అమ్మ పాలకు ఇంకా అడ్డంకులా? | Breastfeeding in public is not a natural or comfortable experience for many urban women | Sakshi
Sakshi News home page

అమ్మ పాలకు ఇంకా అడ్డంకులా?

Jan 9 2026 4:01 AM | Updated on Jan 9 2026 12:27 PM

Breastfeeding in public is not a natural or comfortable experience for many urban women

అధ్యయనం

పట్నాల్లో, నగరాల్లో బిడ్డలకు పాలివ్వడానికి తల్లులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తాజా నివేదిక తెలియచేస్తోంది. పల్లెలతో పోలిస్తే పట్టణాల్లో, నగరాల్లో పాలిచ్చే తల్లులను ఇతరులు చూసే విధానం వారిని తీవ్రంగా అసౌకర్యం పాలు చేస్తోంది. దాంతో తల్లులు బయటకు రావడమే లేదని ఇప్పుడు కావాల్సింది ప్రతిచోటా బ్రెస్ట్‌ఫీడ్‌ రూమ్‌ల కంటే ‘పాలివ్వడాన్ని’ మామూలుగా చూసేలా సమాజంలో మార్పు రావాలని ఈ నివేదిక చెబుతోంది.

తల్లిపాలే బిడ్డకు తొలి ఆహారం. పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు పట్టిస్తే వారి ఆరోగ్యానికీ తల్లుల ఆరోగ్యానికీ ఎంతో మేలు. పాలు ఇవ్వలేని సమస్యలున్న తల్లులను మినహాయిస్తే మిగిలిన తల్లులందరికీ బిడ్డకు పాలివ్వడం అనిర్వచనీయమైన అనుభూతి. అయితే పల్లెలతో పోల్చితే పట్టణాలు, నగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఈ పని అత్యంత అసౌకర్యంగా మారుతోందని ‘ప్రివెంటివ్‌ మెడిసిన్‌ రీసెర్చ్‌ అండ్‌ రివ్యూస్‌’ అకడమిక్‌ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడి చేసింది. ప్రభుత్వం ఒకవైపు తల్లి పాలు ఇమ్మని ప్రచారం చేస్తున్నా అనేక అడ్డంకుల వల్ల బాలింతలు పసిబిడ్డలతో బహిరంగ ప్రదేశాలకు రావడాన్ని పరిమితం చేసుకుంటున్నారని ఈ అధ్యయనం చెప్పింది.

కారణాలు
→ పాలిచ్చే అవయవాన్ని లైంగిక దృష్టితో చూసే ధోరణి
→ పురుషులతో పాటు స్త్రీలకూ ఉన్న అభ్యంతర దృష్టి
→ వస్త్రధారణలో పరిమితులు
→ కూడని పని చేస్తున్నట్టుగామాటిమాటికి సర్దుకోవాల్సి రావడం మన దేశంలో 88.6 శాతం ప్రసవాలు వ్యవస్థాగతంగా అంటే వైద్యకేంద్రాల్లో జరుగుతుంటే వీరిలో 63.7 శాతం మంది తల్లులు మాత్రమే ఏడాది వరకూ తమ పిల్లలకు తల్లిపాలు ఇస్తున్నారు. ఆ ఇచ్చే తల్లులకు కూడా బయట సౌకర్యమైన స్థితి లేదని అధ్యయనం చెబుతోంది.

భయంతో తల్లిపాలకు దూరం
‘బిడ్డకు తల్లి పాలివ్వడం అత్యంత సహజమైన, అవసరమైన ప్రకియ. కానీ ఆమె చుట్టూ అటువంటి వాతావరణం ఏర్పాటు చేయడంలో సమాజం విఫలమైంది’ అంటున్నారు బ్రెస్ట్‌ఫీడింగ్‌ ప్రమోషన్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ ఇండియా (బీపీఎన్‌ఐ) సంస్థ కేంద్ర సమన్వయకర్త డాక్టర్‌ బిడ్లా. ‘ఇతరులు చూస్తారనో, ఎవరైనా తప్పుగా అనుకుంటారనో భయంతో చాలామంది బయటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు బిడ్డకు పాలివ్వడం మానేస్తున్నారు. మహిళలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడంతోపాటు సమాజంలో నెలకొన్న దురభి్రపాయాలను దూరం చేయాలి’ అని ఆమె అంటున్నారు.

దుస్తులది కీలకపాత్ర
బహిరంగ ప్రదేశాలలో చంటి పిల్లలకు పాలివ్వడంలో మన దేశంలో దుస్తులది కీలకపాత్ర అని అధ్యయనం తెలిపింది. చీర కొంగు, దుపట్టా లేదా ప్రత్యేకంగా కుట్టించుకున్న దుస్తులు ఉన్నప్పుడు చాటుచేసి తల్లులు సౌకర్యంగా పాలు ఇవ్వగలుగుతున్నారని, ఇతర దుస్తుల్లో ఉంటే పాలివ్వడం సమస్యగా మారుతుందని ఈ అధ్యయనం చెప్పింది. బ్రెస్ట్‌ఫీడింగ్‌ రూమ్‌ల ఏర్పాటు కంటే కూడా నిస్సంకోచంగా పాలు ఇచ్చే విధంగా సమాజ భావజాలం మారాలని అధ్యయనం చెప్పింది. స్పష్టంగా చె΄్పాలంటే బహిరంగ ప్రదేశాల్లో పిల్లలకు తల్లి ఏదైనా తినిపిస్తుంటే కలగని అసౌకర్యం పాలు ఇస్తుంటే ఎందుకు వస్తుందనేది సమాజం ఆలోచించాలని తెలిపింది.

పరిమితం... అనవసరం
బహిరంగ ప్రదేశాల్లో పాలు ఇచ్చే స్థితి లేకపోవడం వల్ల పాలిచ్చే తల్లులు తమ కదలికలను పరిమితం చేసుకుంటున్నారు. లేదా బయటకు వచ్చే ముందు అవసరం లేకున్నా చంటిబిడ్డకు పాలు తాగించి వస్తున్నారు. తల్లులు తమ ఉపాధి, పనుల కోసం బయటకు రాకుండా ఉండటం ఎంత సరికాదో అవసరం లేకపోయినా వేళగాని వేళలో పాలు తాగించడమూ సరికాదు. ఈ ఆటంకాలన్నింటి గురించి ఆలోచించే నగరాల్లో, పట్టణాల్లోని తల్లులు బిడ్డ పుట్టిన వెంటనే పోత పాలు పట్టించక తప్పని నిర్ణయానికి వస్తున్నారనేది ఒక పరిశీలన.

బ్రెస్ట్‌ ఫీడింగ్‌ రూంలు ఏవీ?
గతంలో మహిళలు వాష్‌రూంలు లేక చాలా ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం చాలాచోట్ల మహిళల కోసం వాష్‌రూంలు ఏర్పాటు చేశారు. అయితే బ్రెస్ట్‌ ఫీడింగ్‌ రూంల ఏర్పాటు మాత్రం ఆ స్థాయిలో జరగలేదు. బస్టాండ్, రైల్వే స్టేషన్‌లలో ఏర్పాటు చేసినా తగ్గ ప్రచారం లేదు. కొన్నిచోట్ల నిర్వహణ సరిగా లేక వాటిని ఇతరులు వినియోగిస్తున్నారు. ఇన్ని ఇబ్బందుల మధ్య బిడ్డలకు పాలివ్వడం తల్లులకు సంకటంగా మారింది.

మారాల్సింది సమాజమే!
బిడ్డలకు పాలిచ్చేందుకు తల్లులను సంసిద్ధం చేయాల్సిన అవసరం సమాజంలోని అందరిపైనా ఉందని నిపుణులు అంటున్నారు. వారికి తగిన స్థలం చూపించడం, సౌకర్యంగా భావించేలా వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, గోప్యత భంగం రాకుండా చూసుకోవడం అవసరం అంటున్నారు. ఇటీవల కాలంలో బహిరంగ ప్రదేశాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పెరగడం కూడా తల్లుల్లో భయాన్ని పెంచుతోంది. ఈ భయాన్ని పోగొట్టేలా వారి కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాల్సి ఉందని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement