ఉద్యోగులపై క్రమశిక్షణ కేసుల పరిష్కారంలో ఇంత జాప్యమా? | High Court on resolution of disciplinary cases against employees | Sakshi
Sakshi News home page

ఉద్యోగులపై క్రమశిక్షణ కేసుల పరిష్కారంలో ఇంత జాప్యమా?

Feb 27 2026 3:25 AM | Updated on Feb 27 2026 3:25 AM

High Court on resolution of disciplinary cases against employees

6 నెలల్లో పరిష్కరించాలన్న నిబంధనలు అమలు కావడం లేదు

ఇక నిరంతరం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తాం 

హైకోర్టు స్పష్టీకరణ 

4 నెలలకు ఒకసారి పురోగతిని తెలపాలని ప్రభుత్వానికి ఆదేశం

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యల కేసుల విచారణ ప్రక్రియలో జరుగుతున్న అసాధారణ జాప్యంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మూడు నుంచి ఆరు నెలల్లో ఈ కేసులు పరిష్కారం కావాలన్న ప్రభుత్వ నిబంధనలు అమలు కావడం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ కేసులను ఒక కొలిక్కి తెచ్చేందుకు అసాధారణ నిర్ణయం తీసుకుంది. వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న 5,424 కేసులు పరిష్కారం అయ్యే వరకు ఈ వ్యవహారాన్ని నిరంతరం (కంటిన్యూస్‌ మాండమస్‌) పర్యవేక్షించాలని నిర్ణయించింది. 

2025 డిసెంబర్‌ 15వ తేదీ నాటికి పెండింగ్‌లో ఉన్న 5,424 క్రమశిక్షణ చర్యల కేసులను మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 6 నెలల్లో కేసులు పరిష్కారం కావాలని ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ గడువులోపు విచారణను ముగించకుంటే ఏం చేయాలన్న దానిపై స్పష్టతనివ్వకపోవడం వల్ల ఎలాంటి ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని కోర్టు వ్యాఖ్యానించింది. 

ఇకపై నాలుగు నెలలకొకసారి ఈ కేసుల పురోగతిని తమకు తెలియచేస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ న్యాపతి విజయ్‌ ఇటీవల తీర్పు వెలువరించారు. తనపై రెండు అభియోగాలతో చేపట్టిన క్రమశిక్షణ చర్యల ప్రొసీడింగ్స్‌ను వీలైనంత త్వరగా ముగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఈఎస్‌ఐ ఆసుపత్రిలో స్పెషల్‌ గ్రేడ్‌ సివిల్‌ సర్జన్‌గా పనిచేస్తున్న జి.రవికుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.   

5,424 క్రమశిక్షణ చర్యల కేసులు
క్రమశిక్షణ చర్యల కేసుల్లో విచారణను ఎందుకు సకాలంలో ముగించడం లేదో చెప్పాలని ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)ని న్యాయమూర్తి ఆదేశించారు. కొత్త నియామకాలు, బదిలీలు, పదవీ విరమణలు, డేటా లభ్యత లోపం, ఫైళ్లు వివిధ కార్యాలయాల్లో ఉండడం, పదోన్నతుల వల్ల అధికార మార్పులు వంటి కారణాలతో క్రమశిక్షణ చర్యల కేసుల విచారణలో జా­ప్యం జరుగుతోందని ప్రధాన కార్యదర్శి రాతపూర్వకంగా హైకోర్టుకు నివేదించారు. 

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. 2025 డిసెంబర్‌ 15వ తేదీ నాటికి మొత్తం 5,75,613 మంది ఉద్యో­గులు ఉంటే,  5,70,713 మంది ఉద్యోగుల వివరాలు మ్యాప్‌ అయ్యాయి.  5,424 క్రమశిక్షణ చర్యల కేసులు పలువురు ఉద్యోగులపై పెండింగ్‌లో ఉన్నా­యి. అత్యధికంగా హోంశాఖలో 1,558, రెవెన్యూ శాఖలో 854, రవాణా, రోడ్లు భవనాల శాఖలో 384, పురపాలక శాఖలో 366 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 

జీవించే హక్కును హరించడమే: హైకోర్టు కీలక వ్యాఖ్యలు
» ఈ కేసుల విచారణలో జాప్యం రాజ్యాంగం ప్రసాదించిన గౌరవంగా జీవించే హక్కును హరిస్తోంది.  
»   క్రమశిక్షణ చర్యల కేసులు ఓ కొలిక్కి రాకుండా ఏళ్ల తరబడి పేరుకుపోతుండటంతో న్యాయస్థానాల్లో పెద్ద సంఖ్యలో కేసులు దాఖలవుతున్నాయి. 
»  ఇవి న్యాయవ్యవస్థపై మోయలేని భారాన్నిమోపడమే కాకుండా, ఉద్యోగులూ  మానసిక   వేదనకు గురవుతున్నారు.   
»  ఉద్యోగి పదవీ విరమణ ప్రయోజనాలు చాలా సందర్భాల్లో అతనిపై పెండింగ్‌లో ఉన్న క్రమశిక్షణ చర్యల కేసుతో ముడిపడి ఉంటాయి.  
»  చార్జ్‌ మెమోలతో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పిం చాలని, సీనియారిటీ పునరుద్ధరించాలని, జాప్యం ఉన్నందున క్రమశిక్షణ చర్యలను కొట్టేయాలని, పదవీ విరమణ ప్రయోజనాలు ఇప్పించాలని, అలాగే కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలని.. ఇలా పలు అంశాలపై పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలవుతున్నాయి.  
»   క్రమశిక్షణ చర్యల కేసుల్లో విచారణను త్వరగా ముగించడమన్నది కేవలం ఆ ఉద్యోగి హక్కు మాత్రమే కాదు. సంబంధిత శాఖకు సైతం ఆ హక్కు ఉంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తప్పు చేసిన ఉద్యోగులను శిక్షించి, నిజాయితీపరులైన అధికారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement