ఆ అధికారం పోలీసులకు లేదు | High Court clarifies on denial of permission for public meetings | Sakshi
Sakshi News home page

ఆ అధికారం పోలీసులకు లేదు

Feb 20 2026 4:59 AM | Updated on Feb 20 2026 4:59 AM

High Court clarifies on denial of permission for public meetings

బహిరంగ సభలకు అనుమతి నిరాకరణపై హైకోర్టు స్పష్టీకరణ  

సాక్షి, అమరావతి: రాజకీయ పార్టీలు నిర్వహించే బహిరంగ సభలకు అనుమతిని నిరాకరించే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు చెప్పింది. ఆ సభలను నియంత్రించే అధికారం మాత్రమే పోలీసులకు ఉందని స్పష్టం చేసింది. భారత యువజన చైతన్య పార్టీ (బీవైసీపీ) ఈ నెల 22న బీసీ సింహ గర్జన పేరుతో నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని తప్పుపట్టింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలను,  సీబీఎస్‌ఈ పరీక్షలను సాకుగా చూపుతూ అనుమతి నిరాకరించడాన్ని ప్రశ్నింశ్నించింది. 

సభ నిర్వహించేది ఆదివారమని, ఆ రోజున అసెంబ్లీ సమావేశాలు గానీ, సీబీఎస్‌ఈ పరీక్షలు గానీ లేవని గుర్తు చేసింది. బహిరంగ సభకు అనుమతి విషయంలో గురువారం ఇరుపక్షాలు వాదనలు విన్న న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ యడవల్లి లక్ష్మణరావు ఈ అంశంపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు.  

పిటిషన్‌ దాఖలు చేసిన బీవైసీపీ పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వై.వి.రవిప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ పోలీసులు అధికార పార్టీ నిర్వహించే సభల విషయంలో ఓ రకంగా, మిగిలిన పార్టీల విషయంలో మరోరకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రామచంద్ర యాదవ్‌పై పలు కేసులున్నాయని ప్రభుత్వ సహాయ న్యాయవాది అజయ్‌ పేర్కొనగా,  ఆ కేసుల వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి అవన్నీ వేర్వేరు అంశాలకు సంబంధించినవని, సభ అనుమతి షరతులను ఉల్లంఘించిన కారణంగా నమోదు చేసిన కేసులు కావని వ్యాఖ్యానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement