కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు రాజీనామా చేయాలి | Conspiracy angle behind Ajit Pawars plane crash | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు రాజీనామా చేయాలి

Feb 20 2026 5:02 AM | Updated on Feb 20 2026 11:29 AM

Conspiracy angle behind Ajit Pawars plane crash

అజిత్‌ పవార్‌ విమాన ప్రమాదం వెనుక కుట్ర కోణం 

వీఎస్‌ఆర్‌ యాజమాన్యంతో టీడీపీ నేతల చీకటి బంధం!

రూ.35 కోట్ల విలువైన విమానానికి రూ.265 కోట్ల బీమా వెనుక మర్మమేంటి?  

మహారాష్ట్ర ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్‌ పవార్‌

ఇప్పటికే సీబీఐ విచారణ కోరిన అజిత్‌ సతీమణి

సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ సహా ఐదుగురి ప్రాణాలను బలిగొన్న ఘోర విమాన ప్రమాద ఘటనకు కారణమైన చార్టర్డ్‌ విమానయాన సంస్థ వీఎస్‌ఆర్‌ వెంచర్స్‌ను కాపాడేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, తెలుగుదేశం పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నందున సదరు మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని ఎన్సీపీ (శరద్‌పవార్‌) ఎమ్మెల్యే రోహిత్‌ పవార్‌ గురువారం విలేకరుల సమావేశంలో డిమాండ్‌ చేశారు. 

ప్రమాదం వెనుక ‘ఇన్సూరెన్స్‌’ కోణం కూడా ఉన్నట్లు రోహిత్‌ పవార్‌ తీవ్ర ఆరోపణ చేశారు. విమానం కొనుగోలు ధర రూ.35 కోట్లు అయితే.. దాని ప్రస్తుత మార్కెట్‌ విలువ కేవలం రూ.10 నుంచి రూ.15 కోట్లు మాత్రమేనని.. అయితే, ఆశ్చర్యకరంగా ఆ విమానానికి ఏకంగా రూ.55 కోట్ల ఇన్సూరెన్స్, అలాగే రూ.210 కోట్ల మేర లయబిలిటీ ఇన్సూరెన్స్‌ ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. లియర్‌ జెట్‌ విమాన ప్రమాదంలో ఆ చార్టర్డ్‌ విమానాన్ని నిర్వహించిన వీఎస్‌ఆర్‌ వెంచర్స్‌ సంస్థను తెలుగుదేశం పార్టీ పెద్దలు వెనకేసుకొస్తున్నారని రోహిత్‌ పవార్‌ ఆరోపించారు. 

విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడికి, తెలుగుదేశం పార్టీ పెద్దలకు వీఎస్‌ఆర్‌ కంపెనీ యజమానులతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని ఆయన చెప్పారు. వీఎస్‌ఆర్‌ సంస్థ యజమాని వీకే సింగ్‌ కుమారుడు రోహిత్‌ సింగ్‌ వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు టీడీపీ కీలక నేతలు, మంత్రులు, మహారాష్ట్ర మాజీమంత్రులు కూడా హాజరయ్యారని రోహిత్‌ పవార్‌ ఆధారాలతో సహా బయటపెట్టారు.వీరి మధ్య ఇంతటి సాన్నిహిత్యం ఉండడంవల్లే విమానయాన సంస్థను వారు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. రామ్మోహన్‌ నాయుడు మంత్రిగా కొనసాగితే విచారణ పక్కదోవ పట్టే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తంచేశారు. 

ప్రయాణికుల ప్రాణాలతో వీఎస్‌ఆర్‌ చెలగాటం
ప్రమాదానికి గురైన విమానంలో పరిమితికి మించి అదనపు ఇంధన ట్యాంకులను నింపారని, అవే విమానంలో బాంబుల్లా పేలాయని రోహిత్‌ పవార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కేవలం బారామతి వరకు వెళ్లే విమానానికి అంత ఇంధనం ఎందుకు? అవసరమైతే హైదరాబాద్‌లో ఇంధనం నింపుకునే అవకాశం ఉన్నప్పటికీ అలా ఎందుకు చేయలేదు?’ అని ఆయన ప్రశ్నించారు. ఈ దుర్ఘటన కేవలం ప్రమాదం కాదని, దీని వెనుక భారీ కుట్ర దాగి ఉందన్న అనుమానాలకు ఈ చిన్నచిన్న పరిణామాలే బలాన్పిస్తున్నాయని తేల్చిచెప్పారు. 

వీఎస్‌ఆర్‌ సంస్థ తమ విమానాలను కనీస స్థాయిలో కూడా మెయింటెనెన్స్‌ చేయకుండా వీవీఐపీలు, ఇతర ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతోందని మండిపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు, ఎక్కడా ఎలాంటి లోపాలు లేనట్లుగా ఆ సంస్థ యజమాన్యం డాక్యుమెంట్లను తారుమారు చేస్తోందని ఆరోపించారు. 

మియామికి పారిపోయిన యజమానులు
ఈ మొత్తం వ్యవహారంలో వీఎస్‌ఆర్‌ వెంచర్‌ యజమాని వీకే సింగ్, ఆయన కుమారుడు రోహిత్‌ సింగ్‌ ఆచూకీపై రోహిత్‌ పవార్‌ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ప్రమాదం జరిగిన వెంటనే రోహిత్‌ సింగ్‌ దేశం విడిచి పరారయ్యాడని, ప్రస్తుతం అ­తను మియామిలో ఉన్నాడని ఆరోపించారు. ఈ ఘటన జరిగిన వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించాల్సి ఉన్నప్పటికీ, అధికారులు అలా చేయకపోవడం దారుణమన్నారు.

రాజకీయ కుట్ర ఉందా?
ఇదిలా ఉంటే.. బలమైన నాయకులను అజిత్‌ పవార్‌ ఎదిరించినందున, ఆయన భద్రతపై గతంలోనే ఆందోళనలు వ్యక్తమయ్యాయని రోహిత్‌ పవార్‌ తెలిపారు. ఎన్సీపీ (శరద్‌ పవార్‌) వర్గం ఎన్డీయేలో చేరడం.. లేదా అజిత్‌ పవార్‌ ఎన్డీయే నుంచి తప్పుకోవడం వంటి ఊహాగానాల నేపథ్యంలో కొన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రమాదం వెనుక ఏదైనా రాజకీయ కుట్ర కోణం ఉందా అనేది తేలాల్సి ఉందన్నారు. 

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అజిత్‌ పవార్‌ భార్య సునేత్ర పవార్‌ సహా పలువురు ఎన్సీపీ నేతలు ఈ ఘటనపై సీబీఐ విచారణ కోరడాన్ని రోహిత్‌ పవార్‌స్వాగతించారు. మరోవైపు, ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో ఈ ప్రమాదంపై ఫిబ్రవరి 27 నాటికి ప్రాథమిక నివేదికను విడుదలచేసే అవకాశముంది. ఈ తరుణంలో విమానయాన సంస్థకు, టీడీపీ నేతలకు మధ్య ఉన్న బంధంపై వస్తున్న తీవ్ర ఆరోపణలు జాతీయ స్థాయిలో కలకలం రేపుతున్నాయి. 

సమగ్ర విచారణ జరపాల్సిందే: సుప్రియా సూలే 
ఇక ఈ వ్యవహారంపై బారా­మతి ఎంపీ, అజిత్‌ పవార్‌ సోదరి సుప్రియా సూలే సైతం స్పందించారు. ప్రమాదానికి సంబంధించి ప్రతిరోజూ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయని, ఈ ఘటనపై పారదర్శకమైన, సమగ్ర విచారణ జరగాలని ఆమె డిమాండ్‌ చేశారు. రోహిత్‌ పవార్‌ చేస్తున్న పోరాటం శాస్త్రీయమైనదంటూ మద్దతు పలికారు. విమాన ప్రమాదం వెనుక అసలు నిజాలు బయటికి రావాలని రోహిత్‌ పవార్‌ కోరుకుంటున్నాడని చెప్పారు. అందుకే సమగ్ర విచారణను కోరుతున్నామని సుప్రియా స్పష్టంచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement