నివాళి
మత విశ్వాసాలు, కట్టుబాట్లు, పురుషుల పెత్తనం మూసిన కిటికీలు తెరవడానికీ లేని కట్టడి... వీటి మధ్య జీలాని బానూ కథా రచయిత్రిగా జన్మెత్తగలిగింది. దశాబ్దాల పాటు ఉర్దూ కథకు, దక్కనీ సాహిత్యానికి ఆమె ధ్రువతారగా నిలిచింది. జీలానీ బానూ వల్ల హైదరాబాద్ పేరు ప్రపంచ దేశాల ఉర్దూ సాహిత్య ప్రేమికులకు తెలిసింది. ఆదివారం కన్నుమూసిన జీలానీ బానూ (89) నివాళి.
ఇప్పటి మాట కాదు. ఒక డెబ్బయి అయిదు... ఎనభై ఏళ్ల క్రితం సంగతి. అప్పట్లో హైదరాబాద్ నాంపల్లి సమీపంలోని మల్లెపల్లి బస్తీ ‘ఏ’ టైప్ క్వార్టర్‌లో పెరట్లో పిల్లలు రాత్రయితే కథలు చెప్పుకునేవారు. వాళ్లు అప్పటికే మల్లెపల్లిలో ఆడే భాగవత, రామాయణ, భారతం కథలు నాటకాలుగా చూసుండేవారు. అవే చెప్పుకునేవారు. ఆ అమ్మాయి రామాయణం కథ చెప్తుండేది.
అందులో లక్ష్మణరేఖ గీసి లక్ష్మణుడు వెళ్లి΄ోయాక సీతను ఎత్తుకెళ్లడానికి రావణుడు వస్తాడు. అంతవరకూ ఆ అమ్మాయి సరిగానే చెప్పేది. ఆ తర్వాత మార్చేసేది. దాని ప్రకారం సీత గీత దాటదు. పైగా రావణుణ్ణి చితకబాది తరిమికొడుతుంది. ఇలా మార్చి చెప్పడం ఇతర పిల్లలకు నచ్చేది కాదు. కాని సీత కష్టాలు పడటం ఆ అమ్మాయికి నచ్చేది కాదు.ఆ అమ్మాయి పెరిగి పెద్దదయ్యి కష్టాలు పడే స్త్రీలకు మనోధైర్యం ఇస్తూ ఎన్నో కథలు రాసింది. జీలానీ బానూగా ప్రఖ్యాతి పొందింది.
జీలానీ బానూ తల్లిదండ్రులది ఉత్తర ప్రదేశ్‌లోని ‘బదయూ’ ప్రాంతం. అక్కడంతా స్త్రీలకు రకరకాల కట్టుబాట్లు ఉండేవి. వారు కిటికీల్లో నుంచి బయటకు చూడకూడదు. మగాళ్లు తిరిగే చోట్లకు వెళ్లకూడదు. చాయ్ తాగకూడదు. పాన్ తినకూడదు. అలాంటి చోటు నుంచి జీలానీ బానూ తల్లిదండ్రులు హైదరాబాద్‌కు తరలి వచ్చారు. బానూ తండ్రి హసన్ హైరత్ నిజాం సంస్థానంలో ఉర్దూ శాఖలో పని చేసేవారు. స్వయంగా పెద్ద కవి. ఆయన పేరుతో మల్లేపల్లిలో ‘హైరత్ బదయూని రోడ్డు’ ఉంది. ఆయన తన సంతానంలోని ముగ్గురు ఆడపిల్లలను పుస్తకాలు చదివించడానికి ప్రోత్సహించారు. ‘ఇళ్లల్లో తప్పనిసరిగా ఆడపిల్లలకు ఉర్దూ నేర్పించేవారు. ఉర్దూను స్త్రీలే కాపాడారు’ అంటారు జీలానీ బానూ. అలా బానూకు ఉర్దూ సాహిత్యంతో పరిచయం ఏర్పడింది.
జీలానీ బానూ బాల్యంలో ఆమె తండ్రి కోసం ఎందరో సాహితీ వేత్తలు ఇంటికి వచ్చేవారు. వారిలో సినీ కవులు షకీల్ బదయూనీ, కైఫీ ఆజ్మీతో పాటు హైదరాబాద్ కవి మగ్దూమ్ మొహియుద్దీన్ కూడా ఉండేవారు. పుస్తకాలు చదివీ చదివీ, రాయడానికి కాగితాలు దొరక్క సూపరిటెండెంట్ అయిన తన మేనమావ పారేసిన ఫైళ్లలోని కాగితాలు సేకరించి వాటి వెనుకవైపు ఖాళీపై కథలు రాయడం మొదలు పెట్టారు జీలానీ బానూ. అప్పట్లో బొంబాయి రేడియోకి పిల్లల నాటకం రాసి పంపితే దానిని ప్రసారం చేయడమే కాకుండా 10రూపాయల పారితోషికం పంపారు.
ఆ రోజుల్లో 10 రూపాయలు చాలా పెద్ద మొత్తం. అది జీలానీ బానూ తొలి సంపాదన. ప్రయివేటుగా మెట్రిక్ చదివి, ప్రయివేటుగా ఉస్మానియా నుంచి బి.ఏ. చేసిన బానూ, ప్రయివేటుగానే ఎం.ఏ. ఉర్దూ కూడా చదివారు. ఆ సమయంలోనే తమ బస్తీలోని ఒక అమ్మాయిని పురుషులు మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటే ఆ ఘటనకు చలించి ‘మోమ్ కి మరియమ్’ (1954) అనే కథ రాశారు. దానిని లాహోర్‌లోని ‘అదబే లతీఫ్’ అనే పత్రికకు పంపితే ప్రచురితమై విశేషమైన పేరు తెచ్చింది. ఆ రోజు నుంచి జీలానీ బానూ దక్కన్ ప్రాంతంలో ఎంత ప్రసిద్ధి చెందారో లాహోర్‌లో కూడా అంతే ప్రసిద్ధి చెందారు.
జీలానీ బానూ ఇంట్లో లక్ష్మీ అనే ఆయా పని చేసేది. ఆ ఆయా మంచి మాటకారి. కామారెడ్డిలోని భిక్నూర్ వాళ్ల ఊరు. ఆ ఊరిలో బావికి లోను ఇచ్చామని చెప్పి అధికారులు బావి తవ్వకుండా డబ్బు మింగేశారని లక్ష్మీ జీలానీ బానూకు చెప్పింది. ఆ సంఘటన ఆధారంగా బానూ రాసిన ‘నర్సయ్యా కి బావ్‌డీ’ (నర్సయ్య బావి) ప్రపంచ సాహిత్యంలో అత్యుత్తమ కథగా నిలిచింది. దానిని శ్యామ్ బెనగళ్ ‘వెల్‌డన్ అబ్బా’గా సినిమా తీశాడు.
జీలానీ బానూ ఇలాగే సమకాలీన ఇతివృత్తాలపై రచనలు చేశారు. దక్కనీ నవాబుల కాలంలో స్త్రీల స్థితిగతులపై ఆమె రాసిన ‘ఐవానే గజల్’ ఉత్తమ రచన. అలాగే తెలంగాణ పల్లెటూళ్లలో భూస్వాముల దురాగతాలపై ‘బారిషే సంగ్’ నవల రాశారు. మొత్తం 22 పుస్తకాలు బానూ కలం నుంచి వెలువడ్డాయి. ఆమె రచనలు రష్యన్ భాషలో అనువదితమై ఆమెకు ‘సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డ్’ సంపాదించి పెట్టాయి. సాహిత్య అకాడెమీ పురస్కారం, పద్మశ్రీ, ఇంకా దేశ విదేశాల నుంచి ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి. హైదరాబాద్ వచ్చిన ప్రఖ్యాత పాకిస్తానీ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ జీలానీ బానూ ఇంటనే బస చేశారు. అంత గౌరవం జీలానీ బానూ అంటే.
జీలానీ బానూ భర్త అన్వర్ మొఅజ్జం స్కాలర్, పరిశోధకుడు. వీళ్ల పెళ్లిని కవి మగ్దూం మొహియుద్దీన్ కుదర్చడం విశేషం. జీలానీ బానూ కుమారుడు ఫర్హాన్ కంప్యూటర్ నిపుణుడు. అతను ఉర్దూ ఫాంట్‌ను, ఉర్దూ ఫాంట్‌తో పేజ్ నేషన్‌ను తయారు చేసి పత్రికల ప్రచురణలో పెద్ద మార్పు తీసుకొచ్చాడు. జీలానీ బానూ సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేశారు. ‘యూత్ ఫర్ యాక్షన్’ అనే సంస్థ ద్వారా స్త్రీల జీవనంలో మార్పు కోసం కృషి చేశారు. ఉర్దూ కథకు చిరకీర్తి సంపాదించిపెట్టిన జీలానీ బానూ తరాలు గుర్తుంటారు.
– ఖదీర్


