రారండోయ్‌ జాతర చూద్దాం | - | Sakshi
Sakshi News home page

రారండోయ్‌ జాతర చూద్దాం

Feb 20 2026 6:50 AM | Updated on Feb 20 2026 6:50 AM

రారండోయ్‌ జాతర చూద్దాం

రారండోయ్‌ జాతర చూద్దాం

నేటి నుంచి దాదులూరు పరుష

సుదూర ప్రాంతాల నుంచి తరలిరానున్న భక్తులు

కనగానపల్లి: ఐదు దశాబ్దాలుగా ఏటా జరుగుతున్న దాదులూరు పోతలయ్యస్వామి జాతరకు సర్వం సిద్ధమైంది. ఏటా మహా శివరాత్రి తర్వాత నిర్వహించే ఈ జాతరలో పాల్గుణ శుద్ధ పంచమి రోజున నిర్వహించే పోతలయ్యస్వామి గావుల మహోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. మూడు రోజుల పాటు జరిగే పోతలయ్యస్వామి జాతరకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచే కాకుండా బెంగళూరు, పావగడ వంటి సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు.

ఆలయ ప్రాశస్థ్యం

44వ నంబరు జాతీయ రహదారి పక్కన దాదులూరులో వెలసిన పోతలయ్య స్వామి ఆలయాన్ని రెండు గోపుర ప్రాకారాలతో నిర్మించారు. ఇందులో పోతలయ్య, చెన్నకేశవస్వామి రూపాల్లో శివ, నారాయణలు పక్క పక్కనే కొలువు దీరి ఉండటం విశేషం. వీరితో పాటు లింగమయ్యస్వామి కూడా ఇక్కడే కొలువుదీరి ఉన్నారు. జాతరకు పోతలయ్య, చెన్నకేశవ స్వామి కాపులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహిస్తారు. ఇక పోతలయ్యస్వామికి ప్రత్యేకంగా నిర్వహించే గావుల మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తారు.

నేటి నుంచి మూడు రోజుల పాటు జాతర

పోతలయ్యస్వామి జాతర శుక్రవారం నుంచి మూడు రోజులు పాటు జరుగుతుందని ఆలయ ధర్మకర్త రామలింగారెడ్డి తెలిపారు. తొలిరోజు జరిగే యలవగంప ఊరేగింపుతో జాతర ప్రారంభమవుతుందన్నారు. రామగిరి మండలం గంతిమర్రి నుంచి ప్రారంభమయ్యే ఈ ఊరేగింపు ద్వారా పోతలయ్యస్వామి కాపులు.. స్వామి వారి ఆభరణాలను బుట్టలో తీసుకొని వచ్చి అలంకరిస్తారు. రెండో రోజు శనివారం పోతలయ్య, చెన్నకేశవ స్వాములకు జ్యోతుల మహోత్సవం ఉంటుంది. ఈ సందర్భంగా చుట్టు పక్కల గ్రామాల్లోని రైతులు, భక్తులు పలహారపు బండ్లతో ఆలయ చుట్టూ తిప్పుతారు. మూడో రోజు ఆదివారం వేకువజామునే తొమ్మిది మంది పోతరాజులతో స్వామి వారికి మేక పిల్లలను బలి ఇచ్చే గావుల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. జాతరకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని పోలీస్‌, రెవెన్యూ అధికారుల సహకారంతో గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement