యూషకు వరుస అవకాశాలు వచ్చాయి. శ్రీరాములయ్య, సముద్రం, స్నేహమంటే ఇదేరా, కలుసుకోవాలని.. ఇలా నాలుగేళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళ్‌లో కలిసి 12 సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.
ఫిబ్రవరి 23న ఏం జరిగింది?
ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లిన తర్వాత కూడా సిద్ధార్ధ్‌తో స్నేహాన్ని కంటిన్యూ చేసింది. కొంతకాలం పాటు బాగానే ఉన్నా..తర్వాత విబేధాలు వచ్చాయి. 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం ఓ బ్యూటీ పార్లర్‌లో ప్రత్యూష, సిద్ధార్థ్ కలిశారు. అనంతరం ఇద్దరు కలిసి కారులో బయటకు వెళ్లి.. ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరూ కూల్‌డ్రింక్‌లో విషయం కలుపుకొని తాగారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఫిబ్రవరి 24న ప్రత్యూష మరణించగా.. సిద్ధార్థ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రేమికుల ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణను ముగించే సమయంలో కీలక విషయం బయటకు వచ్చింది.
ఆత్మహత్యా? హత్యా?
ప్రత్యూషది ఆత్మహత్య కాదని.. ఎవరో ఆమె గొంతు నులిమి చంపారని ఓ ఫోరెన్సిక్ నివేదిక బయటకు వచ్చింది. దీంతో నాటి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తు కోసం వైద్యుల బృందాన్ని నియమించింది. ఈ బృందం చేసిన విచారణలో ప్రత్యూషది ఆత్మహత్యేనని తేలింది. పురుగులమందు కారణంగానే ప్రత్యూష మరణించారని.. ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి వంటివి జరగలేదంటూ ఓ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీంతో ఆత్మహత్యకు ప్రేరేపించారన్న నేరం కింద సిద్ధార్థరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు అతడిని దోషిగా తేల్చి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో సిద్ధార్థ హైకోర్టును ఆశ్రయించగా.. ఆ శిక్షను మూడేళ్లకు కుదిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీన్ని కూడా సవాల్ చేస్తూ సిద్ధూ సుప్రీంకోర్టుకి వెళ్లాడు. అయితే సుప్రీంలో అతనికి ఎదురుదెబ్బ తగిలింది. పోలీసులకు లొంగిపోవాల్సిదేంటూ మంగళవారం సుప్రీకోర్టు తీర్పునిచ్చింది.


