ప్రతి లే అవుట్ క్రమబద్ధీకరణకు చర్యలు
● అహుడా వైస్ చైర్మన్ విష్ణుచరణ్ ఆదేశం
అనంతపురం క్రైం: అహుడా పరిధిలోని ప్రతి లే అవుట్‌నూ క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను అనంతపురం – హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (అహుడా) వైస్ చైర్మన్ సి. విష్ణుచరణ్ ఆదేశించారు. లే అవుట్ల క్రమబద్ధీకరణ అంశంపై గురువారం అనంతపురంలోని అహుడా కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. అహుడా చైర్మన్ టి.సి. వరుణ్, సెక్రటరీ జి. రామకృష్ణారెడ్డి పాల్లొన్నారు. ఈ సందర్భంగా విష్ణుచరణ్ మాట్లాడుతూ.. ఎంఐజీ లే అవుట్లలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, ప్రతి ఫ్లాట్ కొనుగోలుదారునికి మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనధికార లేఅవుటు, ప్లాట్ల నియంత్రణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్–2020) కింద క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిన నేపథ్యంలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలన్నారు. అక్రమంగా లే అవుట్లు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఎంఐజీ పేమెంట్లు, రిజిస్ట్రేషన్ల అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో అహుడా పీఓ ఇషాక్, ఇంజినీర్ దుష్యంత్, ఈఓ అరుణ కుమారి, ఏఓ రవిచంద్రన్, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్, జేపీఓ హరీష్ చౌదరి, డీఈ రేవంత్, సర్వేయర్ శరత్ తదితరులు పాల్గొన్నారు.


