రేపటి నుంచి గవిమఠం బ్రహ్మోత్సవాలు
ఉరవకొండ: ఉమ్మడి జిల్లాతో పాటు పొరుగున ఉన్న కర్ణాటకకూ తలమానికంగా ఉరవకొండలోని గవిమఠం నిలుస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల పరిధిలో 770 ఉపమఠాలు, రూ.కోట్ల విలువైన స్థిరాస్తులతో నిత్యమూ శివనామస్మరణతో విరాజిల్లుతున్న ప్రసిద్ధి గాంచిన ఈ శైవక్షేత్రంలో ఈ నెల 21 నుంచి చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో మఠం పీఠాధిపతి జగద్గురు చెన్నబసవ రాజేంద్రస్వామి, ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్రస్వామి, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ గంజి మల్లికార్జున ప్రసాద్ నేతృత్వంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 21న కంకణ ధారణతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. 22న నాగభరణ ఉత్సవం, 23న నెమలి వాహనోత్సవం, 24న గవిమఠ సంస్థాన 8వ పీఠాథిపతి చెన్నబసవ రాజేంద్రస్వామి అడ్డ పల్లకీ ఉత్సవం, 25న మహా గణారాధన, బసవేశ్వర వాహనోత్సవం, 26న బ్రహ్మరథోత్సవం, 27న లంకాదహనం, 28న అశ్వవాహనోత్సవం, వసంతోత్సవం ఉంటాయి. తరలి వచ్చే భక్తులు అసౌకర్యానికి గురి కాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఇన్‌చార్జ్ ఈఓ గంజి మల్లికార్జున ప్రసాద్ తెలిపారు.


