స్ట్రెచ్చర్లకూ దిక్కులేదు.. | Services not available at Guntur GGH Emergency Ward | Sakshi
Sakshi News home page

స్ట్రెచ్చర్లకూ దిక్కులేదు..

Feb 27 2026 3:21 AM | Updated on Feb 27 2026 3:21 AM

Services not available at Guntur GGH Emergency Ward

గుంటూరు జీజీహెచ్‌లో చేతులపై రోగిని ఎమర్జెన్సీ వార్డుకు మోసుకెళుతున్న బంధువులు

గుంటూరు జీజీహెచ్‌ ఎమర్జెన్సీ వార్డులో సేవలు మృగ్యం 

స్ట్రెచ్చర్లు, వీల్‌చైర్లు లేక రోగుల అవస్థలు 

నడవలేని రోగులను బంధువులే మోసుకెళ్తున్న దుస్థితి

గుంటూరు మెడికల్‌: సుస్థిర పాలన అని డబ్బాలు కొట్టు­కుంటున్న చంద్రబాబు సర్కారు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస వసతులూ కల్పించలేక చతికిలపడు­తోంది. ఫలితంగా పేద రోగులు తీవ్ర అవస్థల పాలవుతున్నారు. గుంటూరు జీజీహెచ్‌ అత్యవసర వైద్యసేవల విభాగంలో దర్శనమిచ్చిన ఈ చిత్రమే సర్కారు ఘోర వైఫల్యానికి నిదర్శనం. ఈ ఆస్పత్రిలో రోగులను వార్డులకు, వైద్యుల వద్దకు తరలించేందుకు వీల్‌చైర్లు, స్ట్రెచ్చర్లు లేవు. ఫలితంగా గురువారం అత్య­వసర సేవల కోసం తీసుకువచ్చిన ఓ రోగిని బంధువులే మోసుకెళ్లారు. 

ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. సర్కారు తీరుపై దుమ్మెత్తిపోస్తు­న్నారు. ఇదిలా ఉంటే వైద్యులూ తమకు కేటాయించిన గదుల్లో అందుబా­టులో ఉండ­డం లేదు. ఫలితంగా వైద్యసేవలు అందక రోగులు, వారి బంధువులు వార్డుల్లోనే పడిగా­పులు పడాల్సిన దుస్థితి నెలకొంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పేద రోగులు ఎక్కు­వగా గుంటూరు జీజీ­హెచ్‌కి తరలివస్తుంటారు. రోజు­కు సుమారు నాలుగు వేలకు పైగా ఓపీ ఉంటుంది. 

ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈ ఆస్పత్రిలోనే వసతుల కల్పనను ప్రభుత్వం గాలి­కొదిలేయడంపై సర్వత్రా విమ­ర్శలు వెల్లువెత్తు­తున్నాయి. రాత్రివేళల్లో అయితే ఆస్పత్రిలో దుస్థితి మరీ ఘోరంగా ఉంటుందని రోగులు చెబుతు­న్నారు. డ్యూటీ డాక్టర్లు అందుబాటు­లో ఉండడం లేదని చెబుతున్నారు. రాత్రి వేళల్లో ఎమర్జెన్సీ, ఇతర వార్డుల్లో వైద్య సేవలు సక్రమంగా అందేలా చూడాల్సిన సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంఓ వ్యవస్థ ఈ ఆసుపత్రిలో కానరాకపో­వడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement