నటి ప్రత్యూష మృతి కేసులో సిద్ధార్థ రెడ్డికి చుక్కెదురు | Supreme court final judgement on Actress Pratyusha | Sakshi
Sakshi News home page

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు

Feb 17 2026 10:51 AM | Updated on Feb 17 2026 12:10 PM

Supreme court final judgement on Actress Pratyusha

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఈ హత్య కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి వెంటనే పోలీసుల ముందు లొంగిపోవాలని న్యాయస్థానం పేర్కొంది.  బెయిల్‌ కోసం ఆయన వేసిన పిటీషన్‌ను కొట్టివేసింది.  ప్రత్యూష హత్య కేసులో సిద్దార్థ రెడ్డికి హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు  శిక్షను సుప్రీంకోర్టు  సమర్థించింది. 

ప్రత్యూష ఇంటర్మీడియట్ చదువుతుండగా సిద్ధార్థ్‌ రెడ్డి  అనే యువకుడితో ప్రేమలో పడింది. అయితే, ప్రత్యూష హీరోయిన్‌గా రాణిస్తున్నప్పడు సిద్ధార్థ్‌ రెడ్డి ఇంజనీరింగ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో కొంత కాలం తర్వాత వారిద్దరి మధ్య విబేదాలు రావడంతో  2002 ఫిబ్రవరి 23న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వారిద్దరూ   విషం తీసుకున్నారు.

చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వారిద్దరిని చేర్పించగా ప్రత్యూష మరుసటి రోజే చనిపోయింది. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థ రెడ్డి డిశ్చార్జి అయ్యాడు. కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి తీసుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు గుర్తించారు. మరణానికి ముందు ప్రత్యూషపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ప్రభుత్వం నియమించిన ముగ్గురు వైద్యుల టీమ్‌ ఒక నివేదిక ఇచ్చింది. ప్రత్యూష ఆత్మహత్యకు నిందితుడు సిద్ధార్థరెడ్డి పురికొల్పారని సీబీఐ నివేదిక ఇచ్చింది.

నాలుగు వారాల్లో లొంగిపోవాలి
సీబీఐ విచారణ తర్వాత సిద్ధార్థరెడ్డిపై 306 (ఆత్మహత్యకు పురికొల్పడం), 309 (ఆత్మహత్యకు యత్నించడం) సెక్షన్ల కింద ఛార్జిషీట్‌ వేసింది. దీంతో 2004లో హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగారశిక్షను ఖరారు చేసింది. ఆపై రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. అయితే, తీర్పును సవాల్‌ చేస్తూ సిద్ధార్థరెడ్డి  హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే 2011లో జైలుశిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ ఆయనకు అనకూలంగా తీర్పు రావడంతో కాస్త ఉపశమనం దక్కింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా రెండేళ్ల జైలు శిక్ష సబబే అని తీర్పు ఇచ్చింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థరెడ్డికి న్యాయస్థానం సూచించింది.

ఆ రోజు ఏం జరిగింది.. ప్రత్యూష తల్లి చెప్పిన మాటలు ఇవే..
అది 2002, ఫిబ్రవరి 23 సాయంత్రం. తెల్లవారి బెంగళూరుకి బయలుదేరాలి.  కన్నడ సినిమాలో తొలి అవకాశం రావడంతో సంతోషంగా ఉన్నాం.  ఫేషియల్, వ్యాక్సింగ్‌ చేయించుకోవడానికి తన కజిన్‌ శిరితో కలసి బ్యూటీపార్లర్‌కెళ్లింది. పార్లర్‌లో ఉన్నప్పుడు సిద్ధార్థ రెడ్డి వచ్చాడు. ప్రత్యూష ఫేషియల్‌ పూర్తయ్యే వరకు అక్కడే వెయిట్‌ చేశాడు. ఆ తర్వాత సిద్ధార్థతో ఓ పదిహేను నిమిషాలు బయటకు వెళ్లి వస్తానని శిరిని వెయిట్‌ చేయమని చెప్పింది.

అయితే, కొంత సేపటికి ప్రత్యూష నుంచి నాకు ఫోన్‌ వచ్చింది... ‘జయం సినిమాలో హీరోయిన్‌గా కన్‌ఫర్మ్‌ చేసినట్లు తేజ గారి ఆఫీస్‌ నుంచి ఫోన్‌ వచ్చింది, జయం ఆఫీస్‌కెళ్లి వస్తాను’ అని చెప్పింది. అదే ప్రత్యూష నుంచి నాకు వచ్చిన చివరి ఫోన్‌ కాల్‌.. కానీ, వాళ్లు మాత్రం తేజ గారి ఆఫీస్‌కు వెళ్లనే లేదు. బ్యూటీపార్లర్‌లో ఉన్న శిరికి ఫోన్‌ చేస్తే జరిగిన విషయం చెప్పింది. ఆ తర్వాత శిరి ఫోన్‌ చేసినా సరే ప్రత్యూష ఫోన్‌ తియ్యలేదట. ఆ తర్వాత అంతా మిస్టరీగానే మిగిలిపోయింది.

ప్రత్యూష పోస్ట్‌మార్టమ్‌
ప్రత్యూష పోస్ట్‌మార్టమ్‌ నిమ్స్‌లో జరిగిందని ప్రత్యూష తల్లి చెప్పారు. 'సాయంత్రం ఐదు దాటిందని అప్పుడు పోస్ట్‌మార్టమ్‌ చేయలేదు. మర్నాడు ఉదయం పదకొండుకి అమ్మాయినిచ్చారు. గొంతు నొక్కినట్లు కమిలిన గుర్తులున్నాయి. ఒక వైపు నాలుగు, ఒక వైపు ఒక వేలి గుర్తు స్పష్టంగా తెలుస్తున్నాయి. బలవంతంగా గొంతు నొక్కి నోరు తెరిపించి పాయిజన్‌ పోశారని నాకనిపించింది. హాస్పిటల్‌ వాళ్లు మాత్రం ‘ట్రీట్‌మెంట్‌ సమయంలో పాయిజన్‌ వామిట్‌ చేయించేటప్పుడు పడిన గుర్తులవి’ అన్నారు.

నటి ప్రత్యూష కేసులో సుప్రీం సంచల తీర్పు.. లొంగిపోవాల్సిందే..!

పాయిజన్‌ ఎందుకు తీసుకుందో..
ప్రత్యూష మరణం గురించి ఆమె తల్లి ఇలా చెప్పారు. ప్రత్యూషను మా సంప్రదాయం ప్రకారం దహనం చేశాం. కానీ ఖననం చేసి ఉంటే బావుండేదని ఇప్పటికీ బాధపడుతున్నాను. రీ పోస్ట్‌మార్టమ్‌ చేస్తే నిజాలు బయటపడేవి. మా అమ్మాయి పాయిజన్‌ ఎందుకు తీసుకుంది... అనే ప్రశ్న నన్ను తొలిచింది తప్ప, అత్యాచారం అనే ఊహే రాలేదు నాకు. మా ఊరికి తీసుకెళ్లి దహనం అయిన తర్వాత టీవీల్లో వార్తలు చూసే వరకు నాకు ఆ ఆలోచనే రాలేదు. అప్పట్లో ఇప్పటిలా మీడియా విస్తృతంగా లేదు. ఇన్ని చానళ్లు ఉండి ఉంటే వెంటనే విషయం బయటకు పొక్కి ఉండేది. వార్తలు చూసిన వెంటనే, కర్మకాండలు కూడా జరగకముందే హైదరాబాద్‌ వచ్చేశాను.

ప్రత్యూష  సినిమా విశేషాలు
సినీ నటి ప్రత్యూష సుమారు 12 సినిమాల్లో నటించింది. 1998–2002 మధ్యకాలంలో తెలుగు, తమిళ సినిమాల్లో మెప్పించింది. ఆమె ముఖ్యంగా రాయుడు, శ్రీరాములయ్య, సముద్రం, కలుసుకోవాలని వంటి తెలుగు చిత్రాల్లో గుర్తింపు పొందింది. ప్రత్యూష కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే ఆమె మరణం జరగడం సినీ రంగానికి పెద్ద షాక్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement