సూపర్‌ సిక్స్‌ అట్టర్‌ ఫ్లాప్‌ | YS Jagan Mohan Reddy comments over super six promises | Sakshi
Sakshi News home page

సూపర్‌ సిక్స్‌ అట్టర్‌ ఫ్లాప్‌

Feb 20 2026 5:35 AM | Updated on Feb 20 2026 5:39 AM

YS Jagan Mohan Reddy comments over super six promises

మూడో బడ్జెట్‌లోనూ కనిపించని నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్‌ హామీలు

నిరుద్యోగ భృతి కింద రూ.21,600 కోట్లు ఎగనామం.. 

ప్రతి నిరుద్యోగికి రూ.1.08 లక్షలు బాకీ.. ఆడబిడ్డ నిధి కింద 18–60 ఏళ్ల అక్కచెల్లెమ్మలకు రూ.97,200 కోట్లు బాకీ 

ప్రతి అక్కాచెల్లెమ్మకూ రూ.54 వేలు మోసం.. 50 ఏళ్లు నిండిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి రూ.1.44 లక్షలు బాకీ 

తల్లికి వందనం కాదు కాదు.. తల్లికి వంచన పథకంగా మార్చారు 

ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, ఉచిత బస్సు.. ఇలా ఏ పథకం చూసినా మోసమే 

అన్నదాత సుఖీభవ అంటూ రైతుల నెత్తిన టోపీ: వైఎస్‌ జగన్‌ ధ్వజం

సూపర్‌ సిక్స్‌లో అతి ముఖ్యమైన హామీ.. 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తానన్నారు. దీనికి ఆడబిడ్డ నిధి అని పేరు పెట్టారు. నిరుద్యోగ భృతి పేరుతో యువతను వంచించారు. 50 ఏళ్లకే పింఛన్‌ అంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మోసం చేశారు. ఇలా సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌లలో మూడు ప్రధాన హామీలకు ఈ మూడు బడ్జెట్‌లలో అతీగతి లేదు. సున్నా బడ్జెట్‌. అట్టర్‌ ఫ్లాప్‌ అయిన సినిమా చూపిస్తూ చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌.. అంటూ ఏ రకంగా సంబరాలు చేసుకోమని చెబుతాడు? మీరే చెప్పండి. ఇది ధర్మమేనా.. న్యాయమేనా? అలాగే స్త్రీ శక్తి అంటూ ఉచిత బస్సు పథకానికి పేరు పెట్టారు. అమ్మవారు పేరు పెట్టి మోసం చేయగలిగే వ్యక్తి ఈ ప్రంపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే.

ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క పింఛన్‌ ఇవ్వలేదు. కొత్త వాటికి కనీసం దరఖాస్తులు తీసుకోవడం లేదు. ప్రభుత్వం వద్ద ఇప్పటికే 2.50 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అదే మా హయాంలో ఆర్నెల్లకోసారి ఏటా జూన్, డిసెంబర్‌లలో అర్హులను గుర్తించి కొత్త పింఛన్లు ఇచ్చేవాళ్లం. కానీ ఈరోజు పరిస్థితి రివర్స్‌ అయ్యింది. 2014లో చంద్ర బాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 39 లక్షల పింఛన్లు ఉంటే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి అంటే 2024 మార్చి నాటికి 66 లక్షల పింఛన్లకు పెంచగలిగాం. కానీ చంద్రబాబు వచ్చిన రెండేళ్లకే 66 లక్షల నుంచి 60 లక్షలకు ఆ సంఖ్య తగ్గిపోయింది.

చంద్రబాబు ఉద్దేశ పూర్వకంగా వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. అన్నీ మానవ తప్పిదాలే (మ్యాన్‌మేడ్‌ బ్లండర్స్‌). ఆయన సృష్టించిన ఈ సంక్షోభం వల్ల ఒక పద్దతి ప్రకారం ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యమై పోయింది. ఈ క్రాప్‌ లేకుండా పోయింది. పద్దతి ప్రకారం దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు. ఉచిత పంటల బీమాను తీసేశారు. ఏ ఒక్క రైతుకూ గిట్టుబాటు ధర లేదు.  

మా హయాంలో కోవిడ్‌ సంక్షోభ సమయంలో కూడా రైతులను చేయిపట్టి నడిపించాం. ఈ క్రాప్‌ ద్వారా రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమాను అమలు చేశాం. ఏ సీజన్‌లో నష్టం జరిగితే అదే సీజన్‌ ముగిసేలోగా పంట నష్ట పరిహారం (ఇన్‌పుట్‌ సబ్సిడీ) రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసేవాళ్లం. పైగా పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ అర్హుల జాబితాలను ఆర్బీకేలలో ప్రదర్శించే వాళ్లం. - వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి : ‘అప్పుల్లో ఆల్‌ టైమ్‌ రికార్డులు బద్దలు కొడుతున్న చంద్రబాబు ప్రజలకు ఏమైనా లబ్ధి చేకూరుస్తున్నారా అంటే ఏమీ లేదు. ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ అంతా మోసమే. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్‌లో కేటాయింపులే ఇందుకు నిదర్శనం. మరో వైపు చేస్తున్న అప్పులన్నీ దోచుకో.. పంచుకో.. తినుకో.. అన్నట్టుగా కాజేస్తున్నారే తప్ప ప్రజలకు ఎలాంటి మేలు చేయడం లేదు’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. 

మేనిఫెస్టో ద్వారా ఇచ్చిన హామీలు నీటి మీద రాతలు, మోసాలు కాకూడదన్నారు. మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాలని చేసి చూపించామని చెప్పారు. కోవిడ్‌ లాంటి మహా సంక్షోభం ఉన్నప్పటికీ మనసా, వాచా, కర్మణా ఇచ్చిన హామీలు అమలు చేసి మేనిఫెస్టోకు ఒక పవిత్రతను తీసుకొచ్చామని తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘మేనిఫెస్టో అమలులో తొలిసారి సంస్కరణలు తీసుకొచ్చాం. ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చి ప్రజల దగ్గరకు గర్వంగా చిక్కటి చిరునవ్వుతో వెళ్లగలిగేలా చేశాం. కానీ చంద్రబాబు మేనిఫెస్టోకు ఇచ్చే విలువ ఏమిటో తెలుసా? గడిచిన రెండు బడ్జెట్లు, ఈ ఏడాది ప్రవేశ పెట్టిన మూడో బడ్జెట్‌లో కేటాయింపుల ద్వారా మేనిఫెస్టో అంటే తనకు ఎప్పటికీ ఒక చిత్తు కాగితమే అని రుజువు చేశాడు’ అని అన్నారు. ఈ సమావేశంలో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

బాండ్లు పంచి పెట్టి మరీ వంచించారు  
» నిజంగా ఎన్నికలకు ముందు ఈ పెద్దమనిషి ఇంటింటికి వెళ్లి తానిచ్చిన హామీల అమలు కోసం ఏకంగా బాండ్లు పంచిపెట్టాడు. ప్రతి ఇంటికి ఏ పథకం కింద ఎంత వస్తుందో లెక్కలు గట్టి మరీ చూపించి ఓట్లు వేయించుకున్నాడు. ఇప్పుడు ప్రతీ కుటుంబాన్ని మోసగిస్తున్నాడు. సూపర్‌ 6.. సూపర్‌ 7 హామీలతో పాటు మేనిఫెస్టోలో వాళ్లిచ్చిన హామీలను వాళ్ల కరపత్రికలో ఏ విధంగా ప్రకటనలు ఇచ్చుకున్నారో మీరే చూడండి. ఈ మాఫియా ముఠా అంతా కలిసి ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో చెప్పడానికి ఈ ప్రకటనలే నిదర్శనం. 

»  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, యువగళం పేరిట ప్రతి నెలా ప్రతి నిరుద్యోగికి రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి, ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేల ఆరి్థక సాయం. ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు, పాఠశాలకు వెళేŠాల్ల పిల్లలున్న తల్లులకు.. ఎంత మంది పిల్లలుంటే అంతమందికి ప్రతీ పిల్లాడికి రూ.15 వేలు, ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు, మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించేందుకు ఉచిత బస్సు ప్రయాణం.. ఇలా తానిచ్చిన హామీలకు సంబంధించి ప్రతి ఇంటికి వెళ్లి బాండ్లు ఇచ్చారు. (వీడియో ప్రదర్శించి చూపారు).  

నిత్య మోసగాడు.. నిత్య వంచకుడు  
»   సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీలను కరపత్రాల రూపంలో పంచి పెట్టడమే కాదు.. తమ భజన పత్రికల్లో ప్రకటనల ద్వారా ప్రచారం చేసుకున్నారు. ఈ పథకాలకు ఈ మూడు బడ్జెట్‌లలో ఏ మేరకు నిధులు కేటాయించారు.. ఏ మేరకు ఖర్చు చేశారో చెప్పమని చంద్రబాబును అడుగుతున్నా. యువగళం పేరిట ప్రతి నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ.3 వేల చొప్పున ఇస్తానన్న నిరుద్యోగ భృతి కోసం ఈ మూడు బడ్జెట్‌లలో కించిత్‌ ప్రస్తావన ఎక్కడైనా ఉందా?  

»   నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు ఇవ్వాలి. ఇందుకు ఈ మూడేళ్లలో బడ్జెట్‌లో రూ.21,600 కోట్లు కేటాయించాలి. కానీ తొలి రెండు బడ్జెట్‌లలో కేటాయించింది సున్నా.. ఈ మూడో బడ్జెట్‌లో ఇచ్చిందీ సున్నా. ఏడాదికి రూ.36 వేలు చొప్పున ఈ మూడేళ్లలో రూ.1.08 లక్షల చొప్పున ప్రతీ నిరుద్యోగికి బాకీ పడ్డాడు. నిరుద్యోగ భృతి అంటూ హామీ ఇవ్వడం, చెత్త బుట్టలో వేయడం ఇదేమీ తొలిసారి కాదు.. 1999, 2014 ఎన్నికల మేనిఫెస్టోలలో కూడా కన్పిస్తుంది. ఇలా ప్రతిసారి ప్రతి ఎన్నికల్లో ఈ హామీతో ఓట్లు వేయించుకోవడం, నిస్సిగ్గుగా ఎగ్గొట్టడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. అందుకే యువత పట్ల చంద్రబాబు నిత్య మోసగాడు, నిత్య వంచకుడు. 

బాండ్లపై ఇదీ వాళ్ల ప్రతిజ్ఞ 
ఇంటింటికీ పంపిణీ చేసిన బాండ్లపై చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఫొటోలు, సంతకాలు, పైగా ప్రతిజ్ఞ.. ఏమని చేశారో తెలుసా? (మాజీ మంత్రి కురసాల కన్నబాబు చదివి విన్పించారు)

బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌ గ్యారంటీ..  

‘చంద్రబాబు అనే నేను.. రాష్ట్ర ప్రజలు నా పై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భవిష్యత్‌కు గ్యారంటీగా ఉండే వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్రాభివృద్ధికి, ఉన్నతికి పునరంకితమవుతా’. 

‘పవన్‌ కల్యాణ్‌ అనే నేను.. రాష్ట్ర ప్రజలు మా సమష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టు కుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ–జనసేన పార్టీలు సంయుక్తంగా అధికారంలోకి వచ్చిన తర్వాత భవిష్యత్‌కు గ్యారంటీగా ఉండే వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి, సహృదయంతో, సమన్వయంతో, సహకారంతో సమిష్టిగా కృషి చేస్తాను.’

ప్రతి నెలా 25 వేల పింఛన్లు కట్‌
»  మిగిలిన పథకాల అమలు తీరు కూడా అరకొరే. ప్రతి నెలా పింఛన్ల పంపిణీనే చూడండి. చంద్రబాబు పబ్లిక్‌ మీటింగ్‌లు పెడుతూ ప్రతి నెలా పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రతి మీటింగ్‌కు 25 వేల పింఛన్లు కట్‌ చేస్తున్నాడు. 2024 ఎన్నికల నాటికి అంటే మార్చి నాటికి రాష్ట్రంలో పింఛన్ల సంఖ్య 66,34,372 కాగా, 2026 ఫిబ్రవరిలో 60,96,108 మందికి ఫించన్లు ఇచ్చారు. అంటే ఏకంగా 5,38,634 మందికి పింఛన్లు కట్‌ చేశాడు.  

»  ఇంకా ఆశ్చర్యమేమిటంటే ఫిబ్రవరిలో ఇచ్చిన పింఛన్లకు ఇచ్చిన సొమ్ము రూ.2,632 కోట్లు. ఈ లెక్కన ఈ ఏడాది బడ్జెట్‌లో 12 నెలలకు రూ.31,554 కోట్లు కేటాయించాలి కదా.. కానీ కేవలం రూ.27,719 కోట్లు మాత్రమే పెట్టారు. ఈ లెక్కన ఈ మొత్తం 53,50,115 పింఛన్లకు మాత్రమే సరిపోతుంది. అంటే ఈ ఏడాది మరో 7,45,993 పింఛన్లు కట్‌ చేయడానికి సిద్దపడినట్లు చంద్రబాబు చెప్పకనే చెబుతున్నాడు.

తల్లికి వందనం కాదు.. తల్లికి వంచన 
» తల్లికి వందనం పథకాన్ని కాస్తా తల్లికి వంచన పథకంగా మార్చేశారు. బడికి వెళ్లే ప్రతి పిల్ల వాడికి ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఇస్తామన్నారు. రాష్ట్రంలో యూడీఐఎస్‌ (యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌) ప్రకారం 2023–24 నాటికి బడికి పోయే పిల్లలు 87,41,885 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి ఏటా రూ.15 వేల చొప్పున రూ.13,112 కోట్లు ఖర్చు అవుతుంది. 

» 2024–25లో ఈ పథకానికి ఒక్క రూపాయి ఇవ్వలేదు. 2025–26లో రెండో ఏడాది బడ్జెట్‌లో రూ.8,349 కోట్లు మాత్రమే కేటాయించారు. పైగా యూడైస్‌ డేటా ప్రకారం 20 లక్షల మంది పిల్లలకు ఎగరగొట్టేశాడు. చివరకు 67.27 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. అది కూడా కొందరికి రూ.8 వేలు.. రూ.9 వేలు.. రూ.10 వేలు, మరి కొంత మందికి రూ.13 వేలు ఇచ్చారు. తాజాగా బడ్జెట్‌ ఇన్‌ బ్రీఫ్‌లో రూ.9,668 కోట్లు ఖర్చు చేస్తామని చూపించారు. కానీ కేటాయించింది మాత్రం రూ.8,456 కోట్లు మాత్రమే. అంటే ఈ ఏడాది కూడా భారీగా పిల్లలకు కోత పడుతుందని చెప్పకనే చెప్పారు. 

ఉచిత గ్యాస్‌.. ఉచిత బస్సు అంతా మోసం  
» కడప నుంచి వైజాగ్‌కు పోవచ్చు.. శ్రీకాకుళం వాళ్లు తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు.. మధ్యలో కనకదుర్గమ్మను కూడా దర్శనం చేసుకోవచ్చన్నారు. రా­ష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఫ్రీ అన్నారు. ఏపీఎస్‌ ఆరీ­్టసీ­లో 16 రకాల సర్వీసులుంటే.. కేవలం ఐదు సర్వీ­సులకు మాత్రమే పరిమితం చేశారు. ఈ పథకం అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్లు ఖర్చు చేయాలి. మొదటి ఏడాది ఈ స్కీమ్‌ ఎగరగొట్టేశాడు. 

» రెండో ఏడాది ఆర్నెల్ల తర్వాత ఆగస్టులో అరకొరగా మొదలు పెట్టారు. చేసిన ఖర్చు రూ.1,040 కోట్లు. ఈ స్కీమ్‌ కోసం ఈ బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం రూ.1,420 కోట్లు. అంటే మూడేళ్లలో రూ.9,600 కోట్లకు గాను రూ.2,460 కోట్లు కేటాయించారు. అంటే రూ.7,140 కోట్లు బాకీ పడ్డారు. 

»  సూపర్‌ సిక్స్‌లో ఉచిత గ్యాస్‌ చిన్న హామీ. ఇక్కడా మోసాలే. రాష్ట్రంలో యాక్టివ్‌గా ఉన్న గ్యాస్‌ కనెక్షన్ల సంఖ్య 1.59 కోట్లు. వీటికి ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. సిలెండర్‌ ధర రూ.855 చొప్పున మూడు సిలెండర్లకు ఏడాదికి రూ.3,990 కోట్లు కేటాయించాలి. మొదటి ఏడాది కేవలం రూ.786 కోట్లు, రెండో ఏడాది రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ ప్రకారం బడ్జెట్‌లో రూ.2,199.99 కోట్లు కేటాయించారు. 2026–27లో బడ్జెట్‌లో ఈ పథకానికి 
పెట్టింది రూ.2,601 కోట్లు. అంటే మొత్తంగా రూ.6,143 కోట్లు బాకీ పడ్డారు. 

అన్నదాత సుఖీభవ పేరిట అన్నదాతలకు టోకరా  
»  ప్రతి రైతు కుటుంబానికి పీఎం కిసాన్‌ (కేంద్రం ఇచ్చేది) కాకుండా అన్నదాత సుఖీభవ పేరుతో పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు ఇస్తానని చంద్రబాబు స్పష్టంగా చెప్పాడు. (వీడియో ప్రదర్శించారు). 

» ఈ లెక్కన 2023లో మా హయాంలో లబ్ధి పొందిన 53.58 లక్షల మందికి లెక్కిస్తే ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున ఏడాదికి రూ.10,717 కోట్లు ఇవ్వాలి. తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండేళ్లు కలిపి గతేడాది రూ.40 వేల చొప్పున ఇవ్వాలి. కానీ అప్పుడొక రూ.5 వేలు, అప్పుడొక రూ.5 వేలు చొప్పున రూ.10వేలు ఇచ్చాడు. అంటే రూ.30 వేలు ఎగరగొట్టాడు.   

»  వైఎస్సార్‌సీపీ హయాంలో 53.58 లక్షల మందికి రైతులకు ఇస్తే, చంద్రబాబు హయాంలో 46.85 లక్షల మందికి రూ.4,685 కోట్లు మాత్రమే ఇచ్చాడు. అంటే ఏడు లక్షల మందికి ఎగనామం పెట్టాడు. పైగా ఈ పథకం కింద రూ.6,309 కోట్లు ఇచ్చేశామని అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు పచ్చి అబద్ధాలు చెప్పాడు. ఏడాదికి రూ.10,717 కోట్లు చొప్పున రెండేళ్లకు రూ.21,434 కోట్లు ఇవ్వాలి. కానీ ఇచ్చింది కేవలం రూ.4,685 కోట్లు.  

» అంటే ఈ ఒక్క స్కీమ్‌ ద్వారానే రైతులకు ఈ రెండేళ్లకే రూ.16,749 కోట్లు బాకీ పడ్డారు. ప్రతి రైతుకు రూ.30 వేలు బాకాయి పడ్డాడు. కౌలు రైతులకైతే మొండి చేయి చూపించారు. మూడు బడ్జెట్‌లలో కూడా జీరో. మా హయాంలో రైతు భరోసా కింద రూ.13,500 చొప్పున కౌలు రైతులకు ఇచ్చి ఆదుకున్నాం. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాదారులకు పట్టాలివ్వడమే కాకుండా రైతు భరోసా కూడా ఇచ్చాం. ఇప్పుడు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాదారులకు మూడు బడ్జెట్‌లలోనూ సున్నా. 

ఉచిత పంటల బీమాకు మంగళం 
»  చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 17 సార్లు తుపానులు, అల్పపీడనాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. చంద్రబాబు పుణ్యమా అని ఉచిత పంటల బీమా పథకం అటకెక్కింది. 

»   పంటల బీమా కోసం 2024–25లో బడ్జెట్‌లో పెట్టింది రూ.60 లక్షలు.. ఖర్చు చేసింది సున్నా. 2025–26లో రూ.1,023 కోట్లు.. రైతులకు ఇచ్చిన పరిహారం సున్నా. ఈఏడాది బడ్జెట్‌లో పెట్టింది కేవలం రూ.250 కోట్లు. 

»   2023–24 ఖరీఫ్‌కు సంబంధించి 2024 జూన్‌లో ప్రభుత్వం కట్టాల్సిన రూ.834 కోట్లు ప్రీమియం బకాయిలు కట్టక పోవడంతో రైతులు రూ.1,324 కోట్ల మేర బీమా పరిహారాన్ని నష్టపోయారు. 2023–24 రబీలో ప్రీమియం సొమ్ములు కట్టిందా అంటే అదీలేదు. 2023–24, 2024–25 వ్యవసాయ సీజన్లకు సంబంధించి సుమారు రూ.3,500 కోట్ల మేర రైతులు నష్ట పోయారు. కిందా మీద పడి ప్రీమియం చెల్లించిన రైతులు సైతం రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన తమ వాటా ప్రీమియం కట్టకపోవడం వల్ల నష్టపోవాల్సి వచ్చింది. 

» వైఎస్సార్‌సీపీ హయాంలో రైతుల తరఫున కూడా ఏటా వారు చెల్లించాల్సిన ప్రీమియం ప్రభుత్వమే కట్టి ఐదేళల్లో 54.55 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్ల బీమా లబ్ధి చేకూర్చాం. ఇన్‌పుట్‌ సబ్సిడీ విషయంలో కూడా రైతులు ఇలానే  ఇబ్బంది పడుతున్నారు. 2025–26లో మోంథా, దిత్వా తుపాన్‌లతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. 2025–26 బడ్జెట్‌లో ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం కేటాయించింది సున్నా. రైతులకు ఇచ్చింది సున్నా. గతేడాది మోంథా తుపాను వల్ల 15 లక్షల ఎకరాల్లో నష్టం జరిగితే దాన్ని 4 లక్షల ఎకరాలకు కుదించారు. మొత్తంగా రూ.900 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ బకాయిలు ఉన్నాయి. 

ధరల స్థిరీకరణ నిధి పేరిట దగా  
»   చంద్రబాబు హయాంలో ఏ ఒక్క పంటకు ఏ ఒక్క రైతుకు గిట్టుబాటు ధర దక్కిన పాపాన పోలేదు. కనీసం మద్దతు ధర కూడా దక్కడం లేదు. ధాన్యం క్వింటాకు మద్దతు ధర రూ.2,369 కాగా, ప్రతి రైతు.. క్వింటా రూ.300 నుంచి రూ.400 తక్కువకు అమ్ముకున్నారు.  గత ప్రభుత్వంలో ప్రతి రైతుకు మద్దతు ధర దక్కేలా చేయడమే కాదు.. గన్నీ బ్యాగ్, రవాణ, లేబర్‌ ద్వారా ప్రతి ఎకరాకు, ప్రతి క్వింటాకు అదనంగా రూ.252 చొప్పున మేలు జరిగేలా చేశాం. చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.961 కోట్ల ధాన్యం బకాయిలను మేము అధికారంలోకి వచ్చాక చెల్లించాం. 

»  ఈ ప్రభుత్వం దారుణంగా రైతుల జీవితాలతో ఆడుకుంటోంది. ఇప్పుడు శనగకు కనీస మద్దతు ధర రూ.5,875 కాగా, రూ.5 వేలకు అమ్ముకుంటున్నారు. మా హయాంలో రూ.8 వేల ధర లభించేలా చేసి రైతులకు మేలు చేశాం.  

»   ధరల స్థిరీకరణ నిధి కోసం 2024–25లో రూ.300 కోట్లు కేటాయించి, ఖర్చు చేసింది మాత్రం రూ.50.28 కోట్లే. 2025–26లో రూ.300 కోట్లు.. కానీ రివైజ్డ్‌ ఎస్టిమేట్లలో రూ.340 కోట్లు ఖర్చు చేసినట్టుగా చూపిస్తున్నారు. నిజంగా ఖర్చు చేశారో లేదా ఆ దేవుడికే తెలియాలి. 2026–27 బడ్జెట్‌లో పెట్టింది రూ.500 కోట్లు.. కానీ మా హయాంలో రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఐదేళ్లలో రూ.7,756 కోట్లు ఖర్చు పెట్టాం. మార్కెట్‌లో పోటీ తీసుకొచ్చి రైతులకు మద్దతు ధర దక్కేలా మేలు చేశాం.  ఆర్బీకేలు, ఏం యాప్‌ ద్వారా ధరలను పర్యవేక్షించే వాళ్లం.  

చంద్రబాబు సష్టించిన సంక్షోభమే
» చంద్రబాబు ఉద్దేశ పూర్వకంగా వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. అన్నీ మానవ తప్పిదాలే (మ్యాన్‌మేడ్‌ బ్లండర్స్‌). అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఇవ్వాల్సిన రూ.40 వేలకు గానూ రూ.30 వేలు ఎగ్గొట్టారు. 2025లో చంద్రబాబు లెక్కల ప్రకారమే 393 మంది రైతులు, 2,472 రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారని కార్యదర్శుల సమావేశంలో ప్రభుత్వమే ప్రకటించింది. నమోదు కానీ మరణాలు ఇంకెన్ని ఉన్నాయో చెప్పలేం.

» దురదృష్టవశాత్తు ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు గతంలో రూ.2 లక్షలున్న పరిహారాన్ని మా హయాంలో రూ.7 లక్షలకు పెంచి ఆ రైతు కుటుంబాలకు అండగా నిలిచాం. ఎక్కడైనా రైతు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి నెలకొంటే.. మరుసటి రోజే కలెక్టర్‌ లేదా జాయింట్‌ కలెక్టర్‌ నేరుగా ఆ రైతు కుటుంబం వద్దకు వెళ్లేవారు. విచారణ జరిపి 48 గంటల్లోనే ఆ కుటుంబం చేతిలో రూ.7 లక్షలు చెక్‌ పెట్టేవాళ్లు. ఇలా మా హయాంలో 1,323 రైతు కుటుంబాలను ఆదుకున్నాం. అంతేకాదు చంద్రబాబు హయాంలో 474 రైతు కుటుంబాలకు కూడా రూ.5 లక్షల చొప్పున పరిహారం మేము ఇచ్చాం.

ప్రతి అక్కా చెల్లెమ్మకు రూ.54 వేలు బాకీ  
»  సూపర్‌ సిక్స్‌లో మరో అతి ముఖ్యమైన హా­మీ.. 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.­1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తా­నన్నారు. రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడి, 60 ఏళ్ల­లోపు ఉన్న మహిళలు ఎన్నికల కమిషన్‌ డేటా ప్రకారం కోటి 80 లక్షల మంది ఉన్నారు. 

» వీరికి నెలకు రూ.1500 అంటే సంవత్సరానికి రూ.18 వేల చొప్పున ప్రతి ఏటా రూ.32,400 కోట్లు చొప్పున బడ్జెట్‌లో కేటాయించాలి. ఈ పథకం కింద మొదటి రెండు బడ్జెట్‌లలో ఈ అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది సున్నా. మూడో బడ్జెట్‌లోనూ ఇచ్చేది సున్నా. మూడేళ్లకు కలిపి అక్కచెల్లెమ్మలకు బాకీపడ్డ సొమ్ము అక్షరాలా రూ.97,200 కోట్లు. ఈ స్కీమ్‌ కింద ఈ మూడేళ్లలో అక్కచెల్లెమ్మలకు రూ.54 వేల చొప్పున బాకీ పడ్డారు.

50 ఏళ్లకే పింఛన్‌ అంటూ వంచన 
సూపర్‌ సిక్స్‌లో ఇచ్చిన మరో హామీ 50 ఏళ్లకే పింఛన్‌. ప్రతి నెలా రూ.4 వేలంటూ హామీ ఇచ్చారు. అంటే సంవత్సరానికి ఒక్కొక్కరికి రూ.48 వేలు ఇవ్వాలి. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు దాదాపు 20 లక్షల మందికి పైగానే ఉన్నారు. వాళ్లకు నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లవుతుంది. ఈ లెక్కన మూడేళ్లలో రూ.28,800 కోట్లు కేటాయించాలి. కానీ మూడు బడ్జెట్‌లలో కేటాయించింది సున్నా.

» ప్రతి ఒక్కరికి నెలకు రూ.4 వేలు చొప్పున ఏడాదికి రూ.48 వేలు. అంటే మూడేళ్లకు రూ.1.44 లక్షలు బాకీ పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement