అత్యధికశాతం మంది భారతీయులకు నచ్చే టూరిస్ట్ డెస్టినేషన్ కావచ్చేమో కానీ గత కొన్నేళ్లుగా దుబాయ్ భారతీయ సినీ సెలబ్రిటీలకు పెట్టుబడులకు కేంద్రంగా కూడా మారింది. ముఖ్యంగా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖ నటులు దుబాయ్‌లో ఇళ్లు, స్థలాలు, లగ్జరీ అపార్ట్‌మెంట్లు, ఎంటర్టైన్మెంట్ ప్రాపర్టీల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. కొందరైతే మరింత ముందుకెళ్లి అక్కడ స్థిరనివాసాలు సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు.
కారణాలివే...
అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, భద్రత, విలాసవంతమైన జీవనశైలి, అలాగే గ్లోబల్ బిజినెస్ అవకాశాలు సెలబ్రిటీలను దుబాయ్ వైపు ఆకర్షిస్తున్న ప్రధాన కారణాలు. అంతేకాకుండా, సినిమా షూటింగ్‌లకు బాగా అనుకూలమైన లొకేషన్లు, వరల్డ్ క్లాస్ ఎంటర్టైన్మెంట్ వేదికలు కూడా దుబాయ్‌ను ఫేవరెట్ డెస్టినేషన్ గా మార్చాయి. ఇటీవలే దుబాయ్‌లో స్టూడియో సిటీ పేరుతో ఒక అత్యాధునిక షూటింగ్ వేదికను కూడా ఏర్పాటు చేశారు. గత కొంత కాలంగా సినిమా అవార్డుల వేడుకలు దుబాయ్‌లో విజయవంతంగా నిర్వహిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అక్కడ భారతీయులు పెద్ద సంఖ్యలో నివసిస్తుండడం వల్ల ఎంటర్‌టైన్ మెంట్ షోలు, మూవీ ప్రమోషన్లు నిర్వహించడానికి దుబాయ్ అనువైన వేదికగా మారింది. అది సెలబ్రిటీలకు మరో ప్లస్ పాయింట్‌గా మారింది. అంతేకాక ప్రపంచంలోని అనేక దేశాలకు కేవలం 8 గంటల్లోనే దుబాయ్ నుంచి రాకపోకలు సాగించవచ్చు కూడా. నాణ్యమైన విద్యను అందించే ఇంటర్నేషనల్ స్కూల్స్, అత్యాధునిక వైద్య వసతులు, విలాసవంతమైన లైఫ్ స్టైల్...వంటివన్నీ ఆకర్షణలే.
పన్ను తక్కువ భధ్రత ఎక్కువ...
దుబాయ్‌లోని పన్నుల వ్యవస్థే అత్యంత ప్రధాన ఆకర్షణ అనేది విశ్లేషకుల మాట. అక్కడి వారు వ్యక్తిగత పన్నును చెల్లించనక్కర్లేదు. అలాగే అధిక సంపదపై విధించే పన్ను లేదా వారసులకు ఆస్తుల బదిలీపై పన్ను బెడద కూడా ఉండదు. కార్పొరేట్ కంపెనీల లాభాలపై.. అదీ ఓ మోస్తరుగా పన్ను కడితే సరిపోతుంది. ఫలితంగా అక్కడ చిన్న, మధ్య స్థాయి వాణిజ్య వ్యాపారాల ఎదుగుదలకు అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయని అంటున్నారు. రాజకీయ సుస్థిరత, నేరాల శాతం తక్కువగా ఉండటం, వంటి వాటి వల్ల సెలబ్రిటీలు తమ కుటుంబాలతో సహా దుబాయ్‌కు మకాం మారుస్తున్నారు. దుబాయ్‌లో అనుమతి లేకుండా అవతలి వారి ఫొటోలు తీయడం నిషిద్ధం. విలేకరుల హడావుడి కూడా ఉండదు. ఇలా ప్రైవెసీని కాపాడేలా కట్టుదిట్టమైన చట్టాలు, భద్రత కూడా సెలబ్రిటీలను దుబాయ్‌కి రా రమ్మంటున్నాయ్.
బాలీవుడ్ పాగా...
ఈ నేపధ్యంలో దుబాయ్‌లో పలువురు బాలీవుడ్ నటులు పాగా వేస్తున్నారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్‌కు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రదేశంగా పేరొందిన దుబాయ్‌లోని పామ్ జుమైరా ప్రాంతంలో విలాసవంతమైన విల్లా ఉంది. ఇది అక్కడి ఆయన అభిమానులకు ఓ ప్రత్యేక ఆకర్షణగా కూడా. ఇదే ప్రదేశంలో మన దేశానికి చెందిన వ్యాపార ప్రముఖులు అంబానీ కుటుంబీకులకు కూడా నివాసాలు ఉన్నాయి. అలాగే సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ లాంటి నటులు కూడా దుబాయ్‌లో ఖరీదైన రెసిడెన్షియల్ ప్రాపర్టీలను కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతర్జాతీయ ప్రముఖులతో పాటు భారత్‌కు చెందిన అనేక మంది సెలబ్రిటీలు యూఏఈకి ఇప్పటికే మకాం మార్చారు. స్విమ్మింగ్‌లో రాణిస్తున్న తన తనయుడి కెరీర్ కోసం అని చెబుతూ ప్రముఖ నటుడు మాధవన్ తన కుటుంబంతో సహా దుబాయ్‌కు అడ్రెస్ మార్చేశారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా కూడా విడాకుల అనంతరం దుబాయ్‌లోనే నివసిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ భార్య తమ పిల్లల చదువుల కోసం దుబాయ్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు. పాప్ స్టార్ యో యో హనీ సింగ్, నటి రాఖీ సావంత్ కూడా దుబాయ్‌లోనే సెటిలైపోయారు. కార్ రేస్‌ల గురించి తమిళ సూపర్‌స్టార్ అజిత్ తరచుగా దుబాయ్‌కు రాకపోకలు సాగిస్తున్నారు.
టాలీవుడ్ నుంచి కూడా పలువురు నటులు దుబాయ్‌లో అపార్ట్‌మెంట్లు, హాలిడే హోమ్‌లపై ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ల సమయంలో ఉండేందుకు, కుటుంబంతో విహారానికి వీలుగా వీటిని ఉపయోగిస్తున్నారు. నివాసాలకే కాకుండా, కొంతమంది సెలబ్రిటీలు దుబాయ్‌లోని అభివద్ధి చెందుతున్న ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ప్లాట్లు, కమర్షియల్ స్పేస్‌లలో పెట్టుబడులు పెడుతున్నారు. పర్యాటక పరంగా దూసుకుపోతున్న ప్రాంతం కావడంతో భవిష్యత్తులో విలువ పెరిగే అవకాశాలు ఉండటంతో, సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు.
వినోదానికి లోటు లేదు...
ఇస్లామిక్ దేశమైనప్పటికీ మతపరమైన అంశాల్లో ఇతర మధ్య ప్రాచ్య దేశాలతో పోలిస్తే దుబాయ్ చాలా సరళమైన విధానాలను అనుసరిస్తుంది. అక్కడి ముస్లిమేతరుల కోసం దేశవ్యాప్తంగా సివిల్ పర్సనల్ స్టేటస్ చట్టం అమలులో ఉంది. అలాగే ప్రస్తుతం సెలబ్రిటీల్లో ఎక్కువ మంది అనుసరిస్తున్న లివ్–ఇన్ రిలేషన్ షిప్స్‌ను నేరంగా పరిగణించొద్దని కొంత కాలం క్రితం యూఏఈ నిర్ణయించింది. అంతేకాదు దుబాయ్‌కి సమీపంలో ఉన్న యూఏఈ లోని రస్ ఉల్ ఖైమా ప్రాంతంలో త్వరలోనే క్యాసినో కూడా రానుంది. దీంతో మరింతగా ఈ ఎడారి దేశం సెలబ్రిటీలు ఎంచుకునే రహదారిగా మారడం తధ్యంగా కనిపిస్తోంది.


