కారకాస్: వెనెజువెలా నాయకుడు నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించడం సంచలనం సృష్టించింది. అయితే, మదురో నిర్భందం వేళ అమెరికా సైన్యం ప్రయోగించిన రసాయనం, టెక్నాలజీపై చర్చ మొదలైంది. అమెరికా సైన్యం దాడి సమయంలో తమకు ముక్కుల నుంచి రక్తం కారడం, వాంతులు చేసుకున్నట్టు వెనుజువెలా సైన్యం చెప్పుకొచ్చింది. ఈ మేరకు మదురోకు అత్యంత సన్నిహిత వ్యక్తి కీలక విషయాలను వెల్లడించారు.
తాజాగా మదురోకు అత్యంత సన్నిహితంగా పనిచేసిన గార్డ్ మాట్లాడుతూ.. అమెరికా దాడులు జరిగిన సమయంలో మేమంతా నికోలస్‌కు రక్షణగా విధుల్లోనే ఉన్నాం. ఒక్కసారిగా మా రాడార్ వ్యవస్థలు పనిచేయలేదు. ఏం జరిగిందో మాకు అర్థమయ్యేలోపే డ్రోన్లు మావైపునకు దూసుకొచ్చాయి. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలోనే ఒక దశలో వారు ఏదో ప్రయోగించారు. అది తీవ్రమైన ధ్వని తరంగంలాంటిది. ఒక రసాయనం వంటిది కూడా. దాంతో, మా తల లోపలి నుంచి పేలిపోతున్నట్లు అనిపించింది. మా ముక్కుల నుంచి రక్తం కారడం మొదలైంది. కొందరు వాంతులు చేసుకున్నారు. ఇంకొందరు నేలపై పడిపోయారు. ఆ సోనిక్ ఆయుధం ముందు మేం నిల్చోలేకపోయాం.
తర్వాత 20 మంది సైనికులతో 8 హెలికాప్టర్లు వచ్చాయి. సంఖ్య తక్కువే అయినా.. వెంటనే మొత్తం తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. వారు సాంకేతికంగా ఎంతో ముందున్నారు. ఇంతకుముందు చూడని పోరాట పద్ధతులను ఉపయోగించారు. అమెరికా శక్తి ముందు వెనెజువెలా సైన్యం తేలిపోయింది. మేం వందల సంఖ్యలో ఉన్నా ఉపయోగం లేకపోయింది. అమెరికాతో పోరాడగలమని ఎవరైనా అనుకుంటే అది భ్రమే అవుతుంది అని బాంబు పేల్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు.. గార్డ్ చెప్పిన మాటలను వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇదిలా ఉండగా.. గార్డ్ చెప్పిన విషయాలపై అమెరికా నిఘా విభాగంలో పనిచేసిన అధికారి స్పందించారు. ఈ క్రమంలో అమెరికా తన లక్ష్యాలను నిర్వీర్యం చేయడానికి మైక్రోవేవ్స్, లేజర్స్ వంటి వాటిని వాడి ఉండవచ్చని తెలిపారు. వాటిలో కొన్నింటి వల్ల రక్తస్రావం, నొప్పి, మంట, కదలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయని చెప్పుకొచ్చారు. దీంతో, అమెరికా సైన్యంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.


