జంట హత్యల కేసులో నిందితుల అరెస్ట్
శింగనమల: ఇటీవల సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను గురువారం శింగనమల పోలీస్‌స్టేషన్‌లో సీఐ కౌలుట్లయ్య విలేకరులకు వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు... శింగనమల మండలం తరిమెల గ్రామానికి చెందిన దండోరా నల్లప్పకు ఇద్దరు భార్యలు. నల్లప్ప మరణించిన తరువాత ఆయనకు చెందిన భూమితో పాటు ఇంటిని చిన్న భార్య దండోరా ఎల్లమ్మ, ఆమె కుమారుడు దండోరా అంబేడ్కర్ అలియాస్ చిన్న తమ పేరున మార్చుకున్నారు. తమకు తెలియజేయకుండానే ఇలా చేయడంతో పెద్ద భార్య లక్ష్మీదేవి, ఆమె కుమారులు దండోరా మాదిగ జగ్జీవన్ రాం అలియాస్ మోహన్, దండోరా ఓంకార్ అలియాస్ పెట్టి రగిలిపోయారు. ఎల్లమ్మ, ఆమె కుమారుడిపై కక్ష పెంచుకున్నారు. ఈ నెల 2న రాత్రి 10.30 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న ఎల్లమ్మ, చిన్నను తమ స్నేహితులైన గార్లదిన్నె మండలం ఇల్లూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు, పెద్దవడుగూరు మండలం వీరేపల్లికి చెందిన మండ్ల సాయి కిరణ్‌తో కలిసి మోహన్, పెట్టి హతమార్చి పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలించారు. రాబడిన సమాచారం మేరకు ఈనెల 18న సాయంత్రం నాలుగు గంటల సమయంలో పాత కల్లూరు–తరిమెల రోడ్డు మార్గంలోని విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో శింగనమల, గార్లదిన్నె, నార్పల ఎస్‌ఐలు విజయకుమార్, మహమ్మద్ గౌస్, సాగర్, ఏఎస్‌ఐ చితంబరయ్య తదితరులు పాల్గొన్నారు.


