సాక్షి, అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సవాల్ విసిరారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే చంద్రబాబుతో మాట్లాడి ఎయిమ్స్, కడపలో స్టీల్ ఫ్యాక్టరీని తీసుకురాగలరా? అని ప్రశ్నించారు. నిజంగా ప్రజల కోసం ఆలోచిస్తే రాయలసీమకు అన్యాయం చేస్తున్న చంద్రబాబును నిలదీయాలి కదా? అని కామెంట్స్ చేశారు.
తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘జేసీ ప్రభాకర్ రెడ్డి.. మా కుటుంబంపై విమర్శలు మానుకుని అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. రాయలసీమకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీరని ద్రోహం చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయకుండా అడ్డుపడ్డారు. అనంతపురం జిల్లాలో ఎయిమ్స్ ఏర్పాటు కాకుండా అడ్డుపడ్డారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ రాకుండా మొకాలడ్డారు.
జేసీ ప్రభాకర్ రెడ్డికి నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే చంద్రబాబుతో మాట్లాడి ఇవన్నీ తీసుకురాగలరా?. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై సీమకు చెందిన మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు నోరు విప్పలేదు?. మీలో సీమ పౌరుషం ఉంటే చంద్రబాబును నిలదీయాలి కదా?. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి బతుకేంటో అందరికీ తెలుసు. నాపై పిచ్చికూతలు కూయడం కాదు.. అభివృద్ధి చేసి చూపెట్టండి. అసెంబ్లీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై సీఎం రేవంత్ చర్చించారు. మీకు చేతనైతే రేవంత్ రెడ్డితో మాట్లాడండి. రాయలసీమ టీడీపీ నాయకులకు పౌరుషం చచ్చిపోయింది. దివాకర్ రెడ్డి రాజకీయాల్లో ఉంటే దీనిపై కచ్చితంగా స్పందించేవారు’ అని ఘాటు విమర్శలు చేశారు.


