ప్రేమలో మోసపోయిన సినీ తారల్లో నటి మమతమోహన్‌దాస్ ఒకరు. ఈమె బహు భాషా నాయకి. మలయాళం, తమిళం,తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి స్టార్ హీరోయిన్‌గా రాణించారు. తెలుగులో యమదొంగ, కృష్ణార్జున, రుద్రంగి సినిమాల్లో నటించిన ఆమె తమిళంలో శివప్పధికారం, గురు ఎన్ ఆళు, తడయార తాక్క,ఎనిమి,మహారాజా తదితర చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం తమిళంలో ప్రభు జయరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న మైడియర్ సిస్టర్ చిత్రంలో అరుళ్‌నిధితో కలసి నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. కాగా ఆ మధ్య క్యాన్సర్ మహ్మమారి బారిన పడ్డారు. అయితే దాని నుంచి పోరాడి పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు.
తర్వాత మళ్లీ నటించడం మొదలెట్టిన మమత మోహన్‌దాస్ (Mamta Mohandas) తన ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాలను ఇటీవల ఒక భేటీలో పేర్కొన్నారు. అందులో క్యాన్సర్ వ్యాధి నుంచి బయప పడి మళ్లీ నటిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఇప్పుడు తనకు మళ్లీ ప్రేమపై దృష్టి మళ్లిందన్నారు. అలా మలయాళ పరిశ్రమకు చెందిన ఒక ప్రముఖ నటుడితో డేటింగ్‌కు వెళ్లానని చెప్పారు. అయితే అతను మరో యువతితో నిశ్చితార్థం జరిగిందన్న విషయం తనకు ఆ తరువాతనే తెలిసిందన్నారు. దాంతో తన మనసు ముక్కలైయ్యిందన్నారు. ఒక అమ్మాయి నమ్మకాన్ని బద్ధలు కొట్టడానికి వారికి మనసు ఎలా వస్తుందో అని ఆవేదన చెందానన్నారు. దీని గురించి ఆ నటుడిని అడగ్గా చాలా లైట్‌గా తీసుకున్నాడని చెప్పారు. అయితే తాను మాత్రం ఆ ఘటనను జీర్ణించుకోలేకపోయానన్నారు.

తన మాజీ భర్తతో మొదటిసారి పరిచయం ఎలా అయిందో కూడా ఆమె పంచుకున్నారు. ఒక కార్యక్రమంలో తనను చూసి వివాహం చేసుకుందామని ఆకాంక్షను వ్యక్తం చేశారని, అందుకు తాను తన తల్లిదండ్రులను అడగమని చెప్పానట్లు గుర్తు చేసుకున్నారు. అలా అప్పుడు తమ పెళ్లి జరిగిందని చెప్పారు. కాగా వివాహ బంధంపై తనకు నమ్మకం ఉందని, అది ఎప్పటికీ చెరగదని అన్నారు. ప్రస్తుతం మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తన మాదిరిగానే అర్థం చేసుకోగలిగిన వ్యక్తి తారసపడితే కొత్త జీవితంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నట్లు నటి మమత మోహన్‌దాస్ పేర్కొన్నారు.
మమతకు 2011 నవంబరు 11న బహ్రెయిన్‌కు చెందిన వ్యాపారవేత్త ప్రజిత్ పద్మనాభన్‌తో నిశ్చితార్థం జరిగింది. వీరికి 2011 డిసెంబరు 28న కోజికోడ్‌లో వివాహం జరిగింది. 2012 డిసెంబరు 12న అంటే కేవలం ఏడాదిలోనే ఈ జంట విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తనకు క్యాన్సర్ కారణంగానే వారిద్దరూ విడిపోయారని కొన్ని కథనాలు కూడా వచ్చాయి.


