అనంతపురం రైల్వేస్టేషన్‌లో ఒక ప్రయాణికుడు ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి స్విగ్గీ ఏజెంట్ వెళ్లడం.. ఇంతలో రైలు కదలడంతో.. కంగారులో రన్నింగ్ ట్రైన్ నుంచి ప్లాట్ ఫామ్ పైకి దిగబోయాడు. దీంతో, అదుపు తప్పి కింద పడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈ ఘటనపై తాజాగా స్విగ్గీ సంస్థ స్పందించింది.
తాజాగా స్విగ్గీ స్పందిస్తూ.. భద్రత మా పూర్తి ప్రాధాన్యత. రైలు నుంచి పడిపోయిన ఏజెంట్ సురక్షితంగా, క్షేమంగా ఉన్నాడని చెప్పుకొచ్చింది. ఏజెంట్ భద్రత వారి ప్రధాన ప్రాధాన్యత అని పేర్కొంది. ప్రోటోకాల్ ప్రకారం కదిలే రైళ్లను ఎక్కడం లేదా దిగడం వంటివి ఇప్పటికే నిషేధించినట్టు తెలిపింది. మేము ఈ ఘటనను పరిశీలించాం. హాని కలిగించే మార్గం నుండి దూరంగా ఉండటానికి మేము మా భద్రతా శిక్షణను మరింత బలోపేతం చేశాం. ఇది చాలా తీవ్రమైన భద్రతా సమస్య. రైలు డోర్/ప్లాట్‌ఫారమ్ నుండి తమ ఆహారాన్ని సేకరించమని కస్టమర్లకు స్పష్టంగా తెలియజేయాలి. ప్రోటోకాల్ పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని ఏజెంట్లను కోరింది.
ఏం జరిగిందంటే..
ఈ నెల ఆరో తేదీన రాత్రి ఏపీలోని అనంతపురం రైల్వేస్టేషన్‌లో ఏసీ కోచ్ లోని ఒక ప్రయాణికుడు ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి స్విగ్గీ ఏజెంట్ రైలెక్కాడు. ఇంతలో రైలు కదలడంతో.. కంగారులో రన్నింగ్ ట్రైన్ నుంచి ప్లాట్ ఫామ్ పైకి దిగబోయాడు. ట్రైన్ వేగం ఎక్కువగా ఉండడంతో డెలివరీ బాయ్ ప్లాట్ ఫామ్ పై పడిపోయాడు. ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లో జరిగిన ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బిజయ్ ఆనంద్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ లో ఈ వీడియోను పోస్టు చేశాడు.
“హాల్ట్ కేవలం 1-2 నిమిషాల మాత్రమే. ప్రయాణికుడు 1ACలో ఉన్నాడు. ఫుడ్ అందించే సమయానికి రైలు స్టార్ట్ అయింది. డెలివరీ బాయ్.. ఇంకా డెలివరీ చేయడానికి ఇతర ఆర్డర్‌లు ఉండడం, అతని బైక్, ఫుడ్ బ్యాగ్ స్టేషన్ బయట ఉండిపోవడంతో.. కదులుతున్న రైలు దిగాల్సిన పరిస్థితి. జీవనోపాధి కోసం డెలివరీ ఏజెంట్ తన ప్రాణాలను ప్రమాదంలో పడేసుకున్నాడు” అని బిజయ్ ఆనంద్ కామెంట్ చేశారు.
At #Anantapur station, a #Swiggy delivery boy went to deliver food to a train. The train stopped for just 1-2 minutes and then started moving. His bike and bag were outside, and he had more orders to deliver.
So, he panicked and tried to get off the moving train,
1/3 pic.twitter.com/5R8xqnQa90— Siraj Noorani (@sirajnoorani) January 9, 2026
నెటిజన్ల విమర్శలు..
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు త్వరగా డెలివరీలు ఇవ్వాలని వర్కర్లను ఒత్తిడి చేయడం సరికాదని ఈ వీడియోకు ఓ వ్యక్తి కామెంట్ చేశారు. 10 నిమిషాల డెలివరీ టార్గెట్ ను బహిష్కరించాలని మరొకరు డిమాండ్ చేశారు. మరోకరు స్పందిస్తూ.. ప్రయాణికుడు కనీసం పార్శిల్‌ను స్వీకరించడానికి రైలు డోర్ వద్దకు వచ్చి ఉండాలని అభిప్రాయపడ్డారు.


