ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి కావేరీ బారువా అనే బ్రాండ్ స్ట్రాటజర్ ఓ పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ అంశంలో ఆమె తాజాగా క్షమాపణలు చెప్పింది. అల్లు అర్జున్ (Allu Arjun)తో యాడ్ షూటింగ్ అంటే చాలా ప్రోటోకాల్స్ ఉంటాయని కావేరీ బారువా పేర్కొంది. ఆయన్ను కలిసిన తర్వాత ఏం చేయాలి..? ఏం చేయకూడదన్న 42 నిబంధనలు ఉంటాయని చెప్పడంతో బన్నీ మేనేజర్లు ఆమె వ్యాఖ్యల్ని ఖండించారు.
కొన్ని రోజుల తర్వాత కావేరి క్షమాపణలు చెబుతూ తాజాగా ఆమె ఒక నోట్ విడుదల చేసింది. అల్లు అర్జున్‌పై చేసిన వ్యాఖ్యలు తన సొంత వాదనగా ఆమె చెప్పింది. 42 నిబంధనలు అనే మాట తన కల్పితమేనంటూ ఆమె పేర్కొంది. 42 నిబంధనలకు సంబంధించిన లిస్ట్ ఎవరు విడుదల చేశారో తనకు తెలీదని ఆమె చెప్పింది. తాను ఎలాంటి పత్రాన్ని జారీ చేయలేదని క్లారిటీ ఇచ్చింది. బన్నీ గురించి తాను చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఆమె పేర్కొంది. తన వ్యాఖ్యలను వాస్తవమని ఎవరూ తీసుకోకూడదని విన్నవించుకుంది.
బన్నీ గురించి అలాంటి ప్రకటనలు చేసినందుకు చింతిస్తున్నానని తెలిపింది. ఈ వ్యాఖ్యల వల్ల ఆయన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాని కావేరి తెలిపింది. అల్లు అర్జున్‌పై ఎంతో గౌరవం ఉందని చెప్పింది. ఫైనల్‌గా బన్నీ గురించి వైరల్ అయిన 42 నిబంధనలు అనేవి తాన కల్పితమేనని కావేరి బారువా చెప్పడం విశేషం. అదంతా కేవలం ఆమె పాపులర్ అయ్యేందుకే ఇదంతా చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఇంటర్వ్యూ పాడ్‌కాస్టర్ స్వీకృతి కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పింది. అల్లు అర్జున్ గురించి కావేరి మాట్లాడిన పూర్తి పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌తో పాటు ఇన్‌స్టా రీల్‌ను తొలగించినట్లు వెల్లడించింది. దీంతో తమ హోస్ట్‌పై వేధింపులు ఆపేయాలని ఆమె కోరింది.


