అమ్మాయిల నోట్లో సిగరెట్‌.. చేతిలో లైటర్‌.. | Iran women lighting cigarettes for burning Khamenei photos Viral Videos | Sakshi
Sakshi News home page

అమ్మాయిల నోట్లో సిగరెట్‌.. చేతిలో లైటర్‌..

Jan 10 2026 3:28 PM | Updated on Jan 10 2026 3:35 PM

Iran women lighting cigarettes for burning Khamenei photos Viral Videos

టెహ్రాన్‌: ఇరాన్‌లో నిరసనలు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. మరోవైపు.. ఆందోళనల్లో యువతులు సిగరెట్లు తాగుతూ.. ఖమేనీ ఫొటోలను మంటల్లో కాల్చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయం​ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.

ఇరాన్‌లో సుప్రీం లీడర్‌ ఖమేనికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలు 13వ రోజుకు చేరుకున్నాయి. ఖమేనీకి వ్యతిరేకంగా దేశం అంతా ఒక్కతాటిపైకి వచ్చింది. పెరుగుతున్న ధరలు, పడిపోతున్న కరెన్సీ విలువ, విదేశీ మారకం నిల్వలతో దేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో.. అక్కడ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి ప్రజలు రోడ్డెక్కుతున్నారు. 1979 ఇరాన్ విప్లవం తర్వాత అంతటి స్థాయిలో మళ్లీ అక్కడ విప్లవ జ్వాలలు రగులుతున్నాయి.

మరోవైపు.. మహిళలు తమ హక్కులపై పోరాటం చేస్తున్నారు. శుక్రవారం ఇంటర్నెట్‌ బంద్‌ చేయడం, అంతర్జాతీయ కాల్స్‌ నిలిపివేతతో ఆ ఆగ్రహ జ్వాలలై తారాస్థాయికి చేరాయి. హిజాబ్ (బురఖా) లేకుండా బయటకు రావద్దనే కఠిన నిబంధనలున్న దేశంలో.. స్కర్టులు, మిడ్డీలు వేసుకుని యువతులు, మహిళలు నిరసనల్లో పాల్గొంటున్నారు. అంతటితో ఆగకుండగా.. ఖమేనీ ఫొటోలను సిగరెట్లతో కాలుస్తున్న దృశ్యాలు.. ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పులు పెట్టే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. దీంతో, ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కొన్ని ఏళ్లుగా ఉన్న సిగరెట్ నిషేధాన్ని కాదని.. ఏకంగా సుప్రీం లీడర్ ఫొటోతో సిగరెట్ అంటించుకోవడంపై చర్చ జరుగుతోంది. అక్కడి మహిళలు ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.  

అయితే, ఇరాన్‌లో సుప్రీం లీడర్ ఫొటోను కాల్చడం అక్కడి చట్టాల ప్రకారం పెద్ద నేరం. అది కూడా ఫొటోతో సిగరేట్ అంటించుకోవడం ఆ చట్టాల ప్రకారం క్షమించరాని నేరం. అయితే ఈ చర్య ద్వారా మహిళలు ప్రభుత్వానికి, భవిష్యత్ నాయకులకు స్పష్టమైన మెసేజ్ పంపినట్లు స్పష్టమవుతోంది. అక్కడి పురాతన చట్టాలను ధిక్కరిస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. మహిళా హక్కులు, స్వేచ్ఛపై ఇస్లాం చట్టాలు విధిస్తున్న నిర్బంధాల గోడలను కూల్చేస్తున్నామని వాళ్లు.. అంత ధైర్యంగా.. తెగింపుతో ఈ విధంగా నిరసనలకు దిగారు. ఇదిలా ఉండగా.. ‍ఖమేనీకి వ్యతిరేకంగా చేసే చర్యలను ఉపేక్షించేది లేదని అధికార వర్గాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ.. మహిళలు తిరస్కార ధోరణిలో ఇలాంటి చర్యలకు దిగటం.. మహిళలపై అణచివేతను ఎప్పటికీ సహించేది లేదని వాదనను బలంగా వినిపిస్తున్నట్లు ప్రపంచానికి సందేశం పంపుతున్నట్లు తెలుస్తోంది.

ఇక, డిక్టేటర్‌ అంతం.. ఇస్లామిక్ రిపబ్లిక్‌ అంతం.. ఇది చివరి పోరాటం! పహ్లవి తిరిగి వస్తాడు! అంటూ నినాదాలతో ఇరాన్‌ మారుమోగిపోతోంది. అసలు ఎవరీ పహ్లవి గురించి నెట్టింట వెతుకులాట కనిపిస్తోంది. రేజా పహ్లవి(Reza Pahlavi).. ఇరాన్‌ను పాలించిన చివరి షా కుమారుడు. అమెరికాలో నివసిస్తూ ఇరాన్‌  ప్రజలను పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొనాలంటూ పిలుపునిచ్చాడు. ఇరాన్‌ను పహ్లవి రాజవంశం 1925 నుంచి 1979 వరకు పాలించింది. ఆ కాలంలో రాజులు వెస్ట్రన్ సూట్లలో కనిపిస్తూ దేశాన్ని పారిశ్రామీకరణ దిశగా నడిపించారు. మహిళలు హిజాబ్ లేకుండా, చిన్న స్కర్టులతో వీధుల్లో స్వేచ్ఛగా తిరిగేవారు. వీళ్ల పాలనలో.. టెహ్రాన్ నగరం అప్పట్లో మిడిల్‌ ఈస్ట్‌ పారిస్‌గా ప్రసిద్ధి చెందింది. అయితే, ఈ వెలుగుల వెనుక షా కఠిన పాలన, అవినీతి, పాశ్చాత్య శక్తుల ప్రభావం దాగి ఉండేది. చివరకు అవినీతి కారణంగా రాజవంశం గద్దె దింపబడిందని చరిత్ర చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement