గోరఖ్‌పూర్‌లో ఘోరం | Gorakhpur Cataract Surgery Horror, Nine cataract patients lost their eyesight | Sakshi
Sakshi News home page

గోరఖ్‌పూర్‌లో ఘోరం

Feb 20 2026 4:39 AM | Updated on Feb 20 2026 4:43 AM

Gorakhpur Cataract Surgery Horror, Nine cataract patients lost their eyesight

వికటించిన కంటి వైద్యం 

బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌ సోకడంతో 9 మంది కళ్లు తొలగింపు 

కంటిచూపు కోల్పోయిన మరో 9 మంది రోగులు 

ఆస్పత్రిని సీజ్‌చేసిన యూపీ పోలీసులు 

గోరఖ్‌పూర్‌(యూపీ): ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఆస్పత్రిలో దారుణ నిర్లక్ష్యం ‘వెలుగు’లోకి రాగా చూపు ‘చీకట్లో’కి వెళ్లింది. కంటి వైద్య శిబిరంలో నేత్రాలకు కాటరాక్ట్‌ సర్జరీ చేయించుకున్న పలువురు కళ్లను కోల్పోయిన దారుణోదంతం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ పట్టణంలో జరిగింది. ఫిబ్రవరి ఒకటో తేదీన 30 మంది రోగులకు కాటరాక్ట్‌ సర్జరీ చేయగా వారిలో 18 మందికి తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ సోకింది. 

ఇన్ఫెక్షన్‌ తీవ్రస్థాయికి చేరుకోవడంతో తప్పని పరిస్థితుల్లో వేర్వేరు ఆస్పత్రుల్లో వైద్యులు తొమ్మిది మంది రోగుల కళ్లను తొలగించాల్సి వచి్చంది. మరో తొమ్మిది మంది రోగులు శాశ్వతంగా చూపు కోల్పోయారు. ఆపరేషన్‌ థియేటర్‌లో, శస్త్ర చికిత్స విధానంలో పూర్తి నిర్లక్ష్యపూరిత వైఖరికి గోరఖ్‌పూర్‌లోని న్యూ రాజేశ్‌ హైటెక్‌ హాస్పిటల్‌ కేంద్రబిందువుగా మారింది. విషయం తెల్సి యోగి ఆదిత్యనాథ్‌ సారథ్యంలోని బీజేపీ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వెనువెంటనే ఆస్పత్రిని సీజ్‌చేయించింది. 

కేసు నమోదుచేసి సమగ్ర దర్యాప్తును పోలీస్, వైద్యవిభాగాలు వేర్వేరుగా ఆరంభించాయి. బాధ్యులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా మేజి్రస్టేట్‌ దీపక్‌ మీనా చెప్పారు. ‘‘కేవలం వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగిందని తేలితే వాళ్ల లైసెన్స్‌లు రద్దుచేస్తాం. ఇది చాలా తీవ్రమైన అంశం. దర్యాప్తు నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం’’అని చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రాజేశ్‌ ఝా వెల్లడించారు. బాధితులందరి ‘కల్చర్‌’రిపోర్ట్‌లను ప్రభుత్వ వైద్యులు సరిచూశారు. అందరికీ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌ సోకినట్లు నిర్ధారించారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం వర్తిస్తుందనే ఆశతోనే దాదాపు 30 మంది ఒకేసారి ఈ కాటరాక్ట్‌ సర్జరీ చేయించుకున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.  

ఆగని రక్తం.. 
‘‘ఆపరేషన్‌ అయిన 24 గంటల తర్వాత కంటి నుంచి రక్తం ధారగా కారడం మొదలైంది. వెంటనే మళ్లీ అదే ఆస్పత్రిలో చేరి్పంచాం. మందులు ఇస్తే నొప్పి తగ్గిందికానీ రక్తం కారడం ఆగలేదు. చివరకు వేరే ఆస్పత్రిలో చేర్పించాం’’అని ఒక బాధితుని కుటుంబసభ్యుడు ఆవేదన వ్యక్తంచేశారు. పలువురు బాధితులు విపరీతమైన నొప్పి, బాధతో ఢిల్లీ, లక్నో, వారణాసి ఆస్పత్రుల్లో చేరారు. ఇన్ఫెక్షన్‌ దారుణంగా సోకడంతో తప్పని పరిస్థితుల్లో కళ్లను తొలగించాల్సి వచ్చిందని ఆయా వేర్వేరు ఆస్పత్రుల వైద్యులు వివరణ ఇచ్చారు. ‘‘వారణాసిలో మా అమ్మకు ఒక కంటిని తొలగించాం. మరో కంటికీ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌ సోకిందేమోనని భయంగా ఉంది. రెండో కన్నూ సరిగా కని్పంచట్లేదు. ఏదైనా జరిగితే మొదటి ఆస్పత్రిపై కేసు వేస్తా’’అని రాధౌరీ ప్రాంతానికి చెందిన శంకరావతి కుమారుడు ఆగ్రహంగా మాట్లాడారు.    

Advertisement
 
Advertisement
Advertisement