దేవుడా.. ఏంటీ దుస్థితి! | Concerns of families of Rajahmundry adulterated milk victims | Sakshi
Sakshi News home page

దేవుడా.. ఏంటీ దుస్థితి!

Feb 27 2026 3:28 AM | Updated on Feb 27 2026 3:28 AM

Concerns of families of Rajahmundry adulterated milk victims

కల్తీ పాల బాధిత కుటుంబీకుల ఆందోళన 

బాధితుల ఆరోగ్యం నేటికీ విషమమే 

8 మందికి వెంటిలేటర్‌పైనే డయాలసిస్‌ 

ల్యాబ్‌ రిపోర్టులు రాకపోవడంతో నిట్టూరుస్తున్న వైద్యులు 

పాల వ్యాపారి గణేష్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసుల పిటిషన్‌ 

ఈ చర్యలు ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూసేందుకేనని ఆరోపణలు

సాక్షి, రాజమహేంద్రవరం/కంబాలచెరువు: కల్తీ పాలు తాగి మూత్ర­పిండాల సమస్యల బారినపడిన వారిలో 8 మంది ఆరోగ్యం ఇప్పటికీ విషమంగానే ఉంది. రాజమహేంద్రవరంలో ఇటీవల జరిగిన కల్తీ పాల ఘటనలో 21 మంది బాధితులను గుర్తించగా.. వీరిలో ఇప్పటికే ఆరుగురు మృతి చెందారు. మరో 15 మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం పొందుతున్నారు. కిమ్స్‌ ఆస్పత్రిలో 8 మంది, రెయిన్‌బో ఆస్పత్రిలో ముగ్గురు, డెల్టా ఆస్ప­త్రిలో ఇద్దరు, రవిచంద్ర ఆస్పత్రిలో ఒకరు, రవి చైతన్య ఆస్పత్రిలో మరొకరు చికిత్స పొందుతున్నారు. 

వీరిలో ఒకరిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు గురువారం విడు­దల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో వైద్యాధికారులు తెలిపారు. 8 మందిని వెంటిలేటర్‌పై ఉంచి డయాలసిస్‌ అందిస్తున్నారని, వీరి ప­రిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు. రెయిన్‌బో ఆస్ప­త్రిలో మూడేళ్లలోపు చిన్నారులు ముగ్గురు చికిత్స పొందుతున్నా­రు. ఇందులో 5 నెలల చిన్నారికి సైతం డయాలసిస్‌ చేస్తున్నారు. 

కొనసాగుతున్న రక్త నమూనాల సేకరణ 
కల్తీ పాల బాధితులను గుర్తించేందుకు వైద్యాధికారులు రక్త నమూనాలు సేకరిస్తున్నారు. 9 వైద్య బృందాలు 110 గృహాలను సందర్శించి 315 రక్త నమూనాలను సేకరించామని కలెక్టర్‌ కీర్తి సీఎంతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. 14 సరై్వలైన్స్‌ బృందాల ద్వారా 957 కుటుంబాలను ప్రతిరోజూ స్క్రీనింగ్‌ చేస్తున్నామన్నారు. 

నివేదికలు ఎప్పుడొస్తాయో 
కల్తీ పాల బాధితుల్లో 12 మంది నుంచి రక్తం, ముగ్గురి నుంచి మూత్ర నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం తిరుపతి ఐఐటీకి పంపారు. ఆ నివేదికలు గురువారం సాయంత్రానికి వస్తాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికీ రాకపోవడంతో బాధితుల్లో ఆందోళన నెలకొంది. 

ప్రత్యేక ఇంజెక్షన్ల వినియోగం ఎప్పుడో? 
ప్రముఖ నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ రవిరాజ్‌ సూచనల మేరకు ముంబై నుంచి 50 ప్రత్యేక ఇంజెక్షన్లు తెప్పించారు. వాటిని వినియోగించాలంటే రక్తం, పాల నివేదికలు ల్యాబ్‌ నుంచి రా­వా­ల్సి ఉంది. వీటిని పంపించి ఐదు రోజులు దాటుతున్నా నేటికీ రాలేదు. మ­రో మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రత్యేక ఇంజెక్షన్లను వినియోగించాలంటే ల్యాబ్‌ రిపోర్టులు తప్పనిసరి. 

పాలల్లో ఇథలీన్‌ గ్లైకా­ల్‌ కలిసి ఆస్పత్రి పాలైన బాధితులకు మాత్రమే ఈ ఇంజెక్షన్లు ఇస్తారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో క్రియాటినిన్, యూరియా అవశేషాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. వాటిని డయాలసిస్‌ చేస్తున్న వారికి వినియోగిస్తామని వైద్యులు వెల్లడించడమే తప్ప.. నేటికీ వాడిన దాఖలాలు లేవు. 

గణేష్ కస్టడీ కోరుతూ పిటిషన్‌ 
పాల వ్యాపారి గణేష్ ను అరెస్టు చేసిన పోలీసులు జడ్జి ఎదుట హాజ­రుపరచడంతో న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. దీంతో అతడిని రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించారు. గణేష్ ను 5 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ జిల్లా పోలీసులు రాజమహేంద్రవరం న్యాయస్థానంలో పిటిషన్‌ వేశా­రు. దీనిపై ఇంకా నిర్ణయం వెలువడలేదు. 

ఇప్పటికే 2 రోజులపాటు పోలీసుల వద్ద ఉన్న గణేష్ ను ఏం విచారించారో అంతుచిక్కని రహస్యంగా ఉంది. విచారణలో కల్తీపాల నిజాలు రాబట్టారా?, నిజాలు నిగ్గుతేలి ఉంటే ఎందుకు బహిర్గతం చేయడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ చర్యలు గణేష్ ను కా­పా­డేందు­కు, ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూసేందుకు చే­స్తున్న ప్రయత్నాల్లో భాగమేనని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement