కళాశాల అధ్యాపకుడు ఉమను బెదిరిస్తున్న టీడీపీ నాయకుడి కుమారుడు (రెడ్ షర్టు)
గంజాయి మత్తులో అర్ధరాత్రిళ్లు తలుపులు తడుతున్న కామాంధులు∙ప్రశ్నించిన అధ్యాపకులకు బెదిరింపులు
పోలీసులకు ఫిర్యాదు చేసిన కాలేజీ పిన్సిపాల్
టీడీపీ ఎమ్మెల్యే బేబీనాయన జోక్యంతో నిందితులను కేవలం బైండోవర్ చేసి వదిలేసిన పోలీసులు!
ఫిర్యాదే అందలేదన్న సీఐ!.. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో ఘటన
బొబ్బిలి రూరల్: అధికార మదంతో టీడీపీ మూకలు బరితెగిస్తున్నాయి. కాలేజీకి వెళ్తున్న విద్యార్థినులను రోడ్లపై అడ్డగించి లైంగిక వేధింపులకు పాల్పడడమే కాకుండా.. గంజాయి మత్తులో అర్ధరాత్రిళ్లు విద్యార్థినుల ఇళ్ల తలుపులు తడుతూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులేమో.. అధికార నాయకుడి జోక్యంతో వారిని బయటకు వదిలేశారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. బొబ్బిలి మండలం కోమటిపల్లిలోని ఓ ఇంట్లో కొందరు ఫార్మసీ విద్యార్థినులు అద్దెకు ఉంటూ కాలేజీకి వెళ్లివస్తున్నారు.
టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పాపారావు కుమారుడు ఆవాల మణికంఠ,అతని అన్న గురువులు కుమారుడు మోహన్‌కుమార్, కర్రిగణేష్, పెంట వినాయక ఆ విద్యార్థినులపై కొంతకాలంగా వేధింపులకు పాల్పడుతున్నారు. రాత్రి వేళ గంజాయి మత్తులో విద్యార్థినులు నివసిస్తున్న ఇళ్ల వద్దకు వెళ్లి.. తలుపులుతడుతూ భయాందోళనలకు గురిచేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చదువుకు ఆటంకం కలుగుతుందేమోనని విద్యార్థినులు భయపడుతుండడంతో వేధింపులు మరింత అధికమయ్యాయి.
బుధవారం కాలేజీకి వెళ్లే దారిలో బైక్‌లపై వచి్చన కామాంధులు.. విద్యార్థినులను అడ్డుకుని అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధించారు. బాధిత విద్యార్థినులు వెంటనే ఈ విషయాన్ని సహచర విద్యార్థులు, అధ్యాపకులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. వారు అక్కడకు చేరుకోవడంతో.. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ గ్రామం నుంచి ఎలా బయటకు వెళ్తారో చూస్తామంటూ నిందితులు బెదిరించారు. అదే సమయంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పాపారావు అక్కడకు చేరుకుని.. ‘ఏం చేసుకుంటారో చేసుకోండి.. నేను చేయాల్సింది నేను చేస్తా. అంతు తేలుస్తా’ అంటూ బెదిరించాడు.
దీంతో కాలేజీ ప్రిన్సిపాల్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని టీడీపీ నాయకులు.. బొబ్బిలి టీడీపీ ఎమ్మెల్యే బేబినాయనకు తెలియజేశారు. కేసుల నుంచి తమను తప్పించాలని కోరారు. ఆయన ఆదేశాలతో సీఐ నారాయణరావు.. నిందితులను బైండోవర్‌తో సరిపెట్టి బయటకు వదిలేసినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. తమకు ఫిర్యాదే అందలేదని సీఐ చెబుతున్నారు. దీంతో విద్యార్థినులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇలాగైతే తాము చదువుకునేదెలా? అని వాపోతున్నారు.
విద్యార్థినులపై వేధింపుల మీద ఫిర్యాదు చేశా..
మా కాలేజీ విద్యార్థినులతో బుధవారం ఉదయం కొందరు ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన అధ్యాపకులు, విద్యార్థులను బెదిరించారు. తమ గ్రామంలో ఎలా ఉంటారో చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాను. – కె.రాజేష్, ప్రిన్సిపాల్, ఫార్మా కాలేజీ


